Three Women Deceased Chandrababu Chandranna Kanuka In Guntur - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: కాటేసిన కానుక!

Published Mon, Jan 2 2023 2:25 AM | Last Updated on Mon, Jan 2 2023 10:24 AM

Three Women Deceased Chandrababu Chandranna Kanuka Guntur - Sakshi

వాహనంలో నుంచి కిట్లను మహిళల మీదకు విసిరేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

డ్రోన్‌ ఫొటోల కోసం..
చంద్రన్న కానుకలున్న లారీల వైపు అక్క చెల్లెమ్మలు ఆశగా పరుగులు తీస్తుంటే డ్రోన్‌ ఫొటోలు బాగా వస్తాయని టీడీపీ నేతలు, నిర్వాహకులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరి ఆడక వారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని నిలిపివేసి బాధితులను ఆస్పత్రికి తరలించారు.  

సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్రికల్లో ఫొటోలు, టీవీల్లో వీడియోలు, డ్రోన్‌ కెమెరా షాట్లు లక్ష్యంగా టీడీపీ ఆదివారం గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ ముగ్గురు పేద మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. అధికారంలో ఉండగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని బలిగొన్న చంద్రబాబు ప్రచారార్భాటం... గతవారం కందుకూరు ఇరుకు సందుల్లో నిర్వహించిన కార్యక్రమం 8 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ దారుణాన్ని మరచిపోకముందే నూతన సంవత్సరం తొలిరోజే మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి ముగ్గురు పేద మహిళలు బాబు వికృత రాజకీయ క్రీడకు బలయ్యారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తన రాజకీయ ప్రచార పదఘట్టనల కింద సామాన్యులు నలిగిపోతూ ప్రాణాలు అనంతవాయువుల్లో  కలసిపోతున్నా చంద్రబాబు తీరు మారడం లేదు. ఏమాత్రం పశ్చాత్తాపం కానరావడం లేదు.

మంచినీళ్లూ ఇవ్వలేదు..
సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పేద మహిళలను వికాస్‌ కాలేజీ మైదానానికి తరలించారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన ఉయ్యూరు ఫౌండేషన్‌ ఎండీ ఉయ్యూరు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు వేదిక వద్దకు చేరుకుని స్వయంగా పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పేదలను తరలించగా చంద్రబాబు సాయంత్రం 5.30 గంటలకు వేదిక వద్దకు రావడం గమనార్హం. అప్పటికే దాదాపు ఐదు గంటలకుపైగా నిరీక్షించాల్సి రావడం, కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేకపోవడంతో మహిళలు అల్లాడారు. అంత ఆలస్యంగా వచ్చినా చీరల పంపిణీని ప్రారంభించలేదు.

చీరల పంపిణీ మొదలుపెడితే చంద్రబాబు ప్రసంగం వినేందుకు ఎవరూ ఉండరనే భయంతో టీడీపీ నేతలు వాటిని మహిళలకు అందించలేదు. సాయంత్రం 5.35 గంటలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించి 6.15 గంటలకు ముగించారు. కొంత మందికి మాత్రం చంద్రబాబు సంక్రాంతి కానుకలు అందచేయగా మిగతావారికి టీడీపీ నేతలు ఇస్తారంటూ వెళ్లిపోయారు.
కానుక పంపిణీ కోసం సన్నగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు 

ఐదు నిమిషాల్లోనే...
అప్పటివరకు కానుకల పంపిణీ గురించి గొప్పగా చెప్పిన నిర్వాహకులు చంద్రబాబు నిష్క్రమించగానే మాట మార్చారు. నామమాత్రంగా కొందరికి అందించి చేతులు దులిపేసుకోవాలని భావించారు. మిగిలిన వారందరికీ డివిజన్లలోకి వచ్చి పంపిణీ చేస్తామని చెప్పడంతో మహిళలు నిర్ఘాంతపోయారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ వలంటీర్లు కూడా బాబు ప్రసంగం ముగియగానే జారుకోవడంతో పేదల్లో ఆందోళన నెలకొంది.

చీరలు పంపిణీ చేస్తామని మభ్యపుచ్చి బలవంతంగా తీసుకొచ్చి గంటల తరబడి పడిగాపులు కాశాక తీరా మొహం చాటేయడంతో వారిలో ఆక్రోశం నెలకొంది. కానుకల కోసం తోసుకుంటూ తూతూమంత్రంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు కదిలారు. తోపులాటలో ఒకరిపై ఒకరు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనలో గుంటూరు కన్నావారితోటకు చెందిన సయ్యద్‌ ఆసియా (48), ఏటీ అగ్రహారానికి చెందిన గోపిదేశి రమాదేవి (50), మారుతీనగర్‌ నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన షేక్‌ బీబీ (55) తొక్కిసలాటలో ఊపిరి ఆడక మృతి చెందారు. వీరిలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

30 కౌంటర్లంటూ.. 12 లారీల్లో 
చంద్రన్న సంక్రాంతి కానుకలను 30 కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ కేవలం 12 మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా కానుకలతో కూడిన లారీలను నేరుగా మైదానంలోకి తరలించి వాటి నుంచే పంపిణీ చేశారు.

వాహనాలను దూరంగా కాకుండా దగ్గరగా ఇరుకుగా నిలబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన 5 నిముషాల్లోనే కానుకల పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో లారీలు కదలడానికి సిద్ధమవుతున్నాయని పసిగట్టిన పేదలు కానుకల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఫలితంగా తొక్కిసలాటకు దారితీసి అమాయక మహిళలు మృత్యువాత పడ్డారు.

ఇదేం మానవత్వం! 
గుంటూరు: చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన సయ్యద్‌ ఆసియా (48)ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. టీడీపీ నేతలు, ఉయ్యూ­రు ఫౌండేషన్‌ వారు ఆసియా మృతదేహాన్ని వాహనంలోని సీటులో కాకుండా, డిక్కీలో పడేసి తీసుకు రావడం బాధితులను, చూపరులను ఎంతో బాధకు గురి చేసింది. కొంచెమైనా కనికరం లేకుండా, కనీసం మానవత్వం చూపకుండా ఇలా వ్యవహరించడం దారుణం అని పలువురు విమర్శించారు.
ఆసియాను కారు డిక్కీలో హాస్పిటల్‌కు పంపిస్తున్న టీడీపీ నాయకులు 

పోలీసులు ముందే హెచ్చరించినా..
ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్, జేసీ రాజకుమారి తదితరులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సభాప్రాంగణం 8 వేల మందికి మాత్రమే సరిపోతుందని పోలీసులు ముందుగానే హెచ్చరించినా నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల ఘటన చోటు చేసుకుంది. బ్యారి­కేడ్లు పటిష్టంగా లేవని కూడా ముందుగానే హెచ్చరించామని, వారి నిర్లక్ష్యమే ఘటనకు దారి తీసిందని ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.

జీజీహెచ్‌ వద్ద ఆర్తనాదాలు..
షేక్‌ రజియా, ప్రసాదం సీతామహాలక్ష్మి, మస్తాన్‌బీ, తెల్లమేకల మంగమ్మ, పెందుర్తి ప్రియాంక, కమాదుల సరోజని, ఎస్‌.భూలక్ష్మి, హిమంది ఉమాదేవి, తెల్లమేకల రంగమ్మ, హుస్సేన్‌బీ, గుంటముక్కల సౌందర్య, జానా దుర్గ, పఠాన్‌ ఆస్మా, నిర్మల తదితరులు తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, గుంటూరు నగరానికి చెందిన పల్లపుకుమారి, సాయికృష్ణనగర్‌కు చెందిన ఇరుగు కోటేశ్వరమ్మ, కె.ఇవలమ్మ, సీతమ్మకాలనీకి చెందిన సొప్పర కీర్తన, స్వర్ణాంధ్రనగర్‌కు చెందిన చిట్టాల శివపార్వతి, చైత్యపురి సుగాలీకాలనీకి చెందిన ధనావత్‌ అలివేలు తోపులాటలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు జీజీహెచ్‌కు  చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు మిన్నంటాయి. కొత్త ఏడాది తొలిరోజే తమ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొందని విలపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం తదితరులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి రజిని ప్రకటించారు.

నాసిరకం కిట్లతో హంగామా
గుంటూరు రూరల్‌: చంద్రన్న కానుకలంటూ సభా ప్రాంగణం వద్ద పంపిణీ చేసిన కిట్‌లో అరకిలో కందిపప్పు, ప్యాకెట్‌ పామాయిల్, అరకిలో చింతపండు, అరకిలో గోధుమపిండి, కిలో ఉల్లిపాయలు, అరకిలో బెల్లం, చీర ఉన్నాయి. కిట్‌లో మొత్తం సరుకుల విలువ రూ.300కి మించి ఉండదని వాటిని తీసుకున్న మహిళలు చెబుతున్నారు. పది వేల మందికి మాత్రమే చీరలు కొనుగోలు చేసి గుంటూరులోని నగరం, పరిసర ప్రాంతాల్లో 30 వేల మందికి టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం మహిళల ఆధార్‌ జిరాక్స్‌లను నిర్వాహకులు తీసుకున్నారు. వారి పేర్లతో టీడీపీ సభ్యత్వాలు నమోదు చేసేందుకే ఆధార్‌ సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement