సాక్షి, చింతపల్లి: వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న రోజులవి.. 2018లో అంజలి శనివారం గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారామె. అప్పటికే రహదారి సమస్యతో సతమతమవుతున్న గిరిజనులు జన్మభూమి కార్యక్రమం అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చి.. రెండు రోజులపాటు జేసీబీలతో రహదారి పనులు చేపట్టినట్టు హడావిడి చేశారు. ఈశ్వరి హామీలను నమ్మిన గిరిజనులు జన్మభూమి కార్యక్రమానికి స్వాగతించారు. జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు సుమారు 6 కిలోమీటర్ల రహదారి పనులకు భూమిపూజ, శిలాఫలక ఆవిష్కరణలు కూడా చేపట్టారు.
జన్మభూమి కార్యక్రమం ముగిసిన తర్వాత గిడ్డి ఈశ్వరి గ్రామం వైపు కన్నెత్తి చూడడం మానేశారు. దీంతో అస్తవ్యస్థ రహదారిలో గిరిజనులు అవస్థలు పడుతూనే ఉన్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా రహదారి బురదమయంగా మారింది. వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఆమెకు గిరిజనుల సమస్యలు గుర్తుకు వచ్చాయి. రహదారి నిర్మించాలంటూ శనివారం టీడీపీ నాయకులతో కలిసి అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ డ్రామా చూసి చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు నవ్వుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు మూడు నెలల్లో రోడ్డు వేస్తానని చెప్పి.. తర్వాత పట్టించుకోని ఈశ్వరి ఇలా ఉత్తుత్తి నిరసనలు తెలపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment