సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠంగా పిలిచే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సౌరకాంతులు వెలుగులు విరజిమ్మనున్నాయి. తిరుపతి దేవాలయం కోసం సౌర ఫొటోవోల్టాయిక్ పవర్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వీవీఎన్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. తిరుపతి, తిరుమల కొండలపై అనేక ప్రదేశాల్లో సోలార్ పవర్ ప్లాంట్‌లను ఎన్‌వీవీఎన్ నిర్మిస్తుంది. వీటినుంచి ఉత్పత్తయ్యే సౌరశక్తిని టీటీడీ కొనుగోలు చేస్తుంది.
25 ఏళ్లకు ఎన్టీపీసీకి భూమి ఇవ్వనున్న టీటీడీ
ఎన్‌వీవీఎన్ ఇప్పటికే టీటీడీ అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. అనంతరం తమ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుల స్థాపనకు కావాల్సిన భూమిని 25 ఏళ్లకు టీటీడీ సమకూరుస్తుంది. తిరుమల ఆలయానికి విద్యుత్ అవసరాలను గ్రీన్ ఎనర్జీ ద్వారా తీర్చాలని టీటీడీ భావిస్తోంది. శేషాచలం కొండ శ్రేణుల్లోని ధర్మగిరిపై 25 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాని నుంచి ఐదు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఆలయ నిర్వాహకులు గతేడాది ప్రణాళిక రూపొందించారు. ఒప్పందం అనంతరం ఈ ప్రాజెక్టుకు అయ్యే మూలధన వ్యయాన్ని ఎన్‌వీవీఎన్ భరిస్తుంది. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 25 ఏళ్లపాటు టీటీడీ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు ధర యూనిట్‌కు రూ.3 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన ధరను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్‌సీ) నిర్ణయిస్తుంది.
మొదలైన ఇంధన సామర్థ్య చర్యలు
తిరుమల ఆలయాన్ని ఇంధన సామర్థ్య కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) గతేడాది ప్రకటిం చింది. ఇప్పటికే ఉన్న పంపుసెట్లు, ఎయిర్ కండిషనర్లు, సీలింగ్ ఫ్యాన్‌లను మార్చాల్సిన అవసరాన్ని ప్రాథమిక ఆడిట్ ద్వారా గుర్తించింది. దీనివల్ల ఆలయానికి ఏటా రూ.4.5 కోట్లు ఆదా అవనుంది. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ)తో కలిసి పలు ఏజెన్సీలు తమ పరిధిలోని కళాశాలలు, పాఠశాలలు, ఆలయ భవనాల్లో రూఫ్‌టాప్ సోలార్ సిస్టంలను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment