రాజంపేట: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తన ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తాళ్లపాక నుంచి శేషాచలం అటవీ మార్గంలో వెళ్లిన కాలిబాట అభివృద్ధికి ఇన్నాళ్లకు అడుగులు పడ్డాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రాయలసీమ జిల్లాలే కాకుండా దక్షిణ భారత యాత్రికులకు తిరుమల మరింత దగ్గర దారి అవుతుంది.
చదవండి: హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే
తిరుపతి వెళ్లకుండానే..
అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లకుండానే నేరుగా తిరుమల కొండ ఎక్కవచ్చు. వైఎస్సార్ జిల్లా సరిహద్దులో ఉన్న కుక్కలదొడ్డి నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని పశ్చిమ భాగంలోని శేషాచలం అటవీ మార్గంలో 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోవచ్చు. దీనివల్ల 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల తిరుమల వెళ్లే భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు ఆవశ్యకతను టీటీడీ బోర్డు గుర్తించింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచి వెళ్లిన దారిని అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకుంది.
నాడు వైఎస్సార్.. నేడు జగన్ పాలనలో..
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయడంపై టీటీడీ బోర్డు దృష్టి సారించింది. ఆయన మరణానంతరం ఈ ప్రతిపాదన అటకెక్కింది. అప్పట్లో ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లిన సంగతి విదితమే. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో అన్నమయ్య కాలిబాటకు మోక్షం కలిగింది.
ఆహ్లాదకర వాతావరణంలో..
గోవింద మాల ధరించే భక్తులు సుమారు 500 ఏళ్ల నుంచి అన్నమయ్య కాలిబాటలో స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఓ వైపు పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. జలజల పారే సెలయేర్లు.. ఎత్తయిన బండలు ఇలా ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నమయ్య కాలిబాట పయనం కొనసాగుతుంది. భక్తులు ఈ బాటలో కొండకు చేరుకుంటారు. ఈ మార్గంలో అనేక చోట్ల యాత్రికుల బసకు సంబ«ంధించి సత్రాలు, అవ్వతాతల గుట్టలు, ఎర్రిగుంతలు, పార్వేటి మండపం, చావిళ్లు లాంటివి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment