NTPC power
-
కలియుగ వైకుంఠంలో సౌరకాంతులు
సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠంగా పిలిచే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సౌరకాంతులు వెలుగులు విరజిమ్మనున్నాయి. తిరుపతి దేవాలయం కోసం సౌర ఫొటోవోల్టాయిక్ పవర్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వీవీఎన్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. తిరుపతి, తిరుమల కొండలపై అనేక ప్రదేశాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఎన్‌వీవీఎన్ నిర్మిస్తుంది. వీటినుంచి ఉత్పత్తయ్యే సౌరశక్తిని టీటీడీ కొనుగోలు చేస్తుంది. 25 ఏళ్లకు ఎన్టీపీసీకి భూమి ఇవ్వనున్న టీటీడీ ఎన్‌వీవీఎన్ ఇప్పటికే టీటీడీ అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. అనంతరం తమ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుల స్థాపనకు కావాల్సిన భూమిని 25 ఏళ్లకు టీటీడీ సమకూరుస్తుంది. తిరుమల ఆలయానికి విద్యుత్ అవసరాలను గ్రీన్ ఎనర్జీ ద్వారా తీర్చాలని టీటీడీ భావిస్తోంది. శేషాచలం కొండ శ్రేణుల్లోని ధర్మగిరిపై 25 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాని నుంచి ఐదు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఆలయ నిర్వాహకులు గతేడాది ప్రణాళిక రూపొందించారు. ఒప్పందం అనంతరం ఈ ప్రాజెక్టుకు అయ్యే మూలధన వ్యయాన్ని ఎన్‌వీవీఎన్ భరిస్తుంది. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 25 ఏళ్లపాటు టీటీడీ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు ధర యూనిట్‌కు రూ.3 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన ధరను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) నిర్ణయిస్తుంది. మొదలైన ఇంధన సామర్థ్య చర్యలు తిరుమల ఆలయాన్ని ఇంధన సామర్థ్య కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) గతేడాది ప్రకటిం చింది. ఇప్పటికే ఉన్న పంపుసెట్లు, ఎయిర్ కండిషనర్లు, సీలింగ్ ఫ్యాన్లను మార్చాల్సిన అవసరాన్ని ప్రాథమిక ఆడిట్ ద్వారా గుర్తించింది. దీనివల్ల ఆలయానికి ఏటా రూ.4.5 కోట్లు ఆదా అవనుంది. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ)తో కలిసి పలు ఏజెన్సీలు తమ పరిధిలోని కళాశాలలు, పాఠశాలలు, ఆలయ భవనాల్లో రూఫ్‌టాప్ సోలార్ సిస్టంలను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. -
డిమాండ్‌కు సరిపడా విద్యుత్
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) అంచనా వేస్తోంది. ఈ మేరకు ముందస్తు ప్రణాళిక(ఫోర్కాస్ట్)ను విద్యుత్ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నివేదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఏసీల వినియోగం లక్షకుపైగా పెరిగినట్టు గుర్తించారు. మరోవైపు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను ఏడు నుంచి తొమ్మిది గంటలకు పెంచారు. ఫలితంగా వేసవిలోనూ కొన్ని రకాల ఉద్యాన పంటలకు విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ, గృహ, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను త్వరలో అనుమతించే వీలుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్‌పై ఎస్ఎల్డీసీ అంచనా వేసింది. ఏటా గరిష్టంగా రోజుకు 175 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే, వచ్చే మే నెలలో 210 మిలియన్ యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. - ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య కాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలి. - ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో పరిధిలోని ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను డిసెంబర్ నాటికి 3 లక్షల టన్నులు, వచ్చే ఏడాది జనవరి చివరకు 6 లక్షల టన్నులు, మార్చి చివరకు 9 లక్షల టన్నులకు పెంచాలి. - రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ స్టేషన్లలో రోజుకు 80 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు నెలకు 17 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో విదేశాల నుండి కూడా జెన్కో తక్కువ ధరకు బొగ్గు దిగుమతి చేసుకోవాలి. - ఫిబ్రవరి, జూలై మధ్యలో దశల వారీగా నెలకు 2 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం. - ఏపీ డిస్కమ్‌లతో పీపీఏలున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలుకు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఇటీవల కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (విద్యుత్ కొనుగోలుకు ముందే బ్యాంకులో డబ్బులు చెల్లించడం)కు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. (కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,184 కోట్లు ఎల్సీ కింద చెల్లించారు). దీంతో వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్ కొనుగోలుకు ఇబ్బందులు ఉండవు. - ఈసారి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వేసవి నాటికి 300 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా. - ఈ ఏడాది జలాశయాలు పుష్కలంగా నిండాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. దేనికైనా సిద్ధమే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరలోనే సరఫరా చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. వేసవిలోనూ ప్రజల అంచనాలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తాయి. - బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
29కి చేరిన ఎన్టీపీసీ మృతులు
రాయ్‌బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉంచాహర్ ఎన్టీపీసీ కేంద్రంలో చోటుచేసుకున్న పేలుడులో మృతుల సంఖ్య 29కి పెరిగింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ గురువారం మరో 9 మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిర్ణీత సమయానికన్నా ముందే ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించారన్న ఆరోపణలను ఆర్కే సింగ్ కొట్టిపారేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆర్కే సింగ్ వెల్లడించారు. దీనికి అదనంగా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. పేలుడుపై యూపీ ప్రభుత్వం మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించింది. -
ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సోమవారం ఉదయం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే మరమ్మతులు ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు. -
ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
పరవాడ: విశాఖపట్నంలోని ఎన్టీపీసీ మొదటి యూనిట్లో సాంకేతిక లోపం కారణంగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో బాయిలర్ ట్యూబ్‌లో లీకేజీ ఏర్పడడం వల్ల 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం నాటికి విద్యుదుత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.