Drinking water facilities
-
రోడ్లు, తాగునీటిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. చేపట్టే పనులన్నింటిలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. చదవండి👉: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్లకు వెంటనే శాఖాపరమైన అనుమతులకు సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తి చేసి జూన్ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మరో వైపు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలుపగా నిధులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు. సీఎం జగన్ ఏమన్నారంటే... : ♦చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పనిచేయాలన్న సీఎం ♦తద్వారా రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్ ఛానెల్స్‌కి లింక్ చేయగలిగితే... నీటిఎద్దడిని నివారించగలుగుతామన్న సీఎం ♦కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలి ♦దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిన సీఎం త్వరితగతిన భవన నిర్మాణాల పూర్తి ♦ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం ♦వీటీపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్న ముఖ్యమంత్రి ♦ప్రతిచోటా నవరత్నాలు ఫోటో ఉండేలా చూడాలని ఆదేశం ♦గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు మనం చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు వచ్చాయి ♦అయినా ఇబ్బందులు అధిగమించి ఆ బకాయిలు చెల్లించాం ♦భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి ♦భవన నిర్మాణ పనులు ఆగకూడదు.. అలాగని పనులు చేస్తున్నవారు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ♦ఉపాధి హామీ పనులుకు సంబంధించి.. బిల్లులు అప్లోడ్ తో పాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదు. ♦ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి ♦అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలి. ♦గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల సహా మొత్తం నాలుగు రకాల భవనాల నిర్మాణాలు పూర్తి కావాలన్న సీఎం వైఎస్సార్ జలకళ.. ♦వైఎస్సార్ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుంది ♦ఈ పథకం కింద నాణ్యమైన మోటార్లు ఎంపిక చేయాలి ♦175 నియోజవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రిగ్గు ఉండాలి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలన్న సీఎం ♦నియోజకవర్గానికి ఒక రిగ్గు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ♦ఇప్పటివరకు 13,245 బోర్లు వేశామన్న అధికారులు ♦ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షల ఖర్చు చేస్తున్నామన్న సీఎం ♦బోరు డ్రిల్లింగ్ డబ్బులు రైతు అకౌంట్‌కు నేరుగా (డీబీటీ విధానంలో) జమ చేసి.. అతని నుంచి పేమెంట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్న సీఎం ♦దీనివల్ల లంచాలు లేని వ్యవస్ధను తీసుకురాగలుగుతామన్న సీఎం ♦దానికి తగిన విధంగా ఎస్ఓపీలు రూపొందించాలన్న సీఎం ♦ఫలితంగా మరింత పారదర్శకత పెరుగుతుందన్న సీఎం ♦ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకుఅన్ని రకాల సౌకర్యాలతో ఉచిత బోరు ♦5-10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు కేవలం డ్రిల్లింగ్ మాత్రమే ఉచితం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు.. ♦గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్న సీఎం ♦రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు ♦ఆర్ అండ్ బీలో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి ♦గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు తక్షణమే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం ♦వెంటనే టెండర్లకు వెళ్లాలన్న సీఎం ♦అనంతరం తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశం ♦ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రెండింటిలోనూ రోడ్లకు సంబంధించి నాడు-నేడు ఫోటోలు డిస్ప్లే చేయాలి ♦మే 15-20 తేదీల నాటికల్లా పనులు ప్రారంభం కావాలన్న సీఎం ♦పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి సంబంధించిన పనులు అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్న సీఎం ♦పాట్ హోల్ ఫ్రీ బీటీ రోడ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం ♦గ్రామ, వార్డు సచివాలయంలో నాడు-నేడు పనులకు సంబంధించి విద్య, వైద్య ఆరోగ్యం, రహదారులుపై చేపట్టిన పనులకు సంబంధించి ఫోటోలను డిస్ప్లే చేయాలన్న సీఎం ♦రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన ఫోటోలను కూడా డిస్ప్లే చేయాలి ♦జలజీవన్ మిషన్ కింద జగనన్న కాలనీల్లో నీటిసరఫరా అత్యధిక ప్రాధాన్యతతో చేపట్టాలన్న సీఎం ♦జలజీవన్ మిషన్‌కు సంబంధించి నాబార్డు, కేంద్రం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం ఆదేశం సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్... ♦గ్రామాల్లో మురుగునీటి కాలువలు నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ♦గ్రామాలలో రోడ్లమీద మురుగునీరు, చెత్త లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం ♦సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిర్వహణ కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు నాటికి 100శాతం పూర్తి కావాలి ♦అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలి, ఊర్లన్నీ క్లీన్‌గా కనిపించాలి ♦2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధంగా ఉంచుతామన్న అధికారులు. ♦తడి, పొడి చెత్తలపై విడివిడిగా అవగాహన కలిగించాలన్న సీఎం. ♦ప్రతి పంచాయతీకి చెత్త తరలింపునకు ట్రాక్టర్ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలన్న సీఎం ♦దశలవారీగా దాన్ని చేరుకోవాలన్న సీఎం ♦రోడ్డుమీద ఎక్కడా చెత్త, మురుగునీటి ప్రవాహం కనిపించకూడదని ఆదేశం. ♦హై ప్రెజర్ టాయ్‌లెట్ క్లీనర్స్ నెంబర్లు ప్రతిగ్రామంలోనూ డిస్ప్లే చేయాలన్న సీఎం. ♦సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్‌కు సంబంధించిన క్లాప్ మిత్ర జీతాలు చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం. లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్... ♦మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో దశలవారీగా లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్ చేపట్టాలన్న సీఎం ♦46 లిక్విడ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేపట్టిన తర్వాత 632 డీస్లడ్జింగ్ మిషన్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు ♦దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాలన్న సీఎం. ♦13వేల గ్రామ పంచాయతీల్లో కూడా మురుగునీటిపారుదల వ్యవస్ధ ఉండేలా... రోడ్లమీద చెత్త, కాలువల్లో మురుగునీరు ఓవర్‌ప్లో కాకుండా సక్రమంగా నిర్వహణ చేపట్టాలి ♦ఇందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడంతో పాటు... దాన్ని సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్న సీఎం ♦గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతో పాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం ♦స్కూల్స్‌లో హెడ్‌మాష్టారుతో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలి ♦పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్న సీఎం వేసవిలో తాగునీటి సరఫరాపైనా సీఎం సమీక్ష ♦నీటి ఎద్దడి ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న అధికారులు ♦జూలై వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్న అధికారులు ♦తాగునీటి కోసం తీసుకున్న శాశ్వత చర్యల వల్ల గతంలో పోల్చుకుంటే వేసవి నీటి ఎద్దడిని గణనీయంగా తగ్గించగలిగామన్న అధికారులు ♦తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెలైనిటీ ప్రభావం, ఉద్దానంలో ప్లోరైడ్ ప్రభావం, వైయస్సార్ జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న సీఎం ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతి ప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉద్దానంలో ఉషోదయం.. చకాచకా పనులు
సాక్షి, శ్రీకాకుళం: అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోతున్న బతుకులు వారివి. అనారోగ్యం కుదుట పడేందుకు ఏదైనా పనిచేయకపోతే మందులు కూడా కొనుగోలు చేసుకోలేని దుస్థితి. పనికి వెళ్లేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాధి తెలుసుకునేలోపే మంచం పట్టడం.. వైద్యం చేసుకునేలోపే తనువు చాలించడం ఇక్కడ పరిపాటి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ మహమ్మారితో నిత్యం చావులు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 15వేల మంది కిడ్నీ బారిన మృతి చెందిననట్టుగా నివేదికలు చెబుతున్నాయి. అనేక ప్రభుత్వాలు మారినా ఇక్కడి పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ముందుకొచ్చారు. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ రోగులకు పింఛన్లను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచారు. పలాసలో 200పడకలతో కిడ్నీ రోగులకు సూపర్ స్పెషాలటీ ఆస్పత్రితో పాటు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 530.81కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద నీలావతి వద్ద చేపడుతున్న 10లక్షల లీటర్ల సామర్థ్యం గల సంప్ పనులు అనేక పరిశోధనలు.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 90వ దశకంలో కన్పించాయి. 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాటీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యాధి కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో నాటి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే నరేష్కుమార్అగర్వాలా(లల్లూ) చొరవ తీసుకుని కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్ చేత 2005లో కవిటీ ప్రాంతంలో పరిశోధన వైద్యశిబిరాలు ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది దేశ విదేశాలకు చెందిన బృందాలు పరిశోధనలు కొనసాగించాయి. దాదాపు 20ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు, పరిశీలనలు చాలా వరకు మంచినీరే సమస్య కావొచ్చని సూచన ప్రాయంగా చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 112 గ్రామాలు కిడ్నీ వ్యాధుల బారిన పడి బాధపడుతున్నాయి. ఉద్దాన జలమాలకు శ్రీకారం ఉద్దానం బాధితులను గత పాలకులు గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దానంపైనే దృష్టి పెట్టారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు నీరే ప్రధాన కారణమై ఉండొచ్చని భావిస్తూ ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కుళాయిల ద్వారా నిరంతరం అందించేలా రూ.700 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. అన్నీ బేరీజు వేసుకుని చివరికీ రూ. 530.81కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చకాచకా ఉద్దానం పనులు ఉద్ధానం మెగా మంచినీటి ప్రాజెక్టు పనులు టెండర్ల ద్వారా మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ దక్కింది. రెండేళ్లలో పూర్తి చేసేలా పనులు కూడా ప్రారంభించింది. హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని పైపులైన్ల ద్వారా తీసుకెళ్లి 2051 అంచనాల ప్రకారం 7లక్షల 82 వేల 707మందికి చెరో 100లీటర్ల చొప్పున 22 గంటల పాటు రక్షిత మంచినీరు సరఫరా చేసేలా పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 807 గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా పనులు ఉద్దానం మంచినీటి పథకం పనులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నిర్ణీత గడువులోగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మెగా సంస్థ పనులు త్వరితగతిన చేపడుతోంది. అధికారుల పర్యవేక్షణలో పనులు చకచకా జరగనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఉద్దానం తాగునీటి సమస్య తీరనుంది. కిడ్నీ వ్యాధి నియంత్రించడానికి దోహదపడే అవకాశం ఉంది. – జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం -
రోడ్డు వేస్తేనే మా గ్రామానికి రండి..
అభ్యర్థులకు గ్రామస్తుల హెచ్చరిక క్రిష్ణగిరి: వందేళ్లుగా నివశిస్తున్నాం. మా గ్రామానికి రోడ్డు లేదు. కనీస వసతులు కూడా కల్పించలేదు. ప్రతిఎన్నికల్లోనూ అభ్యర్థులు వాగ్దానాలు చేసి ఓట్లు కొల్లగొడుతున్నారు. ఈ సారి ఓట్లు అడిగేందుకు వచ్చే అభ్యర్థులు మా గ్రామాలకు రోడ్డు వేసి లోనికి రావాలని, లేదంటే అడ్డుకుంటాం, నల్లజెండాలు ప్రదర్శిస్తామని వేపనహళ్లి నియోజకవర్గంలోని చంబరసనపల్లి పంచాయతీ పెద్దపాపనపల్లి గ్రామస్థులు, అంకొండపల్లి పంచాయతీ చిన్నపాపనపల్లి, చక్కార్లు గ్రామస్థులు పేర్కొన్నారు. పెద్దపాపనపల్లిలో 30 ఇళ్లు, చక్కార్లులో 100, చిన్నపాపనపల్లిలో 60 ఇళ్లున్నాయి. వందలాది ఏళ్లుగా ఇక్కడే నివశిస్తున్నామనీ. తమ గ్రామాలకు రోడ్డు వసతి లేదు, పాఠశాలలు లేవు. తాగునీటి వసతులు లేవని గ్రామస్థులు తెలిపారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి వెళ్లుతున్నారేకాని, ఎన్నికల తర్వాత ముఖం చాటేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. ఈ గ్రామాలలో సరైన వైద్యసదుపాయాలు లేక అంగవికలురు ఎక్కువ. చిన్నపాపనపల్లిలో 20 మంది అంగవికలున్నారు. ఈ మాల పిల్లలు ఉన్నత చదువులకై సూళగిరికి ఎనిమిది కిలోమీటర్లదూరం నడచి వెళ్లుతున్నారు. ప్రాథమిక పాఠశాలలకు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం నడచి వెళ్లవలసి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. చిన్నారు నదికడ్డంగా వంతెన నిర్మాణం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితంలేదన్నారు. ఈ గ్రామాల్లో చిరుత, ఏనుగుల భయం ఎక్కువ. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఓటు గొడవ తప్పా తమ గోడు పట్టించుకోవడంలేదని స్థానికులంటున్నారు. ఈ ఎన్నికలలో మాత్రం ఎవరినీ వదిలేదిలేదని హెచ్చరించారు. -
గొంతులు కూడా తడపలేరా?
= గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ వైఫల్యం = నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలన్న విపక్షనేత శెట్టర్ బెంగళూరు: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలను మార్చి చివరిలోగా ఏర్పాటు చేస్తామన్న తన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షనేత జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో జగదీష్ శెట్టర్ మాట్లాడారు. ‘గ్రామీణ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చేందుకు ఏడు వేల తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, లేదంటే పదవికి రాజీనామా చేస్తానని గత ఏడాది మీరే చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,500తాగునీటి కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మీకే మాత్రం నైతికత ఉన్నా ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయండి’ అంటూ డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, మీకూ మధ్య అభిప్రాయ బేధాలున్నాయో లేక నిధులు విడుదల కాలేదో! అవేవీ మాకు తెలియదు. మాకు కేవలం ఫలితాలే ముఖ్యం’ అని జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి హెచ్.కె.పాటిల్ మాట్లాడుతూ.... రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల తాగునీటి కేంద్రాల స్థాపనకు టెండర్లను పిలిచామని, అయితే అధికారుల లోపం, కాంట్రాక్టర్ల తప్పుల కారణంగా 4000 కేంద్రాలకు సంబంధించిన టెండర్లను తిరస్కరించామని వివరించారు. ఈ కేంద్రాల స్థాపనకు సంబంధించి మరో సారి టెండర్లను పిలవాల్సి రావడంతో ఈ ప్రక్రియ కాస్తంత ఆలస్యమైందని పేర్కొన్నారు. -
గోదావరి పుష్కరాలకు రూ.13.48 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కర ఏర్పాట్ల నిమిత్తం రూ.13.48 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఐదు జిల్లాల్లో మొత్తం 174 పనులను చేపట్టాలని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గ్రామీణ నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించింది. తాగునీటి సదుపాయం కోసం శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు, మరుగుదొడ్ల సదుపాయాలను పుష్కర ఘాట్ల వద్ద చేపట్టనున్నారు. -
అంధకారంలో.. ‘ఆది’లాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాలో 1,01,929 కుటుంబాలు సొంత ఇళ్లలో నివసిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 1,48,175 కుటుంబాలు అద్దె ఇంట్లో ఉంటున్నాయి. 48,300 కుటుంబాలు రేకుల పైకప్పులో ఉంటున్నాయి. 35 వేల మంది తాత్కాలిక నివాసాల్లో జీవనం సాగిస్తుండగా, మరో 35 వేల మంది గుడిసెలు, తాటిపత్రులతో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతిళ్లు నిర్మించుకోవాలనేది సగటు వ్యక్తి కల. ఆ కల ఇంకా నెరవేరడం లేదు. ఒకే గదిలో జీవనం సాగిస్తున్న కుటుంబాలు 4,32,029 ఉండగా, రెండు గదుల్లో నివసించే కుటుంబాలు 2,54,714, మరో 72 వేల కుటుంబాలు మూడు గదుల్లో ఉంటున్నాయి. నాలుగు అంతకంటే ఎక్కువ సంఖ్యలో 35,923 కుటుంబాలు నివసిస్తున్నాయి. రాష్ట్రంలో రెండో స్థానం.. జనాభా పరంగా జిల్లాలో వెనుకబడిన వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఆదివాసీ జిల్లాగా పేరుగాంచి రాష్ట్రంలోనే ఎస్టీ జనాభాల్లో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లాలో మొత్తం జనాభా 28,24,953లో ఎస్టీలు 5,79,842 ఉన్నారు. బీసీ జనాభా 13,60,702 ఉండగా, ఎస్సీలు 5,30,471, ఓసీలు 3,55,695, మైనార్టీలు 3,25,575 ఉన్నారు. బీసీ జనాభా తర్వాత అత్యధికంగా ఎస్టీలే ఉన్నారు. భూమి లేని నిరుపేదలు.. జిల్లాలో మొత్తం 8,16,482 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో 5,13,520 కుటుంబాలకు సొంత భూమి లేదని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. 3,02,962 కుటుంబాలకు సొంత భూమి ఉన్నట్లు నిరూపన అయ్యింది. ఇందులో 81,976 కుటుంబాలకు ఎకరంలోపు భూమి ఉండగా, 48,442 కుటుంబాలకు రెండెకరాలలోపు సాగు భూమి ఉంది. 48,517 కుటుంబాలకు మూడెకరాలలోపు, 35,432 కుటుంబాలకు నాలుగెకరాలలోపు, 33,672 కుటుంబాలకు ఐదెకరాలలోపు సాగు భూమి ఉంది. ఐదుకంటే ఎక్కువగా 95,797 కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. రాష్ట్రంలో నాలుగోస్థానం.. జిల్లాలో 5,17,152 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోంది. స్వచ్ఛభారత్ అంటూ దేశమంత నాయకులు చేస్తున్న హడావుడి అంతాఇంతాకాదు. ప్రతి వ్యక్తి స్వచ్ఛభారత్‌లో పాల్గొనాలంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ.. జిల్లాలో ఎందరికి మరుగుదొడ్లు ఉన్నాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని కుటుంబాల్లో జిల్లా నాలుగోస్థానంలో నిలిచింది. ఉద్యోగులు.. జిల్లాలో మొత్తం ఉద్యోగులు 1,02,773 ఉన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 28,018 ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8976 మంది ఉన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులు 18,744 ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు 21,692 ఉండగా, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 25,343 మంది ఉన్నారు. తాగునీటి సదుపాయం.. జిల్లాలో అత్యధిక జనాభా ప్రభుత్వ నల్లాలు కలిగిన వారే ఉన్నారు. 2,64,179 మందికి ప్రభుత్వ నల్లాలు ఉండగా, 2,05,164 కుటుంబాలు చేతిపంపుల ద్వారా తాగునీటి పొందుతున్నారు. బోరుబావి ద్వారా 61,486 మంది, 62,306 కుటుంబాలు బోరు మోటర్ల ద్వారా తాగునీటిని తెచ్చుకుంటున్నారు. సొంత బోరు కలిగిన వారు 46,285 మంది ఉన్నారు. 1,23,083 కుటుంబాలకు పంచాయతీ నల్ల కనెక్షన్లు ఉన్నాయి. 8,941 కుటుంబాలు తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాల జోరు.. జిల్లాలో ఎక్కువగా 1,27,577 కుటుంబాలకు ద్విచక్ర వాహనాలు ఉండగా, 9,899 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. 8,195 కుటుంబాలకు మూడు చక్రాల వాహనాలు ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. 4,741 కుటుంబాలకు ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు ఉన్నాయి. జిల్లాలో 945 కుటుంబాలకు ఏసీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వెల్లడించాయి. -
జిల్లాకు సుప్రీంకోర్టు బృందం
22, 23 తేదీల్లో పాఠశాలల తనిఖీ ప్రధానంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై దృష్టి అప్రమత్తమైన విద్యాశాఖాధికారులు గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై సుప్రీం కోర్టు నియమించిన ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో తనిఖీకి రానుంది. ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీటి కల్పనతో పాటు ఇతర అవసరాలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్)ద్వారా ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తోంది. పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా ఈ నిధులు ఖర్చు చేసి విద్యార్థులకు సదు పాయాలను కల్పించాల్సి ఉంది. అయితే నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం మినహా క్షేత్ర స్థాయిలో మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీటి వసతుల కల్పన కలగానే మిగిలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా వాటిలో పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నవి కేవలం 30 శాతం మాత్రమే. నిర్వహణ లోపంతో అవి శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడం, నీటి సదుపాయం ఉన్నచోట పరిశుభ్రత పాటించకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. ఈ తరహా వాటిపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది.ఈ క్రమంలో పాఠశాలల్లో ఆయా వసతుల కల్పనకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన బృందం స్వయంగా పరిశీలనకు రానుంది. జిల్లాలో సుప్రీం కోర్టు బృందం పర్యటిస్తుందనే సమాచారంతో విద్యాశాఖాధికారులు ఒక్కసారిగా కదిలారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరుగు దొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.సుప్రీంకోర్టు బృందం పర్యటనతోనైనా జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉన్నదేమో చూడాలి. -
సుజలం విఫలం
అట్టహాసంగా ‘సుజల స్రవంతి’ ప్రారంభం రెండు నెలలైనా రెండోవిడతకు నోచని పథకం మొదటి విడతలోనే పూర్తిస్థాయిలో అందని శుద్ధ జలం అర్బన్‌లో నీరు.. అదే తీరు విశాఖపట్నం సిటీ: విశాఖ అర్బన్‌లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పడకేసింది. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ పథకం సగానికి సగం కేంద్రాల్లో పనిచేయడం లేదు. విశాఖ అర్బన్‌లో ఐదు చోట్లకు గాను నాలుగు చోట్ల మాత్రమే ప్రారంభించారు. హుద్‌హుద్ తుపానుకు నగరంలోని రెండు కేంద్రాలు మూతపడగా, మిగిలిన కేంద్రాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. 37వ వార్డులోని బాపూజీనగర్‌లో ప్రారంభం కాలేదు. ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. 30వ వార్డులోని అల్లిపురం నేరెళ్లకోనేరు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ పథకం నిర్వహణ సక్రమంగా లేదు. కొద్ది రోజులుగా ట్యాంకులో నీటిని శుభ్రం చేయకపోవడం వల్ల పురుగులు పట్టి అధ్వానంగా ఉండటంతో నీటి కోసం ఎవరూ రావడ ం లేదు.రెండో వార్డు పరిధిలోని ఆరిలోవ డిస్పెన్సరీ వద్ద ఏర్పాటు చేసిన సుజల స్రవంతి ద్వారా రోజుకు కేవలం 200 మందికి మాత్రమే నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మురికి వాడలుండండతో ఎక్కువ మంది ప్రజలు ఎగబడుతున్నారు. కాని రోజుకు వెయ్యి లీటర్లలోపే సరఫరా చేస్తున్నారు. 48వ వార్డు పరిధిలోని మల్కాపురం దరి ఇందిరా కాలనీలో తాగు నీటిని ఇతరులకు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి. స్థానికులకు 20 లీటర్ల తాగునీటిని రెండు రూపాయలకే అందించాల్సి ఉండగా మినరల్ వాటర్ అమ్ముకునే వారితో కుమ్మకై వారి ట్యాంకులను చౌకగా నింపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లోనే ఈ దందా జరుగుతున్నట్టు చెబుతున్నారు. 58వ వార్డులోని పెదగంట్యాడ సమీపంలోని ఫకీర్‌తక్యా కాలనీలో ఏర్పాటు చేసిన సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు కొద్ది మందికే నీటిని సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాళ్లపాలెంలో.. కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో అక్టోబర్ 6న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. తాళ్లపాలెంతో పాటు అమీన్‌సాహెబ్‌పేట, సోమవరం, ఉగ్గినపాలెం, జి.భీమవరం, నరసింగబిల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి టిన్లతో నీటిని తీసుకెళ్తున్నారు. నీళ్ల ట్యాంకు సామర్థ్యం వెయ్యి లీటర్లే అయినందున పూర్తి స్థాయిలో శుద్ధ జలం అందించలేకపోతున్నారు. పథకం నీటి ట్యాంకు సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. తగరపువలస : ప్రజలందరికీ సురక్షిత తాగునీరందించడమే ధ్యేయమని ఎన్టీఆర్ సుజలస్రవంతి పేరుతో ఎన్నికల మేనిఫెస్టోతో ఊదరగొట్టిన టీడీ పీ నేతలు ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాతలు దొరకలేదంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు.గాం ధీ జయంతి రోజున భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావుచే అట్టహాసంగా ప్రారంభించినా, నియోజకవర్గంలో గంభీరం మినహా మిగతాచోట్ల ఈ పథకం ఇంకా పురుడుపోసుకోలేదు. భీమిలి మండలం చిప్పాడ దివీస్ ల్యాబరేటరీ స్పం దించి మండలంలో 11 చోట్ల ఆర్వోప్లాంట్ల నిర్మాణానికి రూ. 1.32 కోట్లు కేటాయించడమే కాకుండా డిసెంబర్ 20 నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది. ఏడాదిపాటు వీటిని నిర్వహించి అనంతరం పంచాయతీలకు అప్పగించాలని దివీస్ యాజమాన్యం భావిస్తోంది. 15 నియోజకవర్గాల్లో 19 ఆర్వో ప్లాంట్స్ విశాఖపట్నం : జిల్లాలో 944 పంచాయతీల పరిధిలో 3,285 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో కేవలం 981 గ్రామాల్లో మాత్రమే పీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. 2,149 గ్రామాల ప్రజలు బోర్వెల్స్పైన, మరో 2,755 గ్రామాల్లో బావులపైన ఆధార పడుతున్నారు. ఎన్టీఆర్ సుజలధారలో తొలుత 232 పంచాయతీలను ఎంపిక చేశా రు. ఈ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు కోసం దాతలుగా 12 పారిశ్రామిక, సేవా సంస్థలను ఎంపిక చేశారు. తొలిదశలో ఐదుకోట్ల 98 లక్షల 83 వేల అంచనాతో 133 ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాని చివరి నిమిషంలో దాతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించక పోవడంతో మండలానికొకటి కా దు కదా కనీసం నియోజకవర్గానికి ఒకటైనా ఏర్పాటు చేసి పరువు నిలబెట్టుకోవాలన్న తలంపుతో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అక్టోబర్2న 19 ఆర్వో ప్లాంట్స్‌ను ప్రారంభించగలిగారు. వీటిలో అత్యధిక ప్లాంట్స్ సామర్థ్యం వెయ్యిలీటర్లే కావడం గమనార్హం. ఇవి కూడా రోజుకు కేవలం 755 కేన్స్(20 లీటర్ల)ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి. ఆనందపురం, కశింకోట మండలాల్లో ఏర్పాటు చేసిన మూడు ప్లాంట్స్‌ను దాతలు నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లోని ఆర్వో ప్లాంట్స్‌ను ఆయా గ్రామ పంచాయతీలే నిర్వహిస్తున్నాయి.అచ్యుతాపురం, రాంబిల్లి, చోడవరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ ప్రారంభించిన కొద్దిరోజులకే మూలన చేరాయి. మిగిలిన వాటి నిర్వహణ అధ్వానంగా ఉండడంతో మూడు రోజులు పని చేయడం..నాలుగురోజులు మూలనపడ్డం చందంగా తయారైం ది.దీంతో చివరకు రూ.2లకే 20 లీటర్ల మినరల్‌వాటర్ ఒక మిథ్యగా తయారైంది. -
రోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
పీఆర్ ఇంజినీర్ల వర్క్‌షాప్‌లో మంత్రి అయ్యన్న విశాఖ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ శాఖకు క్వాలిటీ కంట్రోల్ విభాగం కీలకమని, దాన్ని పటిష్టపర్చి రానున్న కాలంలో అన్ని రకాల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు పర్చే అంశంపై పూర్తి స్థాయిలో మేధోమథనం చేయాలని ఇంజినీర్లకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని పేర్కొన్నారు. పంచాయతీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలనే లక్ష్యంతో రోడ్, వాటర్, పవర్, గ్యాస్, ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందని పేర్కొన్నారు. వీటి నిర్మాణంలో సమస్యలు తల్తెకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. పీఆర్ ఇంజినీర్-ఇన్-చీఫ్ సి.వి.ఎస్.రామ్మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామని, వీటి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ కనెక్టవిటీని పెంచేందుకు ఈ వర్క్‌షాపులో సుమారు రూ.100 కోట్లకు తక్కువ కాకుండా ప్రతిపాదనలు ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెడీ రెకనానర్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటేశ్వరరావు, నాబార్డు సీఈ పద్మజ, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రవీంద్రనాథ్, ఈఈ ఎల్.కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో ముందుకు వెళ్దాం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యల్ని సూక్ష్మ పరిశీలనతో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించింది. గ్రామం, పట్టణం, మండలం, జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేయాలి.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళికల రూపకల్పనపై గురువారం కలెక్టరేట్లో జరిగిన సమావేశానికి మంత్రి మహేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రణాళికలను ఏ విధంగా తయారు చేయాలి.. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి అభిప్రాయాలను సేకరించారు. ప్రజాప్రతినిధుల సూచనలు వారి మాటల్లోనే.. పాఠశాల ల్లో తాగునీటి వసతి మెరుగుపర్చాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అంతంతమాత్రంగానే ఉంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. తాగునీటి వసతి మాత్రం కల్పించలేదు. దీంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తాగాల్సివస్తోంది. టాయిలెట్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. తాజాగా రూపొందించే ప్రణాళికలో ఆయా అంశాలకు ప్రాధాన్యం కల్పిస్తే బాగుంటుంది.- జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం గ్రామాల్లో మెజార్టీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాజా ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాగు పనులు ముమ్మరమైనప్పుడు, దిగుబడులు వచ్చే సమయంలో కూలీలు లేక రైతులు నష్టపోతున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో చాలావరకు అక్కరకురాకుండా పోతున్నాయి. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ రంగం కొంతైనా మెరుగుపడుతుంది. - ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే చెరువుల పరిరక్షణ కీలకం ప్రధాన తాగునీటి వనరులైన చెరువులు జిల్లాలో చాలాచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్నింట్లో కబ్జాల పర్వం కొనసాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చేపట్టే ప్రణాళికల్లో చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వాటిని సంరక్షించేందుకు ప్రహరీలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే -
తాగునీటికి ‘విస్తరణ’ శాపం
రాయదుర్గం,న్యూస్‌లైన్: ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులకు రోడ్డు విస్తరణ పనుల జాప్యం శాపంగా మారింది. వాటర్‌వర్క్స్‌శాఖ గచ్చిబౌలి డివిజన్ పరిధిలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఏడాది క్రితం రూ.4 కోట్లతో గౌలిదొడ్డి శివారులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) స్థలం వద్ద ఉన్న ప్రధాన రోడ్డు నుంచి భారీ పైప్‌లైన్ పనులను చేపట్టాలని తలపెట్టారు. అనంతరం పైప్‌లను కూడా ఏడాది క్రితమే టీఐఎఫ్ఆర్ నుంచి గౌలిదొడ్డి వరకు రోడ్డుకు ఇరువైపులా తెచ్చి ఉంచారు. కానీ ఈ లోగా నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గోపన్‌పల్లి ఎన్టీఆర్‌కాలనీలోని ఐటీ జోన్‌ను కలుపుతూ ఉన్న రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. మొదటివిడతలో ఎన్టీఆర్కాలనీ నుంచి గోపన్‌పల్లి తాండ కూడలి వరకున్న రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తిచేశారు. అనంతరం గోపన్‌పల్లితాండ కూడలి నుంచి గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వరకున్న రోడ్డును 120 ఫీట్లు విస్తరించి మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీంతో పైప్‌లైన్ పనులకు రోడ్డు విస్తరణ అడ్డంకిగా మారింది. శాఖల మధ్య సమన్వయ లోపమే ప్రధానం: మంచినీటి పైప్‌లైన్, రోడ్డు విస్తరణ, విద్యుత్తు స్తంభాల తొలగింపు జరగాలంటే జీహెచ్ఎంసీ వాటర్‌వర్క్స్, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కానీ మూడు శాఖల మధ్య సమన్వయలోపమే అన్ని పనులకు శాపంగా మారిం ది. ఏడాదిక్రితం పైపులను రోడ్డు పక్కనవేసి రోడ్లు భవనాల శాఖ గ్రీన్‌సిగ్నల్ కోసం వాటర్‌వర్క్స్ అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలన్నా విద్యుత్‌శాఖ అధికారులు రోడ్డుపక్కన వేసిన స్తంభాలను తొలగించి కొత్తగా వేసే రోడ్డు శివారున వేయాల్సిన పనులు ప్రస్తుతం పూర్తి కావొచ్చాయి. త్వరగా రోడ్డు పనులను చేపట్టి పైప్‌లైన్ పనులు పూర్తిచేస్తే నీటి సరఫరా మెరుగుపడుతుంది.