
శ్రీరామ్‌నగర్‌లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ధ్వంసం కేసులో అరెస్టైన టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త మల్ల వెంకటరాజు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే తెలుగుదేశం పార్టీ నేతల కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరామ్‌నగర్‌లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఆలయ ధర్మకర్త, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ప్రధాన అనుచరులు ఇద్దరితో పాటు అర్చకుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంకట వరాహసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం రెండు చేతులు డిసెంబర్ 31న ధ్వంసం అయ్యాయి. దుండగులు ధ్వంసం చేశారని తర్వాతి రోజు ఆలయ అర్చకుడు మరల వెంకట మురళీకృష్ణ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాల లోతైన విచారణలో ఆశ్చర్యం గొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేసు పూర్వాపరాలను సిట్ డీఐజీ అశోక్‌కుమార్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ శేముషీ బాజ్‌పేయి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► టీడీపీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ప్రధాన అనుచరుడు, రాజమహేంద్రవరం 42వ డివిజన్ టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త మళ్ల వెంకటరాజు, టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ మాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దంతులూరి వెంకటపతిరాజు.. విగ్రహ ధ్వంసానికి పథక రచన చేశారు.
► ఇందుకు ఆలయ అర్చకుడు మురళీకృష్ణను వారు పావుగా వాడుకున్నారు. ఇతడి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని విగ్రహం చేతులు ధ్వంసం చేయించారు. ఇందుకు అతడికి రూ.30 వేలు ముట్టజెప్పారు.
► రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు çకుట్ర పన్నారు. తొలుత ఫిర్యాదు చేసిన అర్చకుడు మురళీకృష్ణపై అనుమానం రావడంతో లోతుగా విచారించగా కుట్ర కోణం బయటపడింది.
► విగ్రహం ధ్వంసం చేసింది తానేనని, కేసును పక్కదోవ పట్టించేందుకే ఫిర్యాదు చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అర్చకుడు అంగీకరించాడు. దీంతో అర్చకుడి (మొదటి నిందితుడు)తో పాటు ఇద్దరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
► ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి పంచాయతీ వెంకటగిరిలో వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ సందీప్‌ను ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment