ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది | There is a constitutional right to defend the lives of employees | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది

Jan 23 2021 3:39 AM | Updated on Jan 23 2021 6:40 AM

There is a constitutional right to defend the lives of employees - Sakshi

మీడియాతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి

సాక్షి, అమరావతి: ‘ఎన్నికలు నిర్వహించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్‌కు ఉన్నట్టే... తమ ప్రాణాలను కాపాడుకునే రాజ్యాంగబద్ధ హక్కు ఉద్యోగులకూ ఉంది. ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యక్తిగత పంతానికి పోకుండా ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. ‘రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు. వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరవుతారా?’ అని ప్రశ్నించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయని, అది పూర్తి కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2018లోనే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినప్పటికీ అప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎన్నికల కమిషనర్‌ నాడు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్‌ 23న కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పుడే నిమ్మగడ్డకు రాజ్యాంగబద్ధ అధికారాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.

ఎన్నికల విధులంటే వేల మందిని కలవాలి.. 
ఎన్నికలు బహిష్కరిస్తామని తాము అనలేదని, ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాకే ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. ఎన్నికల కమిషనర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయాలి’ అని కోరారు. కరోనా కారణంగా న్యాయస్థానాలు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే వాదనలు వింటున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో వేలాదిమందిని కలవాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, తీర్పు ఎలా వచ్చినా ఉద్యోగుల అభిప్రాయం మాత్రం ఇదేనన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తి కాకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయొద్దని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోందని, తాము మాత్రం ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నామని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement