అంధకారంలో.. ‘ఆది’లాబాద్ | calculation of compretion of andilabad district | Sakshi
Sakshi News home page

అంధకారంలో.. ‘ఆది’లాబాద్

Published Sat, Jan 10 2015 4:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

అంధకారంలో.. ‘ఆది’లాబాద్ - Sakshi

అంధకారంలో.. ‘ఆది’లాబాద్

ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాలో 1,01,929 కుటుంబాలు సొంత ఇళ్లలో నివసిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 1,48,175 కుటుంబాలు అద్దె ఇంట్లో ఉంటున్నాయి. 48,300 కుటుంబాలు రేకుల పైకప్పులో ఉంటున్నాయి. 35 వేల మంది తాత్కాలిక నివాసాల్లో జీవనం సాగిస్తుండగా, మరో 35 వేల మంది గుడిసెలు, తాటిపత్రులతో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతిళ్లు నిర్మించుకోవాలనేది సగటు వ్యక్తి కల. ఆ కల ఇంకా నెరవేరడం లేదు. ఒకే గదిలో జీవనం సాగిస్తున్న కుటుంబాలు 4,32,029 ఉండగా, రెండు గదుల్లో నివసించే కుటుంబాలు 2,54,714, మరో 72 వేల కుటుంబాలు మూడు గదుల్లో ఉంటున్నాయి. నాలుగు అంతకంటే ఎక్కువ సంఖ్యలో 35,923 కుటుంబాలు నివసిస్తున్నాయి.
 
రాష్ట్రంలో రెండో స్థానం..
జనాభా పరంగా జిల్లాలో వెనుకబడిన వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఆదివాసీ జిల్లాగా పేరుగాంచి రాష్ట్రంలోనే ఎస్టీ జనాభాల్లో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లాలో మొత్తం జనాభా 28,24,953లో ఎస్టీలు 5,79,842 ఉన్నారు. బీసీ జనాభా 13,60,702 ఉండగా, ఎస్సీలు 5,30,471, ఓసీలు 3,55,695, మైనార్టీలు 3,25,575 ఉన్నారు. బీసీ జనాభా తర్వాత అత్యధికంగా ఎస్టీలే ఉన్నారు.
 
భూమి లేని నిరుపేదలు..
జిల్లాలో మొత్తం 8,16,482 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో 5,13,520 కుటుంబాలకు సొంత భూమి లేదని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. 3,02,962 కుటుంబాలకు సొంత భూమి ఉన్నట్లు నిరూపన అయ్యింది. ఇందులో 81,976 కుటుంబాలకు ఎకరంలోపు భూమి ఉండగా, 48,442 కుటుంబాలకు రెండెకరాలలోపు సాగు భూమి ఉంది. 48,517 కుటుంబాలకు మూడెకరాలలోపు, 35,432 కుటుంబాలకు నాలుగెకరాలలోపు, 33,672 కుటుంబాలకు ఐదెకరాలలోపు సాగు భూమి ఉంది. ఐదుకంటే ఎక్కువగా 95,797 కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో తేలింది.
 
రాష్ట్రంలో నాలుగోస్థానం..

జిల్లాలో 5,17,152 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోంది. స్వచ్ఛభారత్ అంటూ దేశమంత నాయకులు చేస్తున్న హడావుడి అంతాఇంతాకాదు. ప్రతి వ్యక్తి స్వచ్ఛభారత్‌లో పాల్గొనాలంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ.. జిల్లాలో ఎందరికి మరుగుదొడ్లు ఉన్నాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని కుటుంబాల్లో జిల్లా నాలుగోస్థానంలో నిలిచింది.
 
ఉద్యోగులు..

జిల్లాలో మొత్తం ఉద్యోగులు 1,02,773 ఉన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 28,018 ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8976  మంది ఉన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులు 18,744 ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు 21,692 ఉండగా, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 25,343 మంది ఉన్నారు.
 
తాగునీటి సదుపాయం..
జిల్లాలో అత్యధిక జనాభా ప్రభుత్వ నల్లాలు కలిగిన వారే ఉన్నారు. 2,64,179 మందికి ప్రభుత్వ నల్లాలు ఉండగా, 2,05,164 కుటుంబాలు చేతిపంపుల ద్వారా తాగునీటి పొందుతున్నారు. బోరుబావి ద్వారా 61,486 మంది, 62,306 కుటుంబాలు బోరు మోటర్ల ద్వారా తాగునీటిని తెచ్చుకుంటున్నారు. సొంత బోరు కలిగిన వారు 46,285 మంది ఉన్నారు. 1,23,083 కుటుంబాలకు పంచాయతీ నల్ల కనెక్షన్‌లు ఉన్నాయి. 8,941 కుటుంబాలు తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు.
 
ద్విచక్ర వాహనాల జోరు..

జిల్లాలో ఎక్కువగా 1,27,577 కుటుంబాలకు ద్విచక్ర వాహనాలు ఉండగా, 9,899 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. 8,195 కుటుంబాలకు మూడు చక్రాల వాహనాలు ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. 4,741 కుటుంబాలకు ట్రాక్టర్లు, ఇతర  భారీ వాహనాలు ఉన్నాయి. జిల్లాలో 945 కుటుంబాలకు ఏసీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement