‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు  | TTD EO AV Dharma Reddy in the media conference | Sakshi
Sakshi News home page

‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు 

Published Fri, Jun 23 2023 2:56 AM | Last Updated on Fri, Jun 23 2023 1:47 PM

TTD EO AV Dharma Reddy in the media conference - Sakshi

తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందాలని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కోరారు. ఈ ట్రస్టుకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.

ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటవుతుందన్నారు. ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టిక్కెట్‌కు వేర్వేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేనిపక్షంలో కోట్లాదిమంది భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. 

నిధుల దుర్వినియోగం అవాస్తవం
శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి శ్రీస్వస్వరూపానందగిరిస్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీవిరజానందస్వామి, హైదరాబాద్‌కు చెందిన శ్రీహనుమత్‌పీఠం పీఠాధిపతి శ్రీదుర్గాప్రసాదస్వామి మాట్లాడుతూ శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామన్నారు.

శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు.. ఎక్కడెక్కడ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి.. వడ్డీ ఎంత వచ్చింది.. తదితర వివరాలను ఈవో తెలియజేశారని చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. 

శ్రీవాణి ట్రస్ట్‌ అకౌంట్లు పక్కాగా ఉన్నాయి
హైదరాబాద్‌కు చెందిన సోలిస్‌ ఐకేర్‌ ఎండీ రామాంజనేయులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సామాన్య భక్తుడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నానని, శ్రీవాణి ద్వారా కూడా పలుమార్లు దర్శనానికి వెళ్లానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించాక తనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని తెలిపారు. భక్తులు ఇస్తున్న విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మీడియా సమావేశంలో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, పతంజలి సంస్థల ప్రతినిధులు శ్రీధర్‌రావు, మురళి, దీపక్‌రెడ్డి, శ్రీనివాస్, సుబ్బన్న, సురేష్, కుమారస్వామి, టీటీడీ వీజీవో బాలిరెడ్డి, క్యాటరింగ్‌ ప్రత్యేకాధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దు 
సనాతన హిందూధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు మీడియా సమావేశంలో ప్రశంసించారు. విశ్వహిందూ పరిషత్‌ సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయవద్దని కోరారు.

శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం.. ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు ప్రధాన బాధ్యతలను నిర్వహించేదని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మికసంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.

తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్కపైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమల వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement