ఏఓబీని పరిశీలిస్తున్న మంత్రి అప్పలరాజు
మందస: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట పంచాయతీలో ఉన్న మాణిక్యపట్నంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొద్దిరోజులుగా సమస్యాత్మకంగా మారిన ఈ గ్రామాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సందర్శించిన సమయంలో ఒడిశా అధికారులు వ్యవహరించిన తీరు విమర్శనీయంగా మారింది. మాణిక్యపట్నం అంగన్‌వాడీ కేంద్రానికి సీల్‌వేసి, కార్యకర్త సవర లక్ష్మి భర్త గురునాథాన్ని గారబంద పోలీసులు అరెస్ట్ చేయడం.. శ్రీకాకుళం, పర్లాకిముడి కలెక్టర్ల చర్చలతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమవడం తెలిసిందే.
ఈ సమస్యను, సరిహద్దులను తెలుసుకోవడానికి మంత్రి అప్పలరాజు గురువారం మాణిక్యపట్నం వెళ్లారు. ఒడిశా అధికారులు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా.. ఆంధ్రా అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గారబంద తహసీల్దార్ ఆధ్వర్యంలో కేంద్రానికి సీల్ వేశారని, వెంటనే ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డీవీవీ సతీష్‌కుమార్, మందస ఎస్‌ఐ కోట వెంకటేశ్‌లను ఆదేశించారు. ఆంధ్రా సరిహద్దులోని గిరిజనులను తరచూ బెదిరిస్తూ.. కేసులు నమోదు చేయడం, బంధించడం ఏంటని ప్రశ్నించారు. గురునాథంపై అక్రమంగా కేసు పెట్టి, సమస్యను తీవ్రతరం చేయడానికే ఒడిశా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రా ప్రభుత్వం, అధికారులు సహనంతో వ్యవహరిస్తుండటం చేతగానితనంగా భావిస్తున్నారన్నారు. తమ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
మంత్రి వెనుదిరగగానే మొదలైన బెదిరింపులు
అక్కడి నుంచి బయలుదేరిన మంత్రి మందస వరకు వచ్చేసరికే.. ఒడిశాలోని గజపతి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ సంగారాం పండా, బీడీవో రాజారంజిత్, పోలీసులు మాణిక్యపట్నం వెళ్లి మళ్లీ గిరిజనులను బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయం తెలియడంతో మంత్రి అప్పలరాజు, సబ్ కలెక్టర్ వికాస్‌మర్మట్, తహసీల్దార్ బడే పాపారావు, ఎంపీడీవో వాయలపల్లి తిరుమలరావు, డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే మళ్లీ సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. అయినా ఒడిశా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవద్ద ఏవోబీకి సంబంధించిన రికార్డులున్నాయని చెప్పిన మంత్రి.. మీరు చూపించే ఆధారాలేంటని ఒడిశా అధికారుల్ని ప్రశ్నించారు.
తమ వద్ద కూడా ఉన్నాయన్న వారు ఎటువంటి రికార్డులు చూపించలేదు. తాము ఆంధ్రాలోనే ఉంటామని గిరిజనులు చెప్పడంతో ఒడిశా అధికారులు అసహనంతో ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించగా.. ఓ మేజిస్ట్రేట్ స్థాయిలో ఇలా వ్యవహరించడం తగదని మంత్రి హెచ్చరించారు. దీంతో గిరిజనులంతా సీఎం జగన్ జిందాబాద్, మంత్రి అప్పలరాజు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఒడిశా అధికారుల చర్యలు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని, ఆంధ్రా అధికారులు కూడా ఇదేస్థాయిలో వ్యవహరిస్తే పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీస్తుందని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం శాంతియుతంగా రెండురాష్ట్రాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సాబకోట సర్పంచి సవర సంధ్యారాము, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి డొక్కరి దానయ్య, మండల అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, యువజన కార్యదర్శి శానాపతి కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment