Chandrababu Campaign Became Womens Cause Of Death At Guntur - Sakshi
Sakshi News home page

భారీ కానుక ఇస్తామంటూ నిలువెత్తు నయవంచన 

Published Tue, Jan 3 2023 3:31 AM | Last Updated on Tue, Jan 3 2023 7:33 PM

Chandrababu campaign became womens cause of death At Guntur - Sakshi

సభాస్థలి వద్ద టీడీపీ నేతలు నామామాత్రంగా ఏర్పాటుచేసిన బారికేడ్లు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: కానుకలంటూ ఆశ పెట్టి రప్పించిన అక్క చెల్లెమ్మల్లకు వెన్నుపోటు పొడిచారు.. రూ.300 నాసిరకం వస్తువులను రూ.వేల విలువైనవంటూ ఊరించారు.. చివరకు అవి కూడా ఇవ్వకుండా ఐదు గంటల పాటు నిర్బంధించారు.. ఆ మోసాన్ని భరించలేక కుప్పకూలిన మహిళల చావుకు చంద్రబాబు కారకుడయ్యారు! 
ప్రచార వ్యామోహం.. పేదల ప్రాణాలంటే లెక్కలేనితనం.. నిలువెత్తు నిర్లక్ష్యానికి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గుంటూరులో ఆదివారం టీడీపీ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం ఆద్యంతం ఆ పార్టీ కనుసన్నల్లోనే జరిగింది.

సభ నిర్వహణకు పోలీస్‌శాఖకు దరఖాస్తు చేసుకోవటం నుంచి సంబంధిత చలాన్ల చెల్లింపు వరకు ఏర్పాట్లన్నీ టీడీపీ నేతలే స్వయంగా పర్యవేక్షించారు. ఉయ్యూరు ఫౌండేషన్‌ పేరుతో తెరచాటున వ్యవహారాలు నడిపించారు. చంద్రన్న కానుక పంపిణీలో పాల్గొనాలంటూ పది రోజులు ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిత్యం సభా ప్రాంగణాన్ని సందర్శిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. రెండు రోజుల ముందు ఇంటింటికి తిరిగి మహిళలకు కూపన్లు ఇవ్వడంతో పాటు ఆధార్‌ జిరాక్స్‌లు తీసుకున్నారు. రూ.మూడు వేల విలువైన కానుకలు అందచేస్తున్నామంటూ ఊరించారు.

చివరకు తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన మరుక్షణమే అది ఓ ప్రైవేట్‌ కార్యక్రమమని, స్వచ్చంద సంస్థను ప్రోత్సహించేందుకు వెళ్లానని, తమ పార్టీకి దాంతో సంబంధం లేదంటూ స్వరం మార్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. తాను స్వయంగా పాల్గొన్న కార్యక్రమంలో ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడితే కనీసం పరామర్శించేందుకు కూడా ఆయనకు మనసు రాలేదు.

కందుకూరులో బాధితుల వద్దకు వెంటనే వెళ్లిన ఆయన గుంటూరులో మాత్రం చనిపోయింది పేద మహిళలు కావడంతోనే మొహం చాటేసి హైదరాబాద్‌ వెళ్లిపోయినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన అనంతరం రాత్రి నుంచి పరారీలో ఉన్న ఉయ్యూరు ఫౌండేషన్‌ ఎండీ శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
‘సంక్రాంతి కానుక’ ప్రస్తావన లేకుండా సభకు అనుమతి కోరుతూ టీడీపీ నేత శ్రావణ్‌కుమార్‌ రాసిన లేఖ  

దరఖాస్తులో కానరాని ‘‘కానుకలు’’
గుంటూరు ఓల్డ్‌ వికాస్‌ క్యాంపస్‌లో మాజీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సభకు అనుమతుల కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ స్వయంగా గుంటూరు సౌత్‌ డీఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ పది వేల మందితో సభ నిర్వహించుకుంటామని అందులో పేర్కొన్నారు. అయితే అందులో ఎక్కడా చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొనలేదు.

అది కేవలం చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యక్రమం అయితే అన్నగారి జనతా వస్త్రాలు – చంద్రన్న సంక్రాంతి కానుక అని ఎందుకు పేరు పెట్టారు? సభ నిర్వహణ అనుమతుల కోసం టీడీపీ తరపున పోలీస్‌ శాఖకు ఎలా దరఖాస్తు చేశారు? పార్టీ కార్యక్రమంగా ఎందుకు మార్చారు? స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికి టీడీపీ నాయకులు జన సమీకరణ ఎందుకు చేశారని బాధితులు నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీకి కొమ్ము కాసే ట్రస్టుల గుర్తింపును రద్దు చేయడంతోపాటు నిధుల సేకరణపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పోలీసుల సూచనలు బేఖాతర్‌..
ఇది పూర్తిగా ప్రైవేట్‌ కార్యక్రమం కావడంతో అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. క్యాంపస్‌కు ఎంట్రన్స్, ఎగ్జిట్‌ ఒకే గేటు ఉండటంతో మూడు చోట్ల ప్రహరీ పగలగొట్టించి ద్వారాలు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బ్యారికేడ్లు ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. వ్యక్తిగత కార్యక్రమానికి నిర్వాహకులే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులు వాటిని పరిశీలించి పలు సూచనలు చేసినా నిర్వాహకులు పట్టించుకోలేదు. మధ్నాహ్నం ఒంటి గంట నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మహిళలను కానుకలు పంపిణీ చేస్తామంటూ వాహనాల్లో మీటింగ్‌ ప్రదేశానికి తరలించారు.

రాగానే వాటిని అందచేస్తే తొక్కిసలాటకు అవకాశం ఉండేది కాదు. కానుకలు ఇస్తే మహిళలు వెళ్లిపోతారనే భయంతో చంద్రబాబు సభ ముగిసేవరకు సాయంత్రం ఆరు గంటల దాకా బలవంతంగా కూర్చోబెట్టారు. చంద్రబాబు సభ జరుగుతున్న సమయంలో పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే కిట్‌ల పంపిణీ ప్రారంభించాలని వేదికపై ఉన్న నాయకులను ఫోన్‌లో కోరారు.

ఓ ట్రాఫిక్‌ సీఐ వేదికమీదకు వెళ్లి మరీ పరిస్థితిని వివరించినా ఆలకించలేదు. బ్యారికేడ్లు సరిగా లేకపోవడంతో తొక్కిసలాటలో ఒరిగిపోయాయి. పోలీసులు సకాలంలో స్పందించి కానుకల పంపిణీని నిలిపివేసి తొక్కిసలాటలో చిక్కుకున్నవారిని కాపాడటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేదంటే పదుల సంఖ్యలో మరణాలు ఉండేవని బాధితులు చెబుతున్నారు. 

237 మందితో బందోబస్తు..
నూతన సంవత్సర వేడుకలతోపాటు మంగళగిరి, తెనాలిలో వైకుంఠద్వార దర్శనం బందోబస్తుకి పెద్ద సంఖ్యలో పోలీసులను సమకూర్చాల్సి వచ్చినా చంద్రబాబు సభకు ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో 207 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పరిస్థితి గమనించి మరో 30 మంది సిబ్బందిని అదనంగా రప్పించారు. వీరంతా ఉండబట్టే పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది.

ముందు జాగ్రత్తగా పోలీసులు రెండు అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేశారు. ప్రైవేట్‌ కార్యక్రమం అయినప్పటికీ బాధ్యతగా వ్యవహరించారు. ప్రైవేట్‌ కార్యక్రమాల్లో బందోబస్తు కోసం పోలీసుశాఖకు యూజర్‌ చార్జీలను చెల్లించాలి. టీడీపీ నాయకులు ఆ పని చేయకపోగా పోలీసులపైనే ఆరోపణలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
కనీస పశ్చాత్తాపం కరువు
చంద్రబాబు అరగంటకు పైగా మాట్లాడి నలుగురికి చంద్రన్న కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన వెళ్లిపోయిన నిమిషాల వ్యవధిలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ సమయానికి చంద్రబాబు కాన్వాయ్‌ మంగళగిరి కూడా చేరుకోలేదు. కొందరు నేతలు ఈ విషాదం గురించి ఆయనకు సమాచారం ఇవ్వడంతో మీరే చూసుకోవాలని స్పష్టం చేసి విమానాశ్రయానికి వెళ్లిపోయినట్లు తెలిసింది.

రాత్రి 7.02కి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అయన 7.59 నిముషాలకు ఇండిగో విమానంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. తాను పాల్గొన్న కార్యక్రమంలో ముగ్గురు మహిళలు చనిపోవడంతోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారనే విషయం తెలిసి కూడా కనీస మానవత్వం, పశ్చాత్తాపం లేకుండా చంద్రబాబు వెళ్లిపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలను జీజీహెచ్‌లో స్థానిక నేతలు మినహా అధినాయకత్వం పరామర్శించిన పాపాన పోలేదు. 

పోలీసుల అదుపులో నిందితుడు
గుంటూరు ఘటనలో తల్లిని కోల్పోయిన ఏటీ అగ్రహారం 4వ లైనుకు చెందిన గోపిదేశి నాగరాజు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు ఉయ్యూరు ఫౌండేషన్‌ ఎండీ శ్రీనివాసరావుపై 304 క్లాజ్‌ 2, 34 ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం రాత్రి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఫోన్‌ సిగ్నల్స్, నెట్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించారు. మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

బాబు కీలుబొమ్మ ‘ఉయ్యూరు’
తమకు అత్యంత సన్నిహితుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్‌ ద్వారా సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు, లోకేశ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడిగా తెరపైకి తెచ్చిన ఉయ్యూరు శ్రీనివాస్‌ టీడీపీలో క్రియాశీల నేత. పార్టీ జెండా మోసిన నేతలను పక్కనబెట్టి విదేశాల నుంచి డబ్బు సూట్‌కేసులతో దిగే ఎన్నారైలను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న చంద్రబాబు కొంతకాలంగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను ప్రోత్సహిస్తున్నారు.

గుంటూరు వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశ చూపిస్తూ ఆయన ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబుకు మీడియాలో ప్రచారం కల్పించేందుకు గుంటూరులో తాజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సీఎం జగన్‌పై విద్వేషపూరిత పోస్టులు
టీడీపీ తరపున సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఉయ్యూరు శ్రీనివాస్‌.. సీఎం జగన్, మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలపై విద్వేషపూరిత పోస్టులు పెడుతుంటాడు. లోకేశ్‌ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్‌ మీడియా విభాగం సూచనల మేరకు వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా, ఘర్షణలను ప్రేరేపించేలా వ్యవహరిస్తుంటాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement