సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ఏ.వీ. ధర్మారెడ్డి తెలిపారు. కుడి వైపు ఉన్న రాతి మండపం రిపేరు చేయడానికి కూడా వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకుందని వెల్లడించారు. రాతి మండపం రాళ్ళు పునర్నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే కాకుండా శిథిలావస్థకు చేరిన తిరుమలలోని పార్వేట మండపాన్ని కూల్చి పునర్నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శిథిలావస్థకు చేరిన రాతి మండపాలపై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేసిన.. రాతి మండపాలను యథావిధిగా రూ.1.36 లక్షలు వెచ్చించి 20 పిల్లర్లతో పునర్ నిర్మాణం చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నడక మార్గంలో చిరుతలు సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని వెల్లడించారు. కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదని అన్నారు. అటవి జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, సి.సి కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు
Comments
Please login to add a commentAdd a comment