సాక్షి, అమరావతి: అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్‌ను నిగ్గు తేల్చేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ స్కామ్‌లో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చి.. వారిని అరెస్టు చేసేందుకు ఇవి శనివారం రంగంలోకి దిగాయి. కృష్ణా జిల్లా నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటల్లో ప్రజల నుంచి లక్షలాది రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్ కోఆపరేటివ్ సొసైటీ’పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన సొసైటీ చైర్మన్ కె.ప్రకాశరావు, సొసైటీ డైరెక్టర్లు, మేనేజర్ తదితర ప్రధాన ఉద్యోగులు, ఏజెంట్లపై సెక్షన్ 406, 420తోపాటు ఐపీసీ సెక్షన్ 5, ఏపీపీడీఎఫ్‌ఈ యాక్ట్–1999 సెక్షన్ల ప్రకారం నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో బ్యాంక్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు, ఉద్యోగుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాస్ చెప్పారు. బ్యాంకు తరహా కార్యకలాపాలు నిర్వహించిన అమరావతి కేపిటల్ సొసైటీ ఎంతమంది నుంచి ఎన్ని లక్షల రూపాయల డిపాజిట్లు వసూలు చేసింది.. ఈ సొసైటీలో ఎంతమంది నిర్వాహకులున్నారు.. వంటి వివరాలను ప్రత్యేక పోలీస్ బృందాలు ఆరా తీస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ కార్యకలాపాల రికార్డులు, కంప్యూటర్లు తదితరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించనున్నారు.
తక్కువ సమయంలోనే భారీ వసూళ్లు
కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటలపై దృష్టి పెట్టిన సొసైటీ నిర్వాహకులు తక్కువ సమయంలోనే పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు సేకరించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ 3 ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు రూ.35 లక్షలకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే డిపాజిటర్లు ఉన్నారని, అయితే ఫిర్యాదు చేస్తే డబ్బులు రావేమో అనే భయంతో వారు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ముందుకు వచ్చి సమాచారం ఇస్తే ఈ మొత్తం రూ.50 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు శనివారం నూజివీడుకు వెళ్లి అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్ విషయమై స్థానిక పోలీసులతో సమీక్షించారు. పూర్తి వివరాలు సేకరించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని ఆదేశించారు.
అమరావతి స్కామ్ విచారణకు మూడు ప్రత్యేక బృందాలు
Published Sun, Mar 14 2021 4:09 AM | Last Updated on Sun, Mar 14 2021 4:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment