వెబ్‌డెస్క్: వివిధ పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో విద్యార్థినీ విద్యార్థులకు చేయూత అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి అంటూ పదే పదే చెబుతుంటారు సీఎం వైఎస్ జగన్. అందుకు తగ్గట్టే విద్యారంగానికి పెద్ద పీఠ వేశారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రెండేళ్లలో అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అదే స్థాయిలో విద్యారంగంలో సంక్షేమానికి చోటు కల్పించారు.
జగనన్న అమ్మఒడి
దేశ చరిత్రలోనే తొలిసారిగా తల్లుల గురించి, వారి పిల్లల చదువుల గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో జగనన్న అమ్మఒడి పథకం ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులందరికీ ఈ సాయం వర్తింప చేస్తున్నారు. ఈ పథకం క్రింద రెండేళ్లలో 44,48,865 మంది విద్యార్థులకు రూ.13,022.90 కోట్ల సాయాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారి ఆప్షన్ మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జగనన్న విద్యా దీవెన
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం జగన్ ఆరంభించారు. దీని ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ , ఈబీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్‌ని అమలు చేస్తున్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెంచడం కోసం నాలుగు దఫాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే నేరుగా ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం క్రింద రెండేళ్లలో 18,80,934 మందికి రూ.4,879.30 కోట్ల లబ్ది జరిగింది.
జగనన్న వసతి దీవెన
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల నిమిత్తం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో 20వేల వరకు ఆర్థిక సాయం అందించారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20వేల చొప్పున కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం క్రింద రెండేళ్లలో 15,56,956 మందికి రూ.2,269.93 కోట్లు జమ చేశాం.
జగనన్న విద్యా కానుక
ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం ద్వారా బడులు తెరవకముందే కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్,షూస్ తో పాటు ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. చదువుపై సీఎం జగన్‌కి ఉన్న ప్రత్యేక అభిమానానికి ఈ పథకం ఓ ఉదాహరణ. ఈ పథకం క్రింద రెండేళ్లలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులకు రూ.781 కోట్లతో లబ్ది జరిగింది.
మనబడి నాడు నేడు
ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చివేసి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సీఎం జగన్ రూపొందించిన వినూత్న కార్యక్రమం మనబడి నాడు-నేడు. ఈ కార్యక్రమం క్రింద మూడు దశల్లో రూ.16,700 కోట్ల వ్యయంతో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లతో పాటు 28,169 అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు సమూలంగా మారనున్నాయి. మరో 27,438 అంగన్ వాడీలకు కొత్త భవనాలు ఏర్పాటు కానున్నాయి.
ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, ప్రహారీ గోడలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు, కిచెన్, ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించేలా ఇంగ్లీష్ ల్యాబ్ వంటి మంచి వసతులు ఈ పథకం ద్వారా కల్పించనున్నారు. తొలివిడతలో రూ. 3,669 కోట్ల వ్యయంతో 15,717 పాఠశాలలు పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,16,241 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 78,579 పనులు పూర్తయ్యాయి
జగనన్న గోరుముద్ద
రాష్ట్రవ్యాప్తంగా 45,854 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 36,88,618 మంది విద్యార్థులకు రూ.1,600 కోట్ల వ్యయంతో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు.
నైపుణ్యం పెంచే దిశగా
చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రూ. 1200 కోట్లతో 30 నైపుణ్య కళాశాలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర సౌకర్యాలు ఉండే అద్దె భవంతుల్లో కాకుండా ప్రతీ కాలేజీకి 5 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు రూ. 40 కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పటికే 21 కాలేజీలకు సంబంధించి స్థల సేకరణ కూడా పూర్తయ్యింది. వీటికి దిశానిర్ధేశం చేసేందుకు తిరుపతిలోని కోబాక వద్ద 50 ఎకరాల విస్తీర్ణంలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం సీఎం జగన్ ముందు చూపుకి నిదర్శనం. నైపుణ్య కళాశాలలో వందకు పైగా కోర్సులు అందివ్వనున్నారు. ఇందులో టెక్నికల్ 49, నాన్ టెక్నికల్ 41, సెక్టోరియల స్కిల్ 20 రకాల కోర్సులు ఉన్నాయి.
విద్యారంగంలో విప్లవాత్మక కార్యక్రమాలు
- పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు పాఠశాలల్లో ప్రాథమికస్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన
- విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 2021-22 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ అమలు
- 2021-22 విద్యా సంవత్సరం నుండి అన్ని డిగ్రీ కోర్సులలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన
- అంగన్ వాడీలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేసి పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాసుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన
- జూన్ 2019 నుండి ఇప్పటివరకు రెండేళ్లలో విద్యా రంగంపై మొత్తం రూ.25,714 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్ వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment