సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సర్కారు బడి పిల్లలు అన్ని అంశాల్లోను కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. ఇందులో భాగంగా.. బడికి వచ్చే పిల్లలకు నాణ్యమైన స్కూలు బ్యాగు, సాక్సులు, బూట్లు, బెల్టుతో పాటు ఆకట్టుకునే యూనిఫామ్‌ను సైతం అందిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ 2023–24 విద్యా సంవత్సరానికి మరింత మెరుగైన, ఆకర్షణీయమైన రంగుల్లో యూనిఫామ్ ఇవ్వనుంది.
ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్పున 39,95,992 మంది విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్‌ను జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఇచ్చిన క్లాత్ సరిపోలేదని పలుచోట్ల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈసారి యూనిఫామ్ కొలతలను పెంచారు. బాలికలకు ముదురు లావెండర్ రంగులో గౌను, లావెండర్ రంగులో చెక్స్‌తో టాప్.. బాలురకు ముదురు నీలంపై నల్ల రంగు చెక్స్ చొక్కా, డార్క్ మిడ్‌నైట్ బ్లూ రంగులో ఫ్యాంటు/నిక్కర్ ఉండనున్నాయి. అలాగే..
♦ చొక్కా–నిక్కర్, గౌను, ప్యాంటు, చుడిదార్.. ఇలా బాలురు, బాలికలకు రెండు రంగుల్లో యూనిఫామ్ ఇస్తున్నప్పటికీ తరగతులను బట్టి డిజైన్‌ను ఎంపికచేశారు.
♦ ఒకటి నుంచి 7వ తరగతి వరకు బాలురకు హాఫ్ చేతుల చొక్కా, నిక్కర్.. 8 నుంచి 10వ తరగతి వరకు హాఫ్ చేతుల చొక్కా ఫుల్ ప్యాంట్ ధరించాలి.
♦ బాలికల విషయంలో.. ఒకటి, రెండు తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, గౌను.. 3, 4, 5 తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, స్కర్టు.. ఆరు నుంచి 10వ తరగతి బాలికలు చున్నీతో చుడిదార్ యూనిఫామ్‌గా నిర్ణయించారు.
♦ ఆయా తరగతులను అనుసరించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 1.25 మీటర్ల నుంచి 3.30 మీటర్ల ప్యాంట్ క్లాత్.. 1.80 మీ. నుంచి 3.30 మీ. చొక్కా క్లాత్ అందిస్తున్నారు.
♦ బాలికలకు 3.60 మీ. నుంచి 3.80 మీ. గౌను/చుడిదార్ బాటమ్.. 2.10 మీ. నుంచి 4.20 మీ. చొక్కా/చుడిదార్ టాప్ క్లాత్ ఇస్తున్నారు.
♦ గత ఏడాది పంపిణీ చేసిన యూనిఫామ్ క్లాత్ సరిపోలేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసారి విద్యార్థులందరికీ ఇచ్చే క్లాత్‌ను 23–60 శాతం అదనంగా అందిస్తున్నారు.
యూనిఫామ్ కుట్టించి.. పరిశీలించి..
ఒకటో తరగతి నుంచి 10వ తరగతి బాల బాలికలకు వేర్వేరు కొలతల్లో క్లాత్ ఇస్తున్నారు. ఇచ్చిన క్లాత్‌లో మూడు జతలు వస్తాయా.. రావా? అని ఒకటికి రెండుసార్లు అధికారులు పరిశీలించారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలను ఎంపిక చేసి, వారి కొలతలను తీసుకున్నారు. తరగతుల వారీగా ఇచ్చిన క్లాత్‌తో మూడు జతల యూనిఫారాలు రావడంతో సంతృప్తి చెందిన అనంతరం క్లాత్‌ను విద్యా కానుక కిట్‌లో అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment