హిరమండలం వద్ద వంశధార ప్రాజెక్టులో నిర్మిస్తున్న ఇన్‌టేక్ వెల్
సాక్షి, శ్రీకాకుళం: అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోతున్న బతుకులు వారివి. అనారోగ్యం కుదుట పడేందుకు ఏదైనా పనిచేయకపోతే మందులు కూడా కొనుగోలు చేసుకోలేని దుస్థితి. పనికి వెళ్లేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాధి తెలుసుకునేలోపే మంచం పట్టడం.. వైద్యం చేసుకునేలోపే తనువు చాలించడం ఇక్కడ పరిపాటి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ మహమ్మారితో నిత్యం చావులు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 15వేల మంది కిడ్నీ బారిన మృతి చెందిననట్టుగా నివేదికలు చెబుతున్నాయి. అనేక ప్రభుత్వాలు మారినా ఇక్కడి పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి ముందుకొచ్చారు. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ రోగులకు పింఛన్లను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచారు. పలాసలో 200పడకలతో కిడ్నీ రోగులకు సూపర్ స్పెషాలటీ ఆస్పత్రితో పాటు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 530.81కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
పెద్ద నీలావతి వద్ద చేపడుతున్న 10లక్షల లీటర్ల సామర్థ్యం గల సంప్ పనులు
అనేక పరిశోధనలు..
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 90వ దశకంలో కన్పించాయి. 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాటీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యాధి కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో నాటి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌అగర్వాలా(లల్లూ) చొరవ తీసుకుని కేజీహెచ్ హెచ్‌ఓడీ డాక్టర్ రవిరాజ్ చేత 2005లో కవిటీ ప్రాంతంలో పరిశోధన వైద్యశిబిరాలు ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది దేశ విదేశాలకు చెందిన బృందాలు పరిశోధనలు కొనసాగించాయి. దాదాపు 20ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు, పరిశీలనలు చాలా వరకు మంచినీరే సమస్య కావొచ్చని సూచన ప్రాయంగా చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 112 గ్రామాలు కిడ్నీ వ్యాధుల బారిన పడి బాధపడుతున్నాయి.
ఉద్దాన జలమాలకు శ్రీకారం
ఉద్దానం బాధితులను గత పాలకులు గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దానంపైనే దృష్టి పెట్టారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు నీరే ప్రధాన కారణమై ఉండొచ్చని భావిస్తూ ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కుళాయిల ద్వారా నిరంతరం అందించేలా రూ.700 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. అన్నీ బేరీజు వేసుకుని చివరికీ రూ. 530.81కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చకాచకా ఉద్దానం పనులు
ఉద్ధానం మెగా మంచినీటి ప్రాజెక్టు పనులు టెండర్ల ద్వారా మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ దక్కింది. రెండేళ్లలో పూర్తి చేసేలా పనులు కూడా ప్రారంభించింది. హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని పైపులైన్ల ద్వారా తీసుకెళ్లి 2051 అంచనాల ప్రకారం 7లక్షల 82 వేల 707మందికి చెరో 100లీటర్ల చొప్పున 22 గంటల పాటు రక్షిత మంచినీరు సరఫరా చేసేలా పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 807 గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు.
ప్రతిష్టాత్మకంగా పనులు
ఉద్దానం మంచినీటి పథకం పనులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నిర్ణీత గడువులోగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మెగా సంస్థ పనులు త్వరితగతిన చేపడుతోంది. అధికారుల పర్యవేక్షణలో పనులు చకచకా జరగనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఉద్దానం తాగునీటి సమస్య తీరనుంది. కిడ్నీ వ్యాధి నియంత్రించడానికి దోహదపడే అవకాశం ఉంది.
– జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment