తిరుపతి ఉప పోరు ప్రశాంతం | Tirupati Lok Sabha Bypoll Election 2021: Polling Completed | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప పోరు ప్రశాంతం

Published Sun, Apr 18 2021 2:48 AM | Last Updated on Sun, Apr 18 2021 10:47 AM

Tirupati Lok Sabha Bypoll Election 2021: Polling Completed - Sakshi

శ్రీకాళహస్తి నియోజకవర్గం మన్న సముద్రంలో ఓటేసేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి లోక్‌సభా స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ సజావుగా కొనసాగింది. మొత్తంగా 64.29 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం పోలింగ్‌ నమోదైంది. తిరుపతి సెగ్మెంట్‌లో 50.58 శాతం మేరకే పోలింగ్‌ జరిగింది. తిరుపతి నగరంలో టీడీపీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు అనుకూల మీడియా హంగామా చేశారు. ఇది తప్పించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సాయంత్రం 7 గంటలలోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో కొన్నిచోట్ల పోలింగ్‌ ప్రక్రియ రాత్రి 9.30 వరకు కొనసాగింది. పార్లమెంటరీ స్థానం పరిధిలో మొత్తం 17,10,699 మంది ఓటర్లుండగా.. 2,470 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,99,784 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉదయం నుంచే..
శనివారం ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలవద్ద పెద్దసంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు పోలింగ్‌ వేగంగానే కొనసాగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 7.80 శాతం, 11 గంటల వరకు 17.39 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.67 శాతం, 3 గంటలకు 47.42 శాతం, 5 గంటలకు 54.99 శాతం, రాత్రి 7 గంటలకు 64.29 శాతం పోలింగ్‌ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా చూస్తే.. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో 63.81 శాతం, సర్వేపల్లిలో 66.19 శాతం, సూళ్లూరుపేటలో 70.93 శాతం, వెంకటగిరిలో 61.50 శాతం, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో 50.58 శాతం, శ్రీకాళహస్తిలో 67.77 శాతం, సత్యవేడులో 72.68 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైనట్లు రిటర్నింగ్‌ అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం మన్నసముద్రం గ్రామంలో ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి, అతని కుటుంబసభ్యులు 

స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు..
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పోలింగ్‌ను సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బీఎస్‌ఎఫ్, స్ట్రైకింగ్‌ ఫోర్స్, ప్రత్యేక బలగాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బలగాలతో సమ్యస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీగా పోలింగ్‌ చేపట్టారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే ఆయా పోలింగ్‌ కేంద్రాల నుంచి బందోబస్తు నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఈవీఎంలను తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌కు చేర్చారు. సూళ్లూరుపేటకు సంబంధించి నాయుడుపేట బాలికల జూనియర్‌ కళాశాల వసతి గృహం, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి విశ్వోదయ పాత డిగ్రీ కళాశాల, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరిచారు. ఆదివారం ఉదయం సర్వేపల్లి మినహా మిగతా మూడు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచిన ఈవీఎంలను నెల్లూరులోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలకు తరలిస్తారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్‌రూమ్‌లు 24 గంటలు ఉండనున్నాయి. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా అధికారులు వెబ్‌కాస్టింగ్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఈ కేంద్రంలోనే జరుగుతుంది.

ఎవరెవరు ఎక్కడ..
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులోని స్వగ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోట మండలం వెంకన్నపాళెంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె తిరుపతికి చేరుకుని అక్కడే మకాం వేశారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌ తిరుపతికే పరిమితమయ్యారు.
► సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌ను పూలు, బెలూన్లతో సర్వాంగ సుందరంగా అలంకరించడం విశేషం. పూర్తి పండుగ వాతావరణం తరహాలో పోలింగ్‌ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
► నెల్లూరు జిల్లాలో కలువాయి మండలం పెరంకొండ 43ఏ పోలింగ్‌స్టేషన్లో పోలింగ్‌ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించి పోలింగ్‌ కేంద్రాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేసి పోలింగ్‌ను యథావిధిగా కొనసాగించారు. చిట్టమూరు మండలం అరవపాళెం కాలనీ పోలింగ్‌ బూత్‌లో ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడు రవి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. చిట్టమూరు మండలం బురదగల్లి కొత్తపాళెంలో శాశ్వత రోడ్డు కోసం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గూడూరు సబ్‌కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ నేరుగా గ్రామస్తులతో మాట్లాడినా, కలెక్టర్‌ సైతం ఫోన్‌లో స్థానికులకు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది.

ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ తెలిపారు. శనివారం రాత్రి పదిన్నర గంటల వరకు తమకు అందిన సమాచారం మేరకు 64.29 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. పోలింగ్‌ ముగిసే సమయానికి అంటే రాత్రి ఏడు గంటలకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలైనులో ఉన్నవారందరికీ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. దీంతో తుది పోలింగ్‌ శాతానికి సంబంధించి రిటర్నింగ్‌ అధికారుల నుంచి పూర్తి నివేదిక అందాల్సి ఉందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పోలింగ్‌సరళిని పరిశీలిస్తే.. సర్వేపల్లిలో 66.19 శాతం, గూడూరు 63.81 శాతం, సూళ్లూరుపేట 70.93 శాతం, వెంకటగిరి 61.50 శాతం, తిరుపతి 50.58, శ్రీకాళహస్తి 67.77, సత్యవేడు 72.68 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement