
తిరుపతి అర్బన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను కేంద్రంగా చేసుకుని ఎలక్ట్రికల్ బస్సులను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఈ–బస్ ట్రయల్ రన్‌ను సోమవారం అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ– బస్సును తిరుపతి అలిపిరి డిపో నుంచి తిరుమలకు రెండు సార్లు నడిపారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయినట్లు ఆర్టీసీ కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గోపినాథ్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ– బస్సులను వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.
కాగా, బస్సు పనితీరును పరిశీలించడానికి విజయవాడ నుంచి ఆర్టీసీకి చెందిన ప్రత్యేక కమిటీ సభ్యులు రవివర్మ, చంద్రశేఖర్, సుధాకర్, వెంకటరత్నం తిరుపతికి వచ్చారు. అనంతరం ఈ–బస్సు సర్వీస్‌ను తిరుపతి ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు శ్రీరామసుందర్, విఘ్నేష్ పరిశీలించారు. బస్సు కండీషన్‌పై వారు నివేదిక ఇచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లో మరో 10 ఎలక్ట్రికల్ బస్సులు అలిపిరి డిపోకు చేరుకోనున్నాయి. అలిపిరి నుంచి తిరుమలకే కాకుండా ఇతర ప్రాంతాలకూ ఈ– బస్సులు అందుబాటులోకి రానున్నాయని గోపినాథ్‌రెడ్డి చెప్పారు. ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని, బ్రహ్మోత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment