విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులు | Tribal products at airports | Sakshi
Sakshi News home page

విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులు

Sep 8 2023 4:39 AM | Updated on Sep 8 2023 4:39 AM

Tribal products at airports - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ‘గిరిజన్‌’ బ్రాండ్‌ పేరుతో అందిస్తున్న సహజసిద్ధమైన ఉత్పత్తులకు గిరాకీ ఉంది. ప్రధానంగా అరకు వ్యాలీ కాఫీతోపాటు గిరిజన తేనె, షర్బత్, జీడిపప్పు, చిరుధాన్యాలు, త్రిఫల పౌడర్, హెర్బల్‌ ఆయిల్, సబ్బులు వంటి 80 ఉత్ప­త్తులను విక్రయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర­వ్యాప్తంగా ప్రధాన నగరాలు, బస్టాండ్‌లు, రైల్వే­స్టేషన్లలో ప్రత్య­క్షంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసిన జీసీసీ ఆన్‌లైన్‌ మార్కె­టింగ్‌ ద్వారా విక్రయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అనేక నగరాల్లోను జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తు­న్నారు.

తాజాగా హైద­­రాబాద్‌ మెట్రో రైల్వేస్టేషన్‌లో జీసీసీ అవుట్‌­లెట్‌ ఏర్పాటు చేశారు. దేశంలో 13 విమానా­శ్రయా­ల్లోను గిరిజన ఉత్పత్తులను అమ్ము­తు­న్నారు. ప్రస్తు­తం విశాఖపట్నం విమానాశ్రయంలో పూర్తిగా జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు సాగి­స్తు­న్నారు. విజయవాడ విమానాశ్ర­యంలో జీసీసీ ఏర్పాటు చేసిన స్టాల్‌ విక్రయాలు నిర్వ­­హించాల్సి ఉంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ట్రైబల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌­మెంట్‌ ఫెడరేషన్‌ ఆప్‌ ఇండియా లిమిటెడ్‌ (ట్రైఫెడ్‌) భాగ­స్వామ్యంతో అనేక అంతర్జాతీయ విమానాశ్ర­యాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీసీసీ ఉత్పత్తులను విక్రయి­స్తు­న్నారు. జైపూర్, గోవా, త్రివేండ్రం, మహా­­­రాణా ప్రతాప్‌ ఎయిర్‌పోర్టు (ఉదయ్‌పూర్‌), కోయంబత్తూరు, పుణె, కేబీఆర్‌ (లద్దఖ్‌), మాతా దంతేశ్వరి (జగదల్‌పూర్‌), కొచ్చిన్, లోకప్రియ గోపీ­­నాథ్‌ బోర్డోలోయ్‌ (గౌహతి), ప్రయాగ్‌రాజ్‌ విమా­నాశ్ర­యా­ల్లో గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభి­స్తో­ంది.

ఇతర రాష్ట్రాల్లో రూ.85.56 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశా­లతో జీసీసీ విస్తృతమైన కార్యక­లా­పాలు నిర్వహి­స్తోంది. గిరిజనులు పం­డించిన ఉత్పత్తులు, సేక­రించిన అటవీ ఫలసాయాలకు మంచి ధర దక్కేలా జీసీసీ దోహదం చేస్తోంది. గిరిజనుల నుంచి కొను­­గోలు చేసిన వాటిని అనేక రకాల ఉత్ప­త్తు­లుగా విక్రయిస్తోంది.

ఈ క్రమంలో గిరిజను­లకు మరింత మేలు చేసేలా జీసీసీ సేవలు విస్తృ­తం చేస్తోంది. దీన్లో భాగంగానే దేశం­లోని అనేక ప్రాంతాల్లో జీసీసీ అవు­ట్‌­లెట్స్‌ ప్రారంభించాం. ఇతర రాష్ట్రాల్లో గతేడాది (2022–23లో) రూ.85.56 లక్షల విలు­వైన జీసీసీ గిరిజన్‌ ఉత్పత్తులు విక్ర­యించాం. దేశంలో ఎక్కడైనా జీసీసీ ఫ్రాంచైజీ అవు­ట్‌­లెట్‌లు పెట్టుకునే ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సా­హం అందిస్తాం.  – శోభ స్వాతిరాణి, జీసీసీ చైర్‌పర్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement