సాక్షి, రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఎన్నికల నిర్వహణంటే పెద్ద సవాలే. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరపడమంటే పోలీసు, రెవెన్యూ యంత్రాగానికి కత్తిమీద సామే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ఈ సారి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నియోజకవర్గంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కార్యచరణ రూపొందించారు.
నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం నుంచి పోలింగ్ బూత్‌లకు ఈవీఎంల తరలింపు, పోలింగ్ ముగిశాక స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రణాళిక తయారుచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో ఏడు మండలాలుండేవి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలోని భద్రాచలం డివిజన్ నుంచి నాలుగు మండలాలు కలిశాయి. దీంతో రాష్ట్రంలోనే భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం నిలిచింది. నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్నాయి. మావోలు చొరబడే అవకాశం ఉండడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నియోజకవర్గంలోని చింతూరు మండలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి
397 పోలింగ్ బూత్‌లు
రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల పరిధిలో 397 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాల్లోని ఓటర్లు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా లేకుండా కొత్త పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 3,49,913 మంది జనాభా ఉండగా.. 2,55,313 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 4,25,658 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం, 183 పంచాయతీలున్నాయి. నియోజకవర్గంలో 174 పోలింగ్ కేంద్రాల్ని అతి సమస్యాత్మకంగా గుర్తించారు.
వీటిలో 104 మావో ప్రభావిత ప్రాంతాలున్నాయి. మారేడుమిల్లి మండలంలో 27, చింతూరు మండలంలో 11 పోలింగ్ బూత్‌లు, అడ్డతీగలలో 10, వై.రామవరం మండలంలో 17 పోలింగ్ బూత్‌లపై మావోల ప్రభావం ఉండవచ్చని నిర్ధారించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో మావోలు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. 2004 ఎన్నికల్లో వై.రామవరం మండలంలోని విశాఖ సరిహద్దులో హింస చోటుచేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసారి పోలింగ్ బూత్‌ల నుంచి ఈవీఎంలను తరలించేందుకు రెండు హెలికాప్టర్‌లు వాడతారని తెలుస్తోంది.
రంగంలోకి ప్రత్యేక బలగాలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ బలగాలు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తిగా అన్ని ప్రాంతాలు పోలీసుల అదుపులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. పారా మిలటరీ బలగాలతోపాటు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ పార్టీల్ని రంగంలోకి దింపారు. ఎన్నికల నిర్వహణ అంశంపై చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రా పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇటీవల తెలంగాణలో సమావేశమయ్యారు.
– గురుకుల నారాయణ, రంపచోడవరం
Comments
Please login to add a commentAdd a comment