కడప కల్చరల్ : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా వెళుతోందని నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఎంఎం ఆస్పత్రి అధినేత డాక్టర్ మహబూబ్‌పీర్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయలసీమ టూరిజం సంస్థ ఇటీవల మరికొన్ని సంస్థలను కలుపుకుని బలోపేతం కావడం సంతోషదాయకమన్నారు.
ఇటీవల గండికోటలో ఒబెరాయ్ సంస్థ హోటల్స్ నిర్మించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. సభాధ్యక్షుడు లయన్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మానస చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు రాయలసీమ సంస్థ ఒక్కటే జిల్లా పర్యాటకాభివృద్ధికి కృషి చేసిందని, ఇప్పుడు లయన్స్ క్లబ్‌తోపాటు పలు ప్రముఖ సంస్థలు కూడా ముందుకు వస్తుండడం సీమ సంస్థ పట్ల గల విశ్వాసమే కారణమన్నారు. ప్రత్యేక అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య ఎన్.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
సంస్థ ప్యాట్రన్ పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ తాను మిత్రుల ప్రోత్సాహంతో రాసిన ట్రావెలాగ్‌ను త్వరలో ఆవిష్కరిస్తున్నామన్నారు. చీఫ్ ప్యాట్రన్ పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా రాయలసీమ సంస్థ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. రిటైర్డ్ ఇంజినీరు వెంకటరెడ్డి, సంస్థ ప్యాట్రన్ పద్మప్రియ చంద్రారెడ్డి, కోశాధికారి బాలగొండ గంగాధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను రాసిన కథకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ బహుమతి రావడంతో సంస్థ సభ్యుడు షబ్బీర్ హుసేన్‌ను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment