బెజవాడ నడిబొడ్డున కొలువుదీరిన సామాజిక న్యాయ మహా శిల్పం
నేడు అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా నివాళులు
ఎన్నికల కోడ్‌కు లోబడి కార్యక్రమ నిర్వహణకు అధికారుల చర్యలు
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు స్ఫూర్తి సామాజిక న్యాయ మహా శిల్పం రూపంలో సగర్వంగా నిలిచింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానం 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయడం విశేషం. అలాగే 81 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పీఠం(ఫెడస్టల్)పై 125 అడుగుల ఎత్తుగల ఈ అంబేడ్కర్ కాంస్య విగ్రహం కొలువై ఉంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్(సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు.
గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తామని స్థలం ఎంపిక చేసి కనీస కార్యాచరణ లేకుండా గాలికొదిలేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం చెప్పింది చేసి చూపించేలా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. దేశీయంగా తయారైన ఈ కాంస్య విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది, దేశంలోని మతాతీత విగ్రహాల్లో ఇదే అతి పెద్దది కావడం మరో విశేషం.
అంతటి స్ఫూర్తివంతమైన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో అంబేడ్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌కు లోబడి నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు, సామాజికవేత్తలు, అంబేడ్కర్ వాదులు విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు.
దర్శనీయక్షేత్రంగా..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రముఖ దర్శనీయ క్షేత్రంగా అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విజయవాడ నగర నడిబొడ్డున చరిత్రాత్మక స్వరాజ్ మైదానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది.
సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడక కోసం ఈ ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. పచ్చని ప్రకృతి ప్రతిబింబించేలా సౌందర్యవంతంగా దీనిని తీర్చిదిద్దారు. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంతంలో మరెన్నో ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చి్రల్డన్స్ ప్లే ఏరియా, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్ వేస్‌తో సహా మొత్తం ప్రాంతాన్ని తీర్చిదిద్దడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment