
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన, అభివృద్ధిని ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 2.71 లక్షలకుపైగా ఓట్లతో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. 2019 ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ కట్టబెట్టడం గమనార్హం. తన 23 నెలల పాలన చూసి ఓటేయాలన్న సీఎం జగన్ మాటను గౌరవిస్తూ విశ్వసనీయతకే పట్టం కట్టారు.
ఊహించిందే అయినప్పటికీ భారీ మెజారిటీ రావడం పార్టీ వర్గాల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ఈ నెలాఖరుతో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెలువడ్డ ప్రజా తీర్పు సీఎం జగన్ పాలన పట్ల రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ దాదాపు 2.28 లక్షల మెజారిటీతో గెలుపొందడం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో అనివార్యంగా మారిన ఉప ఎన్నికలో రాజకీయ అనుభవం లేని, పాదయాత్రలో తన వెన్నంటి ఉన్న డాక్టర్ ఎం.గురుమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం కల్పించారు.
ఫలించని ‘పచ్చ’రాజకీయం!
స్థానిక ఎన్నికల్లో కుదేలైన టీడీపీ తాజాగా తిరుపతి ఎన్నికల్లో మరోసారి తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. రోజుల తరబడి అక్కడే మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఉనికి కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. రకరకాల ఎత్తుగడలు వేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకూ వెనుకాడలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ తన బహిరంగ సభను రద్దు చేసుకుని ఓటర్లకు లేఖ రాస్తే విపక్షం దీన్ని కూడా రాజకీయం చేస్తూ విమర్శలకు దిగింది. అయినప్పటికీ సీఎం సంయమనాన్ని పాటిస్తూ హుందాగా వ్యవహరించారు. ఫలితాల జోరు చూస్తే ఒక్క తిరుపతే కాదు లోక్‌సభ నియోజకవర్గం మొత్తం సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment