క్యూ లైన్‌లో ఆదివారం నుంచి వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదు
అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయలేదు
దేవదాయ శాఖ మంత్రి ఆనంపై భక్తులు ఫైర్
తిరుమల: తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదని.. ఆదివారం నుంచి క్యూలైన్‌లో వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తమిళనాడుకు చెందిన బుల్లితెర నటుడు మహేశ్‌తో పాటు పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయన్ని ఆలయ అధికారి అని భావించిన తమిళనాడు భక్తులు చుట్టుముట్టేశారు. వీరిలో తమిళ నటుడు మహేశ్‌బాబు కూడా ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ.. 10 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం తిరుమలకు చేరుకున్నట్లు చెప్పారు. ఆదివారం క్యూ లైన్‌లోకి వెళ్లినా స్వామివారి దర్శన భాగ్యం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయట్లేదని మరికొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం, పాలు, మజ్జిగ ఇవ్వకపోవడంతో.. చిన్న పిల్లలతో క్యూ లైన్లలో ఉండలేక బయటకు వచ్చేశామంటూ వాపోయారు. తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదంటూ మరో భక్తుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆనం స్పందిస్తూ.. అధికారుల ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తానంటూ సర్దిచెప్పి.. అక్కడి నుంచి జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment