
పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ప్రజలందరికీ గృహ వసతి, తాగునీటి వసతి కల్పించడానికి సరిపడా నిధుల్లేక రాష్ట్రాలు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే సైకిల్ ట్రాక్‌లంటూ కొందరు పగటి కలలు కంటున్నారంటూ సుప్రీంకోర్టు మండిపడింది. దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకాల ధర్మాసనం పిల్‌పై విచారణ చేపట్టింది. ‘మురికి వాడలకు వెళ్లండి అక్కడ జనం ఏ పరిస్థితిలో ఉంటున్నారో చూడండి. వారికి సరైన గృహ వసతి కల్పించేందుకు రాష్ట్రాల వద్ద నిధుల్లేవు. ప్రజలకు కనీసం వసతులు కల్పించాలి.
మనమేమో ఇక్కడ సైకిల్ ట్రాక్‌లు ఉండాల్సిందేనంటూ పగటి కలలు కంటున్నాం’అని వ్యాఖ్యానించింది. ‘మనవి తప్పుడు ప్రాధాన్యతలు. మన ప్రాధాన్యతలను సరి చేసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అమలు విషయం మనం ఆలోచించాలి. ప్రజలకు తాగేందుకు మంచి నీరు లేదు. ప్రభుత్వ బడులు మూతబడుతున్నాయి. మీరేమో సైకిల్ ట్రాక్‌లు కావాలంటున్నారు’అని పేర్కొంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సైకిల్ ట్రాక్‌లున్నాయని, దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలంటూ సైక్లింగ్ ప్రోత్సాహకుడు దేవీందర్ సింగ్ నేగి తన పిటిషన్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment