Solar Eclipse 2022: Temples Closed Due To Solar Eclipse In Telugu States - Sakshi
Sakshi News home page

Solar Eclipse: 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్య గ్రహణం

Published Tue, Oct 25 2022 8:18 AM | Last Updated on Tue, Oct 25 2022 8:58 AM

Temples Closed Due To Solar Eclipse In Telugu States - Sakshi

సాక్షి, తిరుపతి/విజయవాడ: దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఈ రోజు ఏర్పడుతోంది. ఇది కేతు గ్రస్త సూర్య గ్రహణం కావడం విశేషం. సహజంగా రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే గ్రహణాల్లో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహు గ్రస్తమని, కేతు ప్రభావంతో ఏర్పడే దానిని కేతు గ్రస్తమని అంటారు. సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంటుంది. ఈ గ్రహణ కాలం దాదాపు గంట 15 నిముషాలు పాటు ఉంటుందని పంచాగకర్తలు చెబుతున్నారు. సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేయనున్నారు.
చదవండి: AP: మహిళలకు బ్యాంకుల రెట్టింపు రుణాలు 

ఉదయం 11 గంటలకు విజయవాడ దుర్గగుడి పాటు ఉపాలయాలు మూసివేయనున్నారు. నేడు ప్రదోషకాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. రేపు(బుధవారం) స్నపనాభిషేకాలు, అర్చన, హారతి, మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు. రేపు ఉదయం నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు సాయంత్రం పంచహారతులు,పల్లకీ సేవ మాత్రమే ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.

వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆలయ తలుపులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పుణ్యా వచనం, స్వామివారికి అభిషేకం తరువాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.

సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న ఆలయ ద్వారాలు, స్వామి, అమ్మవారి ఉభయ దేవాలయాల ద్వారాలను అధికారులు మూసివేశారు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి,సంప్రోక్షణ చేయనున్నారు.  రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

యాదాద్రి ఆలయం మూసివేత
యాదాద్రి భువనగిరి జిల్లా: సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 8:50 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు(బుధవారం) స్వాతి నక్షత్రం సందర్బంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి కానున్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement