సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ విస్తరిస్తున్న పట్టణాలు, జనాభా అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగా సోలార్ రూఫ్‌టాప్‌తో కూడిన సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 4.5 మీటర్ల వెడల్పుతో చేపడుతున్న 23 కి.మీ ట్రాక్ సోలార్ రూఫ్‌తో ఏర్పాటవుతోందని కేటీఆర్ వివరించారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని చెప్పారు. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ) వరకు 8.5 కి.మీ., నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కి.మీ మేర నిర్మించతలపెట్టిన సైకిల్ ట్రాక్‌కు మంగళవారం కోకాపేట్ వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మరిన్ని సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ అనంతరం ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిందని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకొనేందుకు సైకిల్ ట్రాక్‌లు దోహదం చేస్తాయన్నారు. సైకిళ్ల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
దక్షిణ కొరియా, దుబాయ్‌లలో ఉన్న సైకిల్ ట్రాక్‌లను అధ్యయనం చేసి దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు కూడా ఈ ట్రాక్‌లు అనుకూలంగా ఉంటాయన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాక్ మార్గంలో భద్రత కోసం బ్యారియర్స్ ఉంటాయని, ఆహ్లాదాన్ని పంచే గ్రీన్ స్పేస్ ఉంటుందని మంత్రి వివరించారు. అలాగే ఫుడ్ కియోస్క్‌లు, పార్కింగ్ స్థలాలు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, రెంటల్ సైకిల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే మార్చి నాటికి తొలిదశ ట్రాక్ అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో దశలో గండిపేట చుట్టూ 46 కి.మీ. మార్గంలో పీపీపీ మోడల్‌లో సైకిల్ ట్రాక్‌లు, రిసార్ట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు.
అనంతగిరిలో వెల్‌నెస్ సెంటర్లు..
వికారాబాద్, అనంతగిరి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా అనంతగిరిలో 275 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెల్‌నెస్ సెంటర్లను, వెల్‌బీయింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. నగరవాసులు ఒకట్రెండు రోజులపాటు అనంతగిరిలో విశ్రాంతి తీసుకొనేలా సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా!
Comments
Please login to add a commentAdd a comment