సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చేనెలలో లబ్ధిదారులకు అందచేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇంటి వసతి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించి పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లకు సంబంధించిన పనుల పురోగతి, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాలపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చే పక్షం రోజుల్లో (శ్రావణ మాసంలో) లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు 2.62 లక్షల ఇళ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. టిడ్కో కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లు/ఫ్లాట్లను పూర్తి ఉచితంగా అందచేయనున్నామన్నారు. మిగిలిన అన్ని కాలనీల్లో నిర్మాణ పనులతో పాటు మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. అగ్రిమెంటు కుదుర్చుకున్న ఈ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా అధికారులు, బ్యాంకుల అధికారులు సమన్వయంతో చురుగ్గా వ్యవహరించాలని చెప్పారు. ఇకపై ప్రతి వారం టిడ్కో, మెప్మా అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులుంటే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూసుకోవాలని ఆయన నిర్దేశించారు.
వచ్చేనెలలో టిడ్కో ఇళ్ల పంపిణీ
Published Thu, Jul 29 2021 4:36 AM | Last Updated on Thu, Jul 29 2021 4:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment