ఇంటి వద్దకే పోలీసు సేవలు..
Published Fri, Sep 30 2016 4:42 PM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM
హైదరాబాద్: మహిళల ఆత్మగౌరవాన్ని కించపరడం, బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలలో వారిని వేధించడం వంటి నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు నలుగురు మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఎస్‌కే సలీమా, సైబరాబాద్ క్రైమ్స్ ఏసీపీ టి.ఉషారాణి, శంషాబాద్ ఏసీపీ అనురాధ, ఐటీ కారిడార్ ఉమెన్ ఇన్‌స్పెక్టర్ సునీత ప్రత్యేక బృందంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
ఈ కేసుల్లో తొలి రెస్పాండెంట్‌గా స్థానిక పోలీసులు ఉంటారని, బాధితులు ఠాణాకు రాలేకపోయినా వారి తరఫున బంధువులు ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ‘మహిళా పోలీసు అధికారులు బాధితుల ఇంటి వద్దకే వెళ్లి వారితో మాట్లాడి జరిగిన విషయాలు తెలుసుకుంటారు. వారి సంభాషణలను కూడా రికార్డు చేస్తారు. ఈ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరిస్తార’ని వివరించారు. తమతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను, బలవంతంగా బెదిరించి తీసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఆప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తూ తమ కోరికలు తీర్చుకునే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అటువంటి ఘటనల్లో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదుచేయాలని, వారి వివరాలన్నీ గోప్యంగా ఉంటాయని చెప్పారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు...
క్రైం సీన్‌లోనే పోలీసు అధికారులు పంచనామా పూర్తి చేయాలి. బాధితుల వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. ఘటనాస్థలికి క్లూస్‌టీం తప్పనిసరిగా వెళ్లాలి. ఇవి సేకరించే మౌనసాక్ష్యాలే చాలా కేసుల్లో నేరగాళ్లకు భారీ శిక్షలు విధించేందుకు తోడ్పడుతాయి. అందుకే నేరగాళ్లను అరెస్టు చేయడమే కాదు వారికి శిక్ష పడేంత వరకు చక్కటి డాక్యుమెంటేషన్‌తో పోలీసులు ముందుకు వెళ్లాలి. ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు వెనుకాడబోం. ఠాణాకు వచ్చే బాధితుల ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాలే గానీ రోజుల తరబడి పోలీసు స్టేషన్లు చుట్టూ తిప్పుకోవద్దని సందీప్ శాండిల్య సిబ్బందిని ఆదేశించారు.
Advertisement
Advertisement