సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస జీడిపప్పును అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రాసెసర్ల పరిస్థితికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన, సమాచారం లేదని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
ఏపీలో 4 టీఐఈఎస్ ప్రాజెక్టులు
ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్ స్కీం (టీఐఈఎస్)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రాజెక్టులను అనుమతించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు చింతా అనూరాధ, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్‌కు మొత్తం ఖర్చు రూ.16.52 కోట్లు అని, రూ.8.15 కోట్ల గ్రాంట్ ఆమోదించగా రూ.4.15 కోట్లు విడుదల చేశామని వివరించారు. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్‌లో మూడు ప్రాజెక్టులకు రూ.220.87 కోట్లు ప్రతిపాదించగా రూ.66 కోట్లకు ఆమోదం లభించిందని, రూ.53 కోట్లు విడుదల చేశామని చెప్పారు. దీంట్లో రూ.40 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు.
ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌పై సర్వే
ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు ఈస్ట్‌కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను పీఎం గతిశక్తి ప్రణాళికలో చేర్చడానికి డీపీఆర్ తయారీకి సర్వే నిర్వహిస్తున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. డీపీఆర్ వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏపీలో లిథియం అన్వేషణ
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలు, పార్నపల్లె–లోపట్నునూతల ప్రాంతంలో లిథియం సంభావ్యత అంచనా వేయడానికి నిఘా సర్వే, అన్వేషణ ప్రాజెక్టును జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ, సంజీవ్‌కుమార్ సింగరి అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
10 జిల్లాల్లో 33 పత్తి సేకరణ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లోని 10 జిల్లాల్లోని 33 ప్రాంతాల్లో పత్తి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శన జర్దోష్ చెప్పారు. 1.10.2021 నుంచి 30.9.2022 సీజన్ కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, వంగా గీతా విశ్వనాథ్, గోరంట్ల మాధవ్, గొడ్డేటి మాధవి, ఎం.వి.వి.సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు.
5జీ నైపుణ్య మానవవనరులపై అధ్యయనం చేపట్టలేదు
2025 నాటికి 5జీ నైపుణ్యం కలిగిన 2.2 కోట్ల మంది మానవవనరుల అవసరంపై ఐటీ శాఖ ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మద్దాల గురుమూర్తి, బి.వి.సత్యవతి అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
పలాస జీడిపప్పు ఎగుమతి ప్రతిపాదన లేదు
Published Thu, Feb 3 2022 6:07 AM | Last Updated on Thu, Feb 3 2022 6:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment