ఎందుకంత విరక్తి...? ఎందుకంత భయం...? ఎందుకంత కఠినత్వం...? కనుపాపలను కాపాడాల్సిన తల్లిదండ్రులే పిల్లల భవితవ్యాన్ని చిదిమేయడం ఎటువంటి సంకేతాలిస్తుంది. కన్నబిడ్డల్ని కడతేర్చి తాము సైతం బలవన్మరణానికి పాల్పడుతున్న తల్లిదండ్రులది కఠిన హృదయమా.. పిరికితనమా.. బాధ్యతారాహిత్యమా? సమాజం వారికి బతుకుపై ఆశ కలిగించలేదా? అనకాపల్లి మండలంలో ఇటీవల జరిగిన రెండు దుర్ఘటనల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా అందులో నలుగురు పిల్లలే కావడం గమనార్హం. గురువారం హుకుంపేట మండలంలో జరిగిన తాజా ఘటనలో మూడేళ్ల కుమార్తెను ఒంటరిని చేసి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడడం మరింత విచారకరం.
అనకాపల్లి: కొద్ది రోజుల క్రితం మదనపల్లిలో విద్యావంతులైన తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలను చంపేశారు. వారికి ఇప్పుడు మానసిక చికిత్స అందిస్తున్నారు. అయితే వారి కథ, వారి తీరు, వారి ఒంటరితనం వేరు. కానీ అనకాపల్లి మండలంలో రెండు కుటుంబాల్లో ఏర్పడిన బలవన్మరణాలకు కారణం ఒకటి ఆర్థిక సమస్య అయితే, మరొకటి మానసిక ఒంటరితనం. జీవితంలో ఒక దశ దాటిన తర్వాత చావంటే భయం ఉండకపోవచ్చు. కానీ పిల్లల్ని పెద్ద చేసి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా వారు ఆ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు.
అనకాపల్లి మండలంలోని ముత్రాసుకాలనీలో కొద్ది నెలల క్రితం భార్య చనిపోయిందని మనస్తాపానికి గురైన భర్తకు జీవితంపై విరక్తి పుట్టింది. పలకరించేవారు లేరు, పట్టించుకునేవారు కరువు. తాను ఆత్మహత్యకు పాల్పడితే పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న భయం, అనాథలుగా తన పిల్లలు మారుతారన్న ఆవేదన ఆ తండ్రిని కలచివేసింది. దీంతో పిల్లలిద్దరికీ విషం తాగించి తాను కూడా ఉరితాడుకు వేలాడాడు. బుధవారం జరిగిన ఈ ఘటన అనకాపల్లి మండలంలో అందరినీ బాధించింది. పాపం ఆ పిల్లలు ఏం చేశారు, వారిని చంపకుండా బాగుండేది కదా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అతను విరక్తి చెందిన సమయంలో బాధను పంచుకునేవారుగాని, మేమున్నామని భరోసా ఇచ్చేవారు గానీ ఉంటే ఈరోజు రెండు పసి హృదయాలు ప్రాణంతో నిలిచి ఉండేవి.
అక్కడ మరీ దారుణం...
అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఆర్థికపరమైన వ్యాపారాలు చేసేవారు. పప్పుచిటీలు వేసి కొందరి వద్ద మోసపోయారు. ఇంటిని అప్పులిచ్చినవారు చుట్టుముడతారని భావించి, అవమానాన్ని ఎదుర్కొవాలని భయపడిన ఆ భార్యాభర్తలు వారి పిల్లలను ఏలేరు కాలువలోకి తోసి వారు కూడా నీటమునిగారు. ఆ కుటుంబంలో రెండు మృతదేహాలు, కొద్దిరోజుల తరువాత మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ఘటనలో కూడా పిల్లలిద్దరినీ బతకనిస్తే బాగుండేది కదా అని ఎన్నో గుండెలు తల్లడిల్లాయి. ఇక వివాహేతర సంబంధం విషయంలో గొడవ పడ్డ భార్యాభర్తలు హుకుంపేట మండలం మఠం పంచాయతీ బొండలమామిడిలో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మూడేళ్ల కుమార్తె అనాథగా మిగిలింది. ఈ మూడు ఘటనలు ఇపుడు జిల్లాలోని అందరినీ వేధిస్తున్నాయి. వీరికి ధైర్యం చెప్పి.. బతుకులను సరిదిద్ది సరైన మార్గంలో పెట్టే బాధ్యత ఎవరైనా తీసుకుంటే ఎంత బాగుంటుంది!
Comments
Please login to add a commentAdd a comment