సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎంఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించడం వల్లే శుక్రవారం ఆరుగురు మృతి చెందారని సూపరింటెండెంట్ సిద్ధానాయక్, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ రామచంద్రరావు స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ అందకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా నిరంతరంగా ఉంటుందని తెలిపారు.
గూడూరుకు చెందిన కె.సాంబయ్య (55), నెల్లూరుకు చెందిన ఎస్.లలిత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో, విపరీతంగా మద్యం అలవాటున్న నరుకూరుకు చెందిన పి.రమేష్ (42), నెల్లూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఎన్.చలపతి (52) క్లోమ గ్రంధి పాడవ్వడంతో మృతి చెందారని తెలిపారు. నెల్లూరులోని వేదాయపాళెంకు చెందిన సుందరం (70), నెల్లూరులోని పొర్లుకట్టకు చెందిన కె.చెంచమ్మ (70) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయారన్నారు. ఐదారు రోజులుగా చికిత్స పొందుతున్న వీరంతా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు సమయాల్లో మృతి చెందారనే విషయాన్ని గమనించాలన్నారు.
ఆరుగురు కూడా దీర్ఘకాలిక రోగులని, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి పెంచలయ్య విచారణ చేపట్టారు. శనివారం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్య సేవలు బాగున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కూడా ఎంఐసీయూ వార్డును పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. ఆక్సిజన్ ట్యాంకును, పైపులను టెక్నీషియన్ ద్వారా పరిశీలించారు. ఆస్పత్రి సేవల్లో ఎక్కడా లోపం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment