(గుంటూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు, జాతి, రాజ్యాంగ వ్యతిరేకమైనవని ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ సభ్యుడు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. ఆ చట్టాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలోని ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో 180 రోజులుగా జరుగుతున్న పోరాటం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక నిరసన అని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు – వ్యవసాయం, ప్రజలపై ప్రభావం అనే అంశంపై ఆదివారం గుంటూరులో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘రెట్టింపు ఆదాయం అటకెక్కిందా?
2017 జనవరిలో ప్రధాని, ఆర్థికమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2022 నాటికి అంటే మరో 4 నెలల్లో రైతుల ఆదాయం రెట్టింపు కావాలి. ఆ హామీ ఇచ్చిన పెద్దలు ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. రైతు ఆదాయం పెరక్కపోగా తగ్గిపోతోంది. 2013 నాటి జాతీయ నమూనా సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబ ఆదాయం నెలకు సగటున రూ.6,426. కరోనాతో ఆ ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని పెద్ద కంపెనీల ఇష్టారాజ్యానికి వదిలేసేందుకు కుట్ర పన్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. రాజ్యసభలో మూజువాణి ఓటుతో బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నారు. అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ వ్యవసాయ చట్టాలపై వివాదాలను కోర్టులకు బదులు కలెక్టర్లు, తహసీల్దార్లతో ఏర్పాటయ్యే అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లోనే తేల్చుకోవాలన్నారు.
కనుక ఇది జాతి వ్యతిరేకం. అధికారులు తీసుకున్న చర్యల్లో, చేసిన సెటిల్‌మెంట్లలో సివిల్ కోర్టులు సహా ఇతరులు జోక్యం చేసుకునే అధికారం లేదంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రమాదకరమో ఊహించండి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే కార్పొరేట్ లేదా కాంట్రాక్ట్ సేద్యం చేయించే సంస్థలు చెప్పింది చేయాలే తప్ప రైతుల ప్రమేయం ఏమీ ఉండదు. రైతు నిపుణులతో కిసాన్ కమిటీ వేసి సాగుదార్ల వాస్తవ స్థితిగతులను పరిశీలించాలి. సాగురంగ సమస్యల్ని చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం నిర్వహించాలి. ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునేంతవరకు కిసాన్ బచావో కమిటీలు వేసి ఊరూరా ప్రచారం, ఆందోళనలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే పాలకులు దిగివస్తారు..’ అని సాయినాథ్ పేర్కొన్నారు. ఏపీ కౌలురైతుల సంఘం ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం నాయకుడు వి.కృష్ణయ్య, కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆ మూడు చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం
Published Mon, Aug 30 2021 2:28 AM | Last Updated on Mon, Aug 30 2021 2:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment