special police team
-
అమరావతి స్కామ్ విచారణకు మూడు ప్రత్యేక బృందాలు
సాక్షి, అమరావతి: అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్‌ను నిగ్గు తేల్చేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ స్కామ్‌లో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చి.. వారిని అరెస్టు చేసేందుకు ఇవి శనివారం రంగంలోకి దిగాయి. కృష్ణా జిల్లా నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటల్లో ప్రజల నుంచి లక్షలాది రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్ కోఆపరేటివ్ సొసైటీ’పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన సొసైటీ చైర్మన్ కె.ప్రకాశరావు, సొసైటీ డైరెక్టర్లు, మేనేజర్ తదితర ప్రధాన ఉద్యోగులు, ఏజెంట్లపై సెక్షన్ 406, 420తోపాటు ఐపీసీ సెక్షన్ 5, ఏపీపీడీఎఫ్ఈ యాక్ట్–1999 సెక్షన్ల ప్రకారం నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంక్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు, ఉద్యోగుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాస్ చెప్పారు. బ్యాంకు తరహా కార్యకలాపాలు నిర్వహించిన అమరావతి కేపిటల్ సొసైటీ ఎంతమంది నుంచి ఎన్ని లక్షల రూపాయల డిపాజిట్లు వసూలు చేసింది.. ఈ సొసైటీలో ఎంతమంది నిర్వాహకులున్నారు.. వంటి వివరాలను ప్రత్యేక పోలీస్ బృందాలు ఆరా తీస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ కార్యకలాపాల రికార్డులు, కంప్యూటర్లు తదితరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించనున్నారు. తక్కువ సమయంలోనే భారీ వసూళ్లు కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటలపై దృష్టి పెట్టిన సొసైటీ నిర్వాహకులు తక్కువ సమయంలోనే పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు సేకరించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ 3 ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు రూ.35 లక్షలకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే డిపాజిటర్లు ఉన్నారని, అయితే ఫిర్యాదు చేస్తే డబ్బులు రావేమో అనే భయంతో వారు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ముందుకు వచ్చి సమాచారం ఇస్తే ఈ మొత్తం రూ.50 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు శనివారం నూజివీడుకు వెళ్లి అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్ విషయమై స్థానిక పోలీసులతో సమీక్షించారు. పూర్తి వివరాలు సేకరించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
అది టీడీపీ నేతల కుట్రే
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే తెలుగుదేశం పార్టీ నేతల కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరామ్‌నగర్‌లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఆలయ ధర్మకర్త, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ప్రధాన అనుచరులు ఇద్దరితో పాటు అర్చకుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంకట వరాహసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం రెండు చేతులు డిసెంబర్ 31న ధ్వంసం అయ్యాయి. దుండగులు ధ్వంసం చేశారని తర్వాతి రోజు ఆలయ అర్చకుడు మరల వెంకట మురళీకృష్ణ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాల లోతైన విచారణలో ఆశ్చర్యం గొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేసు పూర్వాపరాలను సిట్ డీఐజీ అశోక్‌కుమార్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ శేముషీ బాజ్‌పేయి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► టీడీపీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ప్రధాన అనుచరుడు, రాజమహేంద్రవరం 42వ డివిజన్ టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త మళ్ల వెంకటరాజు, టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ మాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దంతులూరి వెంకటపతిరాజు.. విగ్రహ ధ్వంసానికి పథక రచన చేశారు. ► ఇందుకు ఆలయ అర్చకుడు మురళీకృష్ణను వారు పావుగా వాడుకున్నారు. ఇతడి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని విగ్రహం చేతులు ధ్వంసం చేయించారు. ఇందుకు అతడికి రూ.30 వేలు ముట్టజెప్పారు. ► రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు çకుట్ర పన్నారు. తొలుత ఫిర్యాదు చేసిన అర్చకుడు మురళీకృష్ణపై అనుమానం రావడంతో లోతుగా విచారించగా కుట్ర కోణం బయటపడింది. ► విగ్రహం ధ్వంసం చేసింది తానేనని, కేసును పక్కదోవ పట్టించేందుకే ఫిర్యాదు చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అర్చకుడు అంగీకరించాడు. దీంతో అర్చకుడి (మొదటి నిందితుడు)తో పాటు ఇద్దరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ► ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి పంచాయతీ వెంకటగిరిలో వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ సందీప్‌ను ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
అత్యాచారం జరగలేదు
లక్నో: హాథ్రస్ బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ(శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ‘ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అత్యాచారం కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉంది’ అన్నారు. ‘చనిపోకముందు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ.. నిందితులు తనను కొట్టారనే బాధితురాలు చెప్పింది కానీ, అత్యాచారం చేసినట్లు చెప్పలేదు’ అని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనను గ్యాంగ్ రేప్ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్ వీర్ వెల్లడించడం గమనార్హం. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో తన మెడను గట్టిగా నులిమారని, ఆ సమయంలో తన నాలుక తెగిపోయిందని ఆమె వివరించినట్లు ఎస్పీ చెప్పారు. కలెక్టర్ బెదిరింపు బాధితురాలి తండ్రిని హాథ్రస్ జిల్లా కలెక్టర్ బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ‘మీడియా వాళ్లలో సగం మంది ఈరోజు వెళ్లి పోయారు. మిగతా సగం రేపు వెళ్లిపోతారు. ఇక్కడ స్థానికంగా మీతో ఉండేది మేమే. నీ స్టేట్మెంట్ను మారుస్తావా?లేదా? అనేది నువ్వే ఆలోచించుకుని నిర్ణయించుకో’ అంటూ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బాధితురాలి తండ్రితో బెదిరింపు స్వరంతో చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రవీణ్ కుమార్ బదులివ్వలేదు. ఈ ఘటన విషయంలో అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారులు చెప్పినట్లు వినకపోతే, సమస్యలు ఎదుర్కొంటారని జాయింట్ కలెక్టర్ కూడా బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు స్థానికులు వెల్లడించారు. ఒత్తిడి చేస్తున్నారు తన స్టేట్మెంట్ను మార్చుకోవాలని అధికారులు, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తన కూతురి హత్యాచారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. యూపీలో మరో కిరాతకం బలరాంపూర్: యూపీలోని బలరాంపూర్ జిల్లాలో 22 ఏళ్ల మరో దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా, బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. యువతిపై అత్యాచారం ఘటనలో షాహిద్, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. దుండగుల దాడిలో తన కుమార్తె కాళ్లు, వెన్నెముక విరిగిపోయాయని బాధితురాలి తల్లి తెలిపారు. మంగళవారం కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లివస్తున్న తన బిడ్డను నలుగురు వ్యక్తులు అపహరించారని, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, దురాగతానికి పాల్పడ్డారని, తర్వాత రిక్షాలో తీసుకొచ్చి, తమ ఇంటి ముందు పడేశారని పేర్కొన్నారు. బాధితురాలి కాళ్లు, వెన్నుముక విరిగినట్లు పోస్టుమార్టంలో బయట పడలేదని జిల్లా ఎస్పీ దేవ్‌రంజన్ అన్నారు. -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు!
సాక్షి, చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. చర్ల మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గల పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టుతో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొని తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రత్యేక పోలీసు బలగాలు దండకారణ్యంలోకి పెద్దఎత్తున చొచ్చుకుపోతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా, డీఆర్జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు సరిహద్దుకు చేరుకొని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. సరిహద్దున బీజాపూర్ జిల్లాలో ఉన్న ఎర్రపల్లి, డోకుపాడు, తెట్టెమడుగు, యాంపు రం, జారుపల్లి, గుండ్రాయి, పాలచలమ తది తర గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రపల్లి ఎదురుకాల్పుల నేపథ్యంలో సరిహద్దులో ఉన్న తోగ్గూడెం, తిప్పాపురం, ధర్మపేట, ఎలకనగూడెం, మారాయిగూడెం, పామేడు ప్రాంతాల్లో ఉన్న బేస్‌క్యాంపులతో పాటు డీఆర్జీ, ఎస్టీఎఫ్ క్యాంపుల్లో భద్రతను పెంచారు. ఆయా క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఆకు రాలే కాలం కావడంతో ఇక నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు ఆరంభం కానుండగా, ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రమాదం వచ్చి పడుతుందోనని సరిహద్దు జనం భయకంపితులవుతున్నారు. -
బుల్లెట్ల కోసం పోలీసుల గాలింపు
సాక్షి, షాద్‌నగర్ : దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం ప్రత్యేక బృందాలు శనివారం ఉదయం గాలించాయి. చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలోని ఘటనా స్థలంలో మెటల్ డిటెక్టర్ల సాయంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వెతికారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులకు మొత్తం 12 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పోలీసులు వారిపై మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలంలో పడిన బుల్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు వాటి కోసం చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఎన్ని బుల్లెట్లు లభించాయనే వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. -
ఏజెన్సీలో ఎన్నికలు కత్తిమీద సామే..
సాక్షి, రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఎన్నికల నిర్వహణంటే పెద్ద సవాలే. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరపడమంటే పోలీసు, రెవెన్యూ యంత్రాగానికి కత్తిమీద సామే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ఈ సారి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నియోజకవర్గంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కార్యచరణ రూపొందించారు. నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం నుంచి పోలింగ్ బూత్‌లకు ఈవీఎంల తరలింపు, పోలింగ్ ముగిశాక స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రణాళిక తయారుచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో ఏడు మండలాలుండేవి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలోని భద్రాచలం డివిజన్ నుంచి నాలుగు మండలాలు కలిశాయి. దీంతో రాష్ట్రంలోనే భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం నిలిచింది. నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్నాయి. మావోలు చొరబడే అవకాశం ఉండడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నియోజకవర్గంలోని చింతూరు మండలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి 397 పోలింగ్ బూత్‌లు రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల పరిధిలో 397 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాల్లోని ఓటర్లు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా లేకుండా కొత్త పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 3,49,913 మంది జనాభా ఉండగా.. 2,55,313 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 4,25,658 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం, 183 పంచాయతీలున్నాయి. నియోజకవర్గంలో 174 పోలింగ్ కేంద్రాల్ని అతి సమస్యాత్మకంగా గుర్తించారు. వీటిలో 104 మావో ప్రభావిత ప్రాంతాలున్నాయి. మారేడుమిల్లి మండలంలో 27, చింతూరు మండలంలో 11 పోలింగ్ బూత్‌లు, అడ్డతీగలలో 10, వై.రామవరం మండలంలో 17 పోలింగ్ బూత్‌లపై మావోల ప్రభావం ఉండవచ్చని నిర్ధారించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో మావోలు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. 2004 ఎన్నికల్లో వై.రామవరం మండలంలోని విశాఖ సరిహద్దులో హింస చోటుచేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసారి పోలింగ్ బూత్‌ల నుంచి ఈవీఎంలను తరలించేందుకు రెండు హెలికాప్టర్లు వాడతారని తెలుస్తోంది. రంగంలోకి ప్రత్యేక బలగాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ బలగాలు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తిగా అన్ని ప్రాంతాలు పోలీసుల అదుపులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. పారా మిలటరీ బలగాలతోపాటు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ పార్టీల్ని రంగంలోకి దింపారు. ఎన్నికల నిర్వహణ అంశంపై చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రా పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇటీవల తెలంగాణలో సమావేశమయ్యారు. – గురుకుల నారాయణ, రంపచోడవరం -
ఇంటి వద్దకే పోలీసు సేవలు..
హైదరాబాద్: మహిళల ఆత్మగౌరవాన్ని కించపరడం, బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలలో వారిని వేధించడం వంటి నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు నలుగురు మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఎస్కే సలీమా, సైబరాబాద్ క్రైమ్స్ ఏసీపీ టి.ఉషారాణి, శంషాబాద్ ఏసీపీ అనురాధ, ఐటీ కారిడార్ ఉమెన్ ఇన్స్పెక్టర్ సునీత ప్రత్యేక బృందంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ కేసుల్లో తొలి రెస్పాండెంట్‌గా స్థానిక పోలీసులు ఉంటారని, బాధితులు ఠాణాకు రాలేకపోయినా వారి తరఫున బంధువులు ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ‘మహిళా పోలీసు అధికారులు బాధితుల ఇంటి వద్దకే వెళ్లి వారితో మాట్లాడి జరిగిన విషయాలు తెలుసుకుంటారు. వారి సంభాషణలను కూడా రికార్డు చేస్తారు. ఈ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరిస్తార’ని వివరించారు. తమతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను, బలవంతంగా బెదిరించి తీసిన ఫొటోలను ఫేస్బుక్లో ఆప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తూ తమ కోరికలు తీర్చుకునే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అటువంటి ఘటనల్లో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదుచేయాలని, వారి వివరాలన్నీ గోప్యంగా ఉంటాయని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు... క్రైం సీన్లోనే పోలీసు అధికారులు పంచనామా పూర్తి చేయాలి. బాధితుల వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. ఘటనాస్థలికి క్లూస్‌టీం తప్పనిసరిగా వెళ్లాలి. ఇవి సేకరించే మౌనసాక్ష్యాలే చాలా కేసుల్లో నేరగాళ్లకు భారీ శిక్షలు విధించేందుకు తోడ్పడుతాయి. అందుకే నేరగాళ్లను అరెస్టు చేయడమే కాదు వారికి శిక్ష పడేంత వరకు చక్కటి డాక్యుమెంటేషన్‌తో పోలీసులు ముందుకు వెళ్లాలి. ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు వెనుకాడబోం. ఠాణాకు వచ్చే బాధితుల ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాలే గానీ రోజుల తరబడి పోలీసు స్టేషన్లు చుట్టూ తిప్పుకోవద్దని సందీప్ శాండిల్య సిబ్బందిని ఆదేశించారు. -
మహిళా ఐపీఎస్‌పై దాడి
సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో నగలు దోచుకెళ్లిన దుండగుడు నెల్లూరు జిల్లాలో ఘటన రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ టీం నెల్లూరు(అర్బన్)/గూడూరు: సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారిపైనే దాడి చేసి నగలు దోచుకెళ్లిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి తమ్ముడు మురళీకృష్ణ, నెల్లూరు రైల్వే సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. ఐపీఎస్ అధికారి ఎస్.ఎం.రత్న(సేనాని మునిరత్న) స్వస్థలం సూళ్లూరుపేట కాగా చెన్నైలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తూ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు చెన్నైలో నివసించే తమ్ముడు మురళీకృష్ణ వద్దకు వెళ్లి వచ్చేవారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టేషన్లో దిగారు. అక్కడి నుంచి చెన్నైకు వెళ్లేందుకు ఏమైనా రైళ్లు ఉన్నాయా? అని టీసీని అడగడంతో గూడూరు జంక్షన్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె వచ్చిన సింహపురిలోనే మళ్లీ గూడూరుకు బయలుదేరారు. అయితే ఆమె అనుకోకుండా వికలాంగుల బోగీలో ఎక్కారు. ఆ బోగీలో ఆమెతో పాటు మరోవ్యక్తి మాత్రమే ఉన్నారు. మనుబోలు దాటగానే ఆమెపై బోగీలోని వ్యక్తి దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆమె తేరుకునేలోపు ఆగంతకుడు బంగారు చైను, గాజులు, రెండు ఉంగరాలు, పర్సులో ఉన్న రూ. 2వేల నగదు లాక్కున్నాడు. గూడూరు సమీపంలో రైలు నెమ్మదికాగానే దూకేసి పారిపోయాడు. తేరుకున్న రత్న గూడూరులో దిగి పోలీసులకు సమాచారమిచ్చారు. గూడూరు పోలీసులు అక్కడి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ముఖంపై తీవ్రంగా కొట్టడంతో ఆ భాగం ఉబ్బిందని వైద్యులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. -
మరొకరితో చనువుగా ఉందని.. హతమార్చాడు
నామక్కాల్: తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో చనువుగా ఉండటం చూసి సహించలేని ఓ యువకుడు ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఇద్దరి స్నేహితులతో కలిసి తన ప్రియురాలిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు టీంను ఏర్పాటు చేసి ఆ దిశగా విచారణ చేపట్టారు. బాలికను హత్యచేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... పెరియాన్ మలాయి అనే గ్రామంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయిని దిలీప్ కుమార్(20) అనే యువకుడు ప్రేమించాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరొకరితో చనువుగా ఉండటం చూసి దిలీప్ సహించలేకపోయాడు. పథకం ప్రకారం.. దిలిప్ తన ఇద్దరి స్నేహితుల సహాయంతో ఆమెను హత మార్చాలనుకున్నాడు. స్కూలుకు వెళుతుండగా అమ్మాయిని అడ్డగించాడు. బలవంతంగా తీసుకెళ్లి ఆమె గొంతునులిమి హతమార్చాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని గోనెసంచెలో మూట కట్టి ఖాళీ ప్రదేశంలో పడేశారు. అయితే స్కూలుకి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఖాళీ ప్రదేశంలో గొనెసంచెలో ఉన్న మృతదేహన్ని చూసి తన కూతురిగా తండ్రి గుర్తించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. బాలికను హతమార్చిన లవర్ దిలీప్ కుమార్ (20)తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.