
జులుం ప్రదర్శించిన టీడీపీ నేతలు.. తాము చెప్పినట్లే చేయాలంటూ అధికారులపై రుబాబు
వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లపై కూటమి నేతల దౌర్జన్యం
పలు చోట్ల కూటమి నేతల మధ్యే వాగ్వాదాలు
అధికార పార్టీ నేతల రాజకీయ ప్రసంగాలతో విసుగెత్తిన ప్రజలు
ముందుగా నిర్ణయించిన పనులకే మమ అంటూ ఆమోదం
సాక్షి, అమరావతి/టాస్క్‌ఫోర్స్/నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూటమి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన గ్రామ సభలు చివరకు రసాభాసగా మారాయి. గ్రామాల్లో సమస్యలపైనా, గ్రామ అభివృద్ధికి నిర్వహించాల్సిన సభలు కాస్తా టీడీపీ నేతల జులుం ప్రదర్శించే కార్యక్రమంగా జరిగాయి. ఉద్యోగం చేయాలంటే తాము చెప్పినట్లుగానే వినాలని టీడీపీ నేతలు హెచ్చరించారు. తాము సూచించిన పనులే చేయాలని, పాతవి మంజూరైనా ఆపాల్సిందేనని కూడా కూటమి నేతలు పట్టుబట్టారు. గ్రామస్థులకు ఎక్కడా మాట్లాడే అవకాశం దక్కలేదు.
ఇక వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లకు ఎక్కడా తగిన ప్రాధాన్యత లభించలేదు. టీడీపీ నేతలే ముందుండి సభలను నడిపించారు. కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లపై కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారు. ఆ సర్పంచ్‌లను మాట్లాడనివ్వకుండా సభల నుంచి నెట్టివేశారు. కొత్తగా గ్రామాల్లో చేపట్టే పనులకు.. ముందే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గుర్తింపు పూర్తయింది. ఆ పనులకు ఉపాధి పథకం నిబంధనల ప్రకారం శుక్రవారం జరిగిన గ్రామసభల్లో మమ అనిపించారు.
అరుపులు..కేకలు..
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన గ్రామసభ కూటమి నేతల అరుపులు, కేకలతో çదద్దరిల్లిపోయింది. జగనన్న కాలనీకి రోడ్లు, డ్రైన్ నిర్మించాలని బీజేపీ నాయకుడు మోది సత్తిబాబు సూచిస్తే.. జనసేనకు చెందిన జయసుధ దానికి అడ్డు చెప్పారు. దీంతో ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటున్న కొందరు మహిళలు తిరగబడ్డారు. వారి మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో మిగిలిన వారు కూడా సమస్యల పరిష్కారానికి పట్టుపట్టడంతో ఇరువర్గాల నుంచి కేకలు, అరుపులు మిన్నంటాయి.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామసభలో కూటమి నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. జలుమూరు మండలం జోనంకి గ్రామసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలు సర్పంచ్‌కు చెప్పులు చూపుతూ ‘మా ప్రభుత్వం మా ఇష్టం ఎవరు అడ్డు వస్తారో చూస్తాం’ అని పరుష పదజాలంతో దూషించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రామçÜభలు మొక్కుబడిగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలే తప్ప సమస్యల పరిష్కారానికి చేసిందేమీ లేదని ప్రజలు నిట్టూర్చారు.
విజయనగరం జిల్లాలో జరిగిన గ్రామ సభల్లో కూటమి నేతలు అధికార జులుం చూపించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించలేదు. ఏవిధమైన అధికార హోదాలేని కూటమి నేతలకు వేదికపై కుర్చీలు వేశారు. అధికారులను భయపెట్టి కుర్చీలు వేయించుకున్నారు. భూములు, చెరువులు ఆక్రమణలపై కొన్ని చోట్ల వాగ్వాదాలు జరిగాయి.
దళిత నేతలపై దాష్టీకం
దళిత నేతపై పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నేత దాడి చేసి గాయపరచిన ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామ సభలో జరిగింది. స్టెంట్ వేయించుకున్నానని చెప్పినా కూడా మెడ వంచి పొట్టలో గుద్దడం గమనార్హం. గ్రామ సభ అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ రాచూరి దేవి, ఆమె భర్త రాచూరి బాలస్వామి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి టీడీపీ నేత అన్నపనేని సురేష్ వచ్చి చేసిన పనులకు సంతకం పెట్టాలని సర్పంచ్‌ను డిమాండ్ చేశాడు. దీనికి ఆమె నిరాకరించారు.

వెంటనే ఆగ్రహించిన సురేష్.. పక్కనే ఉన్న బాలస్వామి మెడ వంచి పొట్టలో పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటన తర్వాత ముండూరు రహదారిపై దళిత నేతలు నిరసనకు దిగారు. ప్రకాశం జిల్లా కంభం సచివాలయంలో దళిత సర్పంచ్‌పై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా గొడవకు దిగారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని లింగమనాయుడుపల్లిలో గ్రామసభ సాక్షిగా ఓ టీడీపీ నేత దళితులను కులం పేరుతో దూషించాడు. సంఘమిత్రను ఎందుకు తొలగిస్తున్నారంటూ దళితులు ప్రశ్నించడంతో టీడీపీ నేత గొడవకు దిగాడు.
సర్పంచ్‌లపై
దుర్భాషలువిజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామసభలో సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావుపై టీడీపీ వార్డు సభ్యులు కోనేరు నారాయణ, బసవయ్య దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వం మాది మీ పెత్తనం ఏమిటి.. మీరు చేసింది చాలు ఇక మేము చూసుకుంటామంటూ దుర్భాషలతో రెచ్చిపోయారు. తాను బీసీ ననే చులకన భావంతో టీడీపీ నాయకులు ప్రతి విషయంలో తనపై రెచ్చిపోతున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రూరల్ మండలం తోకావారిపాలెం గ్రామ సభలో అధికారులను టీడీపీ నాయకులు బెదిరించారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దండిగుంట గ్రామసభలో సర్పంచ్‌ని టీడీపీ నేతలు బెదిరించారు. ‘సభ నుంచి వెళ్లిపోండి. ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు’ అంటూ టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ సర్పంచ్ బెల్లకొండ సుప్రజను బెదిరించారు. బాపట్ల జిల్లాలో జరిగిన గ్రామ సభల్లో పలుచోట్ల వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్‌లను పిలవకుండా సభలను తూతూ మంత్రంగా జరిపారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులో ‘తాను చెప్పినట్టు వినకపోతే ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఎక్కడికైనా వెళ్లిపో..’ అంటూ గ్రామసభలో సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు కాళంగి శ్రీనివాసులు బెదిరించారు.
కంభం–3 సచివాలయం పరిధిలో గుర్తించిన పనుల వివరాలను మహిళా ఉద్యోగి చదువుతున్న సమయంలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని ‘ఎవరిని అడిగి తీర్మానాలు చేసుకున్నారు... మాకు చెప్పాలి కదా...’ అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ మహిళా ఉద్యోగి కంటతడి పెట్టారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. తమకు చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ గ్రామ సభను అడ్డుకున్నారు. అధికారులను, సర్పంచ్‌ను దూషించారు.
Comments
Please login to add a commentAdd a comment