TTD Is The Ideal To The World In Temple Management - Sakshi
Sakshi News home page

ఆలయ నిర్వహణలో ప్రపంచానికే టీటీడీ దిక్సూచి 

Published Sun, Jul 23 2023 4:44 AM | Last Updated on Mon, Jul 31 2023 7:15 PM

TTD is the ideal to the world in temple management - Sakshi

తిరుమల: ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 30 దేశాలకు చెందిన వివిధ హిందూ దేవాలయాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తిరు­మలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ కల్పి­స్తున్న వసతులు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు సంబంధించి అరగంట పాటు ధర్మారెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు.

సమర్థ నిర్వహణ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఆలయాలు పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలని, భక్తులకు సులభంగా దర్శనం, చక్కటి వసతులు కల్పించాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, అన్నదానం, వేద సంస్కృతి పరిరక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను టీటీడీ పెద్దఎత్తున చేస్తోందని చెప్పారు. స్విట్జర్లాండ్, సింగపూర్‌ లాంటి దేశాల తరహాలో తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ ఉందన్నారు.
 
పురాతన ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు 
పురాతన ఆలయాల పునరుద్ధరణకు, మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించామని ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 170 పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. భక్తులు దాదాపు రూ. 900 కోట్లు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేశారని, ఇప్పటివరకు రూ. 330 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

ఏడాదిన్నర కిందట ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో 1,600కు పైగా గుండె శస్త్రచికిత్సలు, నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. చిన్నపిల్లలకు కార్డియాలజీతో పాటు ఇతర విభాగాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. 

టీటీడీ విశిష్ట సేవలు 
టీటీడీ ఆధ్వర్యంలో 71 ఆలయాలు, 11 ట్రస్టులు, 14 ఆసుపత్రులు, 35 విద్యాసంస్థలు, 9 వేద పాఠశాలలు, నాలుగు గోశాలలు, 300 కళ్యాణ మండపాలు, 10  ధార్మిక సంస్థలు, నాలుగు భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్, అనాథ పిల్లల కోసం బాలమందిరం, రెండు మ్యూజియంలు ఉన్నాయని ధర్మారెడ్డి చెప్పారు.

శ్రీవారి దర్శనార్థం వచ్చే తోటి భక్తులకు సేవలందించేందుకు 2000 సంవత్సరంలో శ్రీవారి సేవా విభాగాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు 14 లక్షల మంది సేవకులు నమోదయ్యారని తెలిపారు. శ్రీవారికి నైవేద్యం కోసం గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి శ్రీనివాస కళ్యాణం, వేంకటేశ్వర వైభవోత్సవాలు, గుడికో గోమాత కార్యక్రమం, విషూచిక మహామంత్రంతో పారాయణాలు ప్రపంచ భక్తుల 
దృష్టిని ఏ విధంగా ఆకర్షించాయో వివరించారు.

టీటీడీకి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రశంసలు 
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తన ప్రసంగంలో శ్రీవాణి ట్రస్ట్‌ సేవలపై ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణను పెద్దఎత్తున చేపట్టినందుకు టీటీడీని కొనియాడారు. టీటీడీ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ఆయన ప్రస్తుతించారు. అనంతరం ఈవో ధర్మారెడ్డిని సమ్మేళనం చైర్మన్‌ ప్రసాద్‌ మినేష్‌ లాడ్, టెంపుల్స్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకులు గిరీష్‌ కులకర్ణి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement