శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం దళారులను సంప్రదించవద్దని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులకు విజ్ఞప్తి చేసింది. తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది ఫోన్ నంబర్లతో కూడిన సమాచారంతో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు టీటీడీ కొన్ని టికెట్లను కేటాయించింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలియజేసింది.
టూరిజం విభాగాల ద్వారా రావాలనుకునే భక్తులు నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్‌సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొందరు దళారులు టూరిజం వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసి ఇస్తామని చెప్పి భక్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అలాగే శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment