ఇంటి ముందే సమాధులు.. ‘ఆత్మల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష’ | Tombs In Front Of House in Village, Kurnool District | Sakshi
Sakshi News home page

ఇంటి ముందే సమాధులు.. ప్రతి శనివారం ఆవుపేడతో అలికి పూజలు

Published Sun, Aug 8 2021 10:57 AM | Last Updated on Sun, Aug 8 2021 12:51 PM

Tombs In Front Of House in Village, Kurnool District  - Sakshi

సమాధులు ఎక్కడ ఉంటాయి? సాధారణంగా ఎక్కడైనా శ్మశాన వాటికల్లోనే ఉంటాయి. ఆ ఊళ్లో మాత్రం సమాధులు ఇళ్ల ముంగిళ్లలోనే కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఇంటి ముందే సమాధి చేస్తారు. గతించిన వారి సన్నిధిలోనే నివసించాలని, వారి ఆత్మల ఆశీస్సులే తమకు శ్రీరామరక్ష అని భావిస్తారు. ఈ వింత గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. పేరు అయ్యకొండ. కర్నూలుకు దాదాపు అరవై కిలోమీటర్ల దూరాన గోనెగండ్ల మండలంలోని ఆ గ్రామంలో మరికొన్ని వింత ఆచారాలూ ఉన్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాల వెనుక కొన్ని గాథలూ ఉన్నాయి. 

అవేమిటో తెలుసుకోవాలంటే, చరిత్రలో మూడున్నర శతాబ్దాలు వెనక్కు వెళ్లాలి. ఆనాడు అయ్యకొండపై ఊరు లేదు. చింతల మునిస్వామితాత అనే యోగి అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ఉండేవారు. అప్పట్లో ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గంజిహళ్లి గ్రామంలో ఒక పెద్దభూస్వామి ఉండేవాడు. అతని దగ్గర ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా పనిచేసేవాడు. ఒకరోజు యజమాని ఒక ఆవును తీసుకువెళ్లి తన కూతురికి అప్పగించి రావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించాడు. ఎల్లప్ప ఆవును తోలుకుంటూ వెళుతుండగా, తోవలో అది తప్పించుకుని వెళ్లిపోయింది. యజమానికి ఈ సంగతి చెప్పడంతో, ఆగ్రహించి ఎలాగైనా వెతికి తేవాలంటూ ఆదేశించాడు.

ఎల్లప్ప ఆవుకోసం అడవిలో వెదుకులాడుతూ కొండపైకి చేరుకున్నాడు. కొండపైన గుహలో చప్పుడు వినిపించడంతో, రాళ్ల సందుల్లోంచి తొంగి చూశాడు. గుహలో కూర్చున్న మునిస్వామికి పితకకుండానే ఆవు పాలిస్తుంటే, ఆయన దోసిలి పట్టి తాగుతున్న దృశ్యం కనిపించింది. ఎల్లప్ప ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈయనెవరో శక్తులు కలిగిన స్వామి అని తలచాడు. యజమాని వద్దకు తిరిగి వెళ్లకుండా, చింతల మునిస్వామి వద్దే ఉండిపోయి, ఆయనకు సేవలు చేసుకుంటూ కాలం వెళ్లదీశాడు. ఎల్లప్ప మరణించాక, అతని కొడుకు బాలమునిస్వామి ఇంటి ముందే సమాధి చేశాడు. ప్రతి శనివారం సమాధిని ఆవుపేడతో అలికి, అగరొత్తులు వెలిగించి పూజించడం ప్రారంభించాడు. క్రమంగా అయ్యకొండలో కుటుంబాలు పెరిగి, గ్రామంగా ఏర్పడింది. మరణించిన వారికి ఇళ్ల ముందే సమాధి చేయడం ఆ గ్రామ ఆచారంగా మారింది.

మునిస్వామికి నిత్యనైవేద్యాలు
గ్రామస్తులు ఏమి తినాలనుకున్నా, తాగాలనుకున్నా ముందుగా చింతల మునిస్వామి తాతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆచారం కూడా ఎల్లప్ప కాలం నుంచే కొనసాగుతోంది. ఆయన వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప సమీప గ్రామాలకు వెళ్లి, అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామికి సమర్పించిన తర్వాతే తినేవాడట. ఆహార పదార్థాలైనా, మద్యం వంటివైనా ముందుగా మునిస్వామి తాతకు సమర్పించిన తర్వాతే ఈ గ్రామస్తులు స్వీకరిస్తారు. రోజులో ఎన్నిసార్లు వండుకుంటే అన్నిసార్లూ తప్పనిసరిగా సమర్పిస్తారు. చింతల మునిస్వామితాత ఆశీస్సులే తమకు అండదండలనేది వారి విశ్వాసం.

మంచం కనిపించదు
అయ్యకొండలో ఏ ఇంటి ముందు చూసినా సమాధులు కనిపిస్తాయి గాని, ఏ ఇంట్లోనూ మంచం కనిపించదు. దీని వెనుక ఒక గాథ ఉంది. చింతల మునిస్వామితాతకు గంజిహళ్లి బడేసాహెబ్‌ అనే స్నేహితుడు ఉండేవాడు. ఒకసారి గంజిహళ్లి ఉరుసుకు వెళ్లిన మునిస్వామి తన తిరునాళ్లకు బడేసాహెబ్‌ను ఆహ్వానించాడట. బడేసాహెబ్‌ బల్లిరూపంలో వచ్చాడట. దీనిని గ్రహించలేని మునిస్వామి తన తిరునాళ్లకు రాలేదని బడేసాహెబ్‌ను కోప్పడ్డాడట. అప్పుడు బడేసాహెబ్‌ ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయానికి మునిస్వామి మంచంపై కూర్చుని ఉన్నాడు.

‘నేను వచ్చినా మంచంపై కూర్చున్న నువ్వు నా రాకను గ్రహించలేదు. నువ్వు మంచం వాడరాదు’ అంటూ శపించాడట. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మంచం వాడబోమని ఈ గ్రామస్తులు చెబుతారు. ఈ ఆచారం వల్లనే ఈ గ్రామంలో  కాన్పులు కూడా కటిక నేల మీదే జరుగుతాయి. పచ్చిబాలింత అయినా, బొంతపరుచుకుని బిడ్డతోపాటు కిందే పడుకుంటుంది. ఈ గ్రామంలో ఏడు తరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాల్లో ఇప్పటికీ ఎటువంటి మార్పులేదు. ఈ గ్రామంలో ఉండేవారంతా ఒకే కులానికి చెందినవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement