gonegandla
-
నాడు అధ్వానం.. నేడు సరికొత్త రూపం
కర్నూలు(అర్బన్): రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విరివిగా నిధులను విడుదల చేస్తూ రహదారుల రూపు రేఖలు మారుస్తోంది. దీంతో పల్లెల నుంచి పట్టణాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల ప్రయాణ కష్టాలు తొలగి పల్లె ప్రాంతాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. గుంతలు పడి, కంకర తేలి నడవడానికి వీలు లేని రోడ్లు సైతం నేడు పూర్తిగా మారిపోయాయి. ఆయా రహదారుల్లో వాహనాల వేగం ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాల రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం తీసుకుంది. మండలాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను అభివృద్ధి చేయడం, జిల్లా రహదారులను మరమ్మతు చేయడం.. తదితర బాధ్యతలు ఆర్అండ్బీ ఇంజినీర్లు చూసుకుంటున్నారు. ఇరు జిల్లాల్లో 100 పనులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.107.61 కోట్ల రుణం ఇవ్వగా 494.500 కిలోమీటర్ల జిల్లా రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. వీటిలో మొత్తం 70 పనులకు గాను 14 పూర్తయ్యాయి. పురోగతిలో 17 పనులు ఉండగా, మిగిలిన వాటిలో 37 ప్రారంభం కావాల్సి ఉంది. రెండు పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర రహదారులకు కాలానుగుణంగా మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి రూ.78.49 కోట్లతో 209.270 కిలోమీటర్ల మేర 30 పనులను చేపట్టారు. ఇప్పటికే రూ. 23.69 కోట్లతో 68.930 కిలోమీటర్ల మేర 14 పనులను పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 8 పనులు పురోగతిలో ఉండగా, మరో 8 పనులను త్వరలో ప్రారంభించనున్నారు. రెండు లేన్ల రోడ్లు.. న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు రుణంతో రెండు జిల్లాల్లో రూ.314.31 కోట్ల వ్యయంతో మొత్తం 147.18 కిలోమీటర్ల మేర మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రోడ్లను నిర్మించనున్నారు. ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘డబుల్’ ఆనందం కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట నుంచి సంజామల మండలం రెడ్డిపల్లె వరకు రోడ్డు అధ్వానంగా ఉండేది. గుంతలు పడి రాకపోకలు సాఫీగా సాగేవి కావు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాహనదారుల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని మొత్తం 19 కిలోమీటర్ల మేర రూ.19.50 కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చింది. సరికొత్త రూపును దిద్దుకున్న ఈ రోడ్డుపై ప్రస్తుతం వాహనాలు రయ్..రయ్ అని దూసుకుపోతున్నాయి. రాకపోకలు సురక్షితం పాణ్యం మండలం కొణిదేడు నుంచి మద్దూరు వరకు సింగిల్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేది. వైద్యం నిమిత్తం మద్దూరు ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు తప్పేవి కావు. ప్రజల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 కోట్లు ఖర్చు చేసి దీనిని డబుల్ రోడ్డుగా మార్చింది. వారం క్రితమే పనులు పూర్తయ్యాయి. మొత్తం 11 కిలోమీటర్ల రహదారిపై రాకపోకలు మెరుగుపడ్డాయి. ప్రయాణ కష్టాలు తీరాయి. వివిధ గ్రామాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తొలగిన ‘దారి’ద్య్రం గోనెగండ్ల మండలం పెద్ద మరివీడు నుంచి పెద్ద నేలటూరుకు వెళ్లాలంటే మట్టి రోడ్డే దిక్కయ్యేది. రాళ్లు తేలి నడవడానికి సైతం ఇబ్బందిగా ఉండేది. సుమారు 10 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని చూపేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని రూ. 2.48 కోట్లతో బీటీ రోడ్డుగా మార్చింది. దీంతో రైతులు సులువుగా ఎమ్మిగనూరుకు పంట ఉత్పత్తులు తరలిస్తున్నారు. గూడూరుకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. సాఫీగా ప్రయాణం మండలకేంద్రమైన కౌతాళం నుంచి ఉరుకుంద వరకు 6 కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రోడ్డుపై నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనార్థం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గతుకుల రోడ్డుపై అవస్థలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. పక్షం రోజుల క్రితం పనులు పూర్తవడంతో ఈ రహదారిపై భక్తుల ఇక్కట్లు తొలగిపోయాయి. ఐదు గ్రామాలకు ఎంతో ఉపయోగం కరివేముల నుంచి ఐరన్‌బండ బీ సెంటర్ వరకు రూ.1.20 కోట్లతో 5 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. దీంతో ఐదు గ్రామాలకు ఎంతో మేలు జరిగింది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లం. గుంతలు పడి కంకర తేలడంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్డు బాగుపడింది. – నరసింహయ్య, గుమ్మరాళ్ల, దేవనకొండ మండలం ఇబ్బందులు లేవు గతంలో కడ్డీల వంక నుంచి రామదుర్గం క్రాస్ రోడ్డు వరకు ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు పడేవాళ్లం. గతంలో ఈ రోడ్డును బాగు చేయాలని విన్నవించినా, ఫలితం కనిపించ లేదు. ప్రస్తుత ప్రభుత్వం రూ.70 లక్షలతో 1.50 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించింది. నెల రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. రామదుర్గం గ్రామానికి, పొలాలకు వెళ్లేందుకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. – రాఘవయ్య, నగరడోణ, చిప్పగిరి మండలం నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి బ్యాంకు రుణంతో చేపట్టిన అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. రెండు జిల్లాల్లో ఇప్పటికే రూ.44.32 కోట్లతో 28 పనులు పూర్తయ్యాయి. అలాగే ఫేజ్–1 కింద ఎన్డీబీ రుణంతో చేపట్టనున్న 12 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్డీబీ ఫేజ్–2 కింద 77.57 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. – శ్రీధర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ -
ఇంటి ముందే సమాధులు.. ‘ఆత్మల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష’
సమాధులు ఎక్కడ ఉంటాయి? సాధారణంగా ఎక్కడైనా శ్మశాన వాటికల్లోనే ఉంటాయి. ఆ ఊళ్లో మాత్రం సమాధులు ఇళ్ల ముంగిళ్లలోనే కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఇంటి ముందే సమాధి చేస్తారు. గతించిన వారి సన్నిధిలోనే నివసించాలని, వారి ఆత్మల ఆశీస్సులే తమకు శ్రీరామరక్ష అని భావిస్తారు. ఈ వింత గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. పేరు అయ్యకొండ. కర్నూలుకు దాదాపు అరవై కిలోమీటర్ల దూరాన గోనెగండ్ల మండలంలోని ఆ గ్రామంలో మరికొన్ని వింత ఆచారాలూ ఉన్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాల వెనుక కొన్ని గాథలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలంటే, చరిత్రలో మూడున్నర శతాబ్దాలు వెనక్కు వెళ్లాలి. ఆనాడు అయ్యకొండపై ఊరు లేదు. చింతల మునిస్వామితాత అనే యోగి అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ఉండేవారు. అప్పట్లో ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గంజిహళ్లి గ్రామంలో ఒక పెద్దభూస్వామి ఉండేవాడు. అతని దగ్గర ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా పనిచేసేవాడు. ఒకరోజు యజమాని ఒక ఆవును తీసుకువెళ్లి తన కూతురికి అప్పగించి రావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించాడు. ఎల్లప్ప ఆవును తోలుకుంటూ వెళుతుండగా, తోవలో అది తప్పించుకుని వెళ్లిపోయింది. యజమానికి ఈ సంగతి చెప్పడంతో, ఆగ్రహించి ఎలాగైనా వెతికి తేవాలంటూ ఆదేశించాడు. ఎల్లప్ప ఆవుకోసం అడవిలో వెదుకులాడుతూ కొండపైకి చేరుకున్నాడు. కొండపైన గుహలో చప్పుడు వినిపించడంతో, రాళ్ల సందుల్లోంచి తొంగి చూశాడు. గుహలో కూర్చున్న మునిస్వామికి పితకకుండానే ఆవు పాలిస్తుంటే, ఆయన దోసిలి పట్టి తాగుతున్న దృశ్యం కనిపించింది. ఎల్లప్ప ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈయనెవరో శక్తులు కలిగిన స్వామి అని తలచాడు. యజమాని వద్దకు తిరిగి వెళ్లకుండా, చింతల మునిస్వామి వద్దే ఉండిపోయి, ఆయనకు సేవలు చేసుకుంటూ కాలం వెళ్లదీశాడు. ఎల్లప్ప మరణించాక, అతని కొడుకు బాలమునిస్వామి ఇంటి ముందే సమాధి చేశాడు. ప్రతి శనివారం సమాధిని ఆవుపేడతో అలికి, అగరొత్తులు వెలిగించి పూజించడం ప్రారంభించాడు. క్రమంగా అయ్యకొండలో కుటుంబాలు పెరిగి, గ్రామంగా ఏర్పడింది. మరణించిన వారికి ఇళ్ల ముందే సమాధి చేయడం ఆ గ్రామ ఆచారంగా మారింది. మునిస్వామికి నిత్యనైవేద్యాలు గ్రామస్తులు ఏమి తినాలనుకున్నా, తాగాలనుకున్నా ముందుగా చింతల మునిస్వామి తాతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆచారం కూడా ఎల్లప్ప కాలం నుంచే కొనసాగుతోంది. ఆయన వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప సమీప గ్రామాలకు వెళ్లి, అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామికి సమర్పించిన తర్వాతే తినేవాడట. ఆహార పదార్థాలైనా, మద్యం వంటివైనా ముందుగా మునిస్వామి తాతకు సమర్పించిన తర్వాతే ఈ గ్రామస్తులు స్వీకరిస్తారు. రోజులో ఎన్నిసార్లు వండుకుంటే అన్నిసార్లూ తప్పనిసరిగా సమర్పిస్తారు. చింతల మునిస్వామితాత ఆశీస్సులే తమకు అండదండలనేది వారి విశ్వాసం. మంచం కనిపించదు అయ్యకొండలో ఏ ఇంటి ముందు చూసినా సమాధులు కనిపిస్తాయి గాని, ఏ ఇంట్లోనూ మంచం కనిపించదు. దీని వెనుక ఒక గాథ ఉంది. చింతల మునిస్వామితాతకు గంజిహళ్లి బడేసాహెబ్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఒకసారి గంజిహళ్లి ఉరుసుకు వెళ్లిన మునిస్వామి తన తిరునాళ్లకు బడేసాహెబ్‌ను ఆహ్వానించాడట. బడేసాహెబ్ బల్లిరూపంలో వచ్చాడట. దీనిని గ్రహించలేని మునిస్వామి తన తిరునాళ్లకు రాలేదని బడేసాహెబ్‌ను కోప్పడ్డాడట. అప్పుడు బడేసాహెబ్ ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయానికి మునిస్వామి మంచంపై కూర్చుని ఉన్నాడు. ‘నేను వచ్చినా మంచంపై కూర్చున్న నువ్వు నా రాకను గ్రహించలేదు. నువ్వు మంచం వాడరాదు’ అంటూ శపించాడట. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మంచం వాడబోమని ఈ గ్రామస్తులు చెబుతారు. ఈ ఆచారం వల్లనే ఈ గ్రామంలో కాన్పులు కూడా కటిక నేల మీదే జరుగుతాయి. పచ్చిబాలింత అయినా, బొంతపరుచుకుని బిడ్డతోపాటు కిందే పడుకుంటుంది. ఈ గ్రామంలో ఏడు తరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాల్లో ఇప్పటికీ ఎటువంటి మార్పులేదు. ఈ గ్రామంలో ఉండేవారంతా ఒకే కులానికి చెందినవారు. -
గోనెగండ్లకు చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
గోనెగండ్ల చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, గోనెగండ్ల : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివారు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. మరి కాసేపట్లో గోనెగండ్లలో వైఎస్ జగన్... ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. -
ఎస్ఐపై చర్య తీసుకోవాలని ఆందోళన
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ యువకుని శవంతో గురిజహళ్లి గ్రామస్తులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. భార్య, అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురిజహళ్లి గ్రామానికి చెందిన రాముడు(35)ను స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ అతనిని చిత్రహింసలకు గురిచేశాడు. దాంతో మనస్థాపానికి గురైన రాముడు పురుగుల మందు సేవించి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. రాముడు మరణానికి కారకుడైన ఎస్ఐని సస్పెండ్‌చేయాలని వారు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
మిద్దె కూలి వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరావాడి గ్రామంలో మిద్దె కూలి ఓ వ్యక్తి మరణించాడు, మరొకరికి గాయాలయ్యాయి. సోమవారం అర్థరాత్రి ఇంట్లో అంతా నిద్రపోతుండగా మిద్దె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరొకరికి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు
కర్నూలు : కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెక్‌డామ్‌లు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో లైటు వెలుతురులో వాగు దాటేందుకు ప్రయత్నిస్తూ .... నీటి ఉధృతికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయినవారిలో మూడు మృతదేహాలు లభించాయి. ఇంకా మూడు నెలల పసికందు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన సుమారు యాభైమంది ఎమ్మిగనూరులో ఓ సభకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా గత రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది.