cycle tracks
-
ఔటర్ చుట్టూ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌లు
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ విస్తరిస్తున్న పట్టణాలు, జనాభా అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగా సోలార్ రూఫ్‌టాప్‌తో కూడిన సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 4.5 మీటర్ల వెడల్పుతో చేపడుతున్న 23 కి.మీ ట్రాక్ సోలార్ రూఫ్‌తో ఏర్పాటవుతోందని కేటీఆర్ వివరించారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని చెప్పారు. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) వరకు 8.5 కి.మీ., నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కి.మీ మేర నిర్మించతలపెట్టిన సైకిల్ ట్రాక్‌కు మంగళవారం కోకాపేట్ వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మరిన్ని సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ అనంతరం ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిందని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకొనేందుకు సైకిల్ ట్రాక్‌లు దోహదం చేస్తాయన్నారు. సైకిళ్ల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. దక్షిణ కొరియా, దుబాయ్‌లలో ఉన్న సైకిల్ ట్రాక్‌లను అధ్యయనం చేసి దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు కూడా ఈ ట్రాక్‌లు అనుకూలంగా ఉంటాయన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాక్ మార్గంలో భద్రత కోసం బ్యారియర్స్ ఉంటాయని, ఆహ్లాదాన్ని పంచే గ్రీన్ స్పేస్ ఉంటుందని మంత్రి వివరించారు. అలాగే ఫుడ్ కియోస్క్‌లు, పార్కింగ్ స్థలాలు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, రెంటల్ సైకిల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే మార్చి నాటికి తొలిదశ ట్రాక్ అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో దశలో గండిపేట చుట్టూ 46 కి.మీ. మార్గంలో పీపీపీ మోడల్లో సైకిల్ ట్రాక్‌లు, రిసార్ట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. అనంతగిరిలో వెల్నెస్ సెంటర్లు.. వికారాబాద్, అనంతగిరి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా అనంతగిరిలో 275 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెల్నెస్ సెంటర్లను, వెల్బీయింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. నగరవాసులు ఒకట్రెండు రోజులపాటు అనంతగిరిలో విశ్రాంతి తీసుకొనేలా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
Telangana: సైకిల్ సవారీకి సై
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ ప్రజలకు సైకిల్ అలవాటు చేసేందుకు ప్రస్తుతం జోన్‌కు రెండు మూడు సైకిల్‌ట్రాక్‌ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. క్రమేపీ ప్రజలకు అలవాటయ్యాక నగరవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. సైకిల్ వినియోగంతో ఆరోగ్యానికి మంచి వ్యాయామంతో పాటు పర్యావరణ హితం, ఇంధన వినియోగం తగ్గడం, ఇతర వాహనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యం తగ్గడం వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సైకిళ్లకు అలవాటు పడేందుకు ప్రస్తుతానికి జోన్‌కు రెండుమూడు సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జోన్లో ఒక్కో డిజైన్‌తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పరిశీలించాక అన్ని విధాలా యోగ్యమైన డిజైన్‌తో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఎంపిక చేసే డిజైన్లతో తాత్కాలిక, శాశ్వత రెండు రకాలైన సైకిల్ట్రాక్స్ను ఏర్పాటు చేసే యోచనలోనూ అధికారులున్నారు. రోడ్లు 3 లేన్లు, అంతకంటే ఎక్కువ ఉన్న మార్గాల్లో శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా మోడల్ కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రాంతాల్లోనూ శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ లేన్లున్న మార్గాల్లో మాత్రం తాత్కాలిక సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. వీటిని ఉదయం వేళల్లో దాదాపు రెండుగంటలు మాత్రం సైకిల్ ట్రాక్స్‌గా కేవలం సైకిళ్లను మాత్రమే వినియోగిస్తారు. ఆ సమయాల్లో మిగతా వాహనాలు ఆ ట్రాక్‌లోకి రాకుండా బొలార్డ్స్ వంటివి ఉంచుతారు. మిగతా సమయాల్లో వాటిని తొలగించడం వల్ల అన్ని వాహనాలు ప్రయాణిస్తాయి. ఇక తాత్కాలిక, శాశ్వత సైకిల్ట్రాక్స్ రెండింటిలోనూ విపరీతమైన వాహన రద్దీ ఉండే సమయాల్లో ఆ ట్రాక్స్‌లో మోటార్‌బైక్స్ ప్రయాణానికి అనుమతించే యోచన ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు.. టోలిచౌకి–షేపేట, బయోడైవర్సిటీ జంక్షన్–లెదర్‌పార్క్, ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ, బయోడైవర్సిటీపార్క్– ఐకియా, గచ్చిబౌల జంక్షన్–బయోడైవర్సిటీ, మెహిదీపట్నం–గచ్చిబౌలి, నర్సాపూర్రోడ్ తదితర మార్గాల్లోని సైకిల్ ట్రాక్స్ అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐడీఎల్ లేక్–జేఎన్టీయూ–ఫోరమ్‌మాల్ సర్క్యూట్ ట్యాంక్‌బండ్–పీవీఎన్ఆఆర్ మార్గ్‌రోడ్–ఎన్టీర్ మార్గ్‌రోడ్ సర్క్యూట్గానూ సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో మారి్నంగ్‌వాక్ మాదిరిగా సైకిల్ తొక్కడం అలవాటయ్యేందుకు మాత్రమే నిరీ్ణత దూరాల వరకు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు బాగా అలవాటుపడ్డాక ఎక్కువ దూరాలు వెళ్లేందుకు సైకిల్ ట్రాక్స్‌తో పాటు సైకిళ్లు అద్దెలకిచ్చేందుకు షేరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు. (చదవండి: ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్) -
గుర్గావ్లో త్వరలో సైకిల్‌ట్రాక్‌లు
కన్సల్టెంట్‌ను నియమించిన ఎంసీజీ * రెండు విడతలుగా పనులు * ట్రాక్‌ల వెంట పార్కింగ్ వసతి * టెండర్లు పిలవనున్న కార్పొరేషన్ * 26 వారాల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం గుర్గావ్ : నగరంలో త్వరలో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం గుర్గావ్ నగరపాలక సంస్థ (ఎంసీజీ) ఓ కన్సల్టెంట్‌ను నియమించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. తాము నియమించే కన్సల్టెంట్ ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టును సమర్పిస్తారని అన్నారు. ఈ ట్రాక్‌లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి త్వరలో అధ్యయనం చేయిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1.05 కోట్ల మేర నిధులను వెచ్చిస్తామన్నారు. రెండు విడతలుగా పనులను పూర్తిచేస్తామన్నారు. రెండో విడతలో భాగంగా ఈ ట్రాక్‌ల వెంట సైక్లిస్టుల కోసం పార్కింగ్ వసతి కల్పిస్తామన్నారు. కొత్త నగరంతోపాటు పాతనగరంలోనూ ట్రాక్‌లను నిర్మిస్తామన్నారు. త్వరలోనే టెండర్లను పిలుస్తామని, పనుల పూర్తికి 26 వారాల గడువు విధిస్తామని అన్నారు. ఇదిలాఉంచితే ఓల్డ్ ఢిల్లీ-గుర్గావ్ రోడ్డు, మెహ్రౌలి రోడ్డులలో ఈ ట్రాక్‌లను నిర్మించాలని ఎంసీజీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది. అయితే పట్టణ స్థానిక సంస్థ ల విభాగం కార్యదర్శి రఘువేందర్‌రావు ఈ ప్రణాళికను రద్దు చేశారు. సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజా ప్రణాళికతో ఎంసీజీ ముందుకెళుతోంది. కాగా ఈ నగరానికి ఎన్నో ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నప్పటి కీ సైకిల్ ట్రాక్‌లు మాత్రం లేకపోవడం గమనార్హం. -
నగరంలో సైక్లింగ్ కారిడార్లు
గ్రేటర్ నోయిడా: నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రధాన రోడ్లపై ప్రత్యేక సైక్లింగ్ కారిడార్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గత నెలలో అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు, వివిధ టౌన్షిపుల అథారిటీలు స్పందించాయి. ఇందులో భాగంగా సమారు 15 కిమీటర్ల సైక్లింగ్ కారిడార్‌ను తన టౌన్షిప్లో నిర్మించడానికి యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ అథారిటీ(వైఈఐడీఏ) ముందుకొచ్చింది. ఈ మేరకు డిజైనర్లను ఆహ్వానించింది. 50 కి.మీటర్ల సైకిల్ కారిడార్ నిర్మాణానికి నోయిడా అధికారులు గతవారమే డిజైనర్లను నియమించారు. సైక్లింగ్ ట్రాక్‌లు, స్టాండ్లు, షెల్టర్ ఏర్పాటుపై అవసరమైన ప్రతిపాదనలను (ఆర్ఈపీ) రూపొందించి అందజేయాలని వైఈఐడీఏ బుధవారం కన్సల్టెంట్లలకు సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అర్హతలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేస్తామని చెప్పింది. సైక్లింగ్ ట్రాక్ 20 కి.మీటర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో15 కి.మీటర్ల వైఈఐడీఏలోని ప్రధాన మార్గాల్లో సైక్లింగ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. వైఈఐడీఏ నూతన టౌన్షిప్ 50 చదరపు కిలోమీటర్లు విస్తరించి పట్టణీకరణ చెందింది. ఒకసారి అర్బనైజేషన్ పూర్తి అయితే, అది క్రమంగా 200 చదరపు కిలో మీటర్లు విస్తరిస్తుందని అధికారి తెలిపారు.తొలి దశలో 18-20 సెక్టార్లలోని రోడ్డు మార్గంలోని పాదచారులు, సైక్లిస్టులకు ఇబ్బంది కలగకుండా ఈ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ సైకిల్ ట్రాక్ 2.5 మీటర్ల పొడవు నిర్మస్తారు. దీనివల్ల రోడ్లపై, పాదచారులు, సైకిలిస్టులకు ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని సంబంధిత అధికారులు అన్నారు. రెండో దశలో రోడ్లపై గుర్తించిన ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లను నిర్మిస్తారు. ఇది క్రమంగా అన్నిరోడ్లపై కూడా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈనెల 14వ తేదీన సమావేశమై నిర్ణయిస్తామని చెప్పారు. 20వ తేదీన సాయంత్ర మూడు గంటలకు సాంకేతిక బిడ్లను ప్రారంభిస్తామని, కొన్నిరోజుల్లో ఆర్థిక పరమైన అంశాలను పూర్తిచేస్తామని చెప్పారు.