Solar Roof
-
రూ.2 వేలకోట్ల ఆర్థిక సహాయానికి ఏడీబీ ఆమోదం
సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రానికి 240.5 మిలియన్ డాలర్ల(సుమారు రూ.2 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఏడీబీ ప్రిన్సిపల్ ఎనర్జీ స్పెషలిస్ట్ కౌరు ఒగినో మాట్లాడుతూ..‘ఏడీబీకు చెందిన మల్టీ ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ.. సోలార్ రూఫ్‌టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ 2, 3 దశలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశం 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏడీబీ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రజలను ప్రోత్సహించేలా ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లో ప్రకటించారు. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రాయితీపై రుణాలు పొందే వీలు కల్పిస్తున్నారు. -
సోలార్ సీట్లు.. ఇలా కూడా వినియోగించుకోవచ్చా?
సోలార్ ఉత్పత్తులను తయారు చేసే అమెరికన్ కంపెనీ తాజాగా సోలార్ సీటును మార్కెట్లోకి తెచ్చింది. ఆరుబయట పచ్చిక మీద పరుచుకుని సేదదీరడానికి, ఆరుబయట విందు వినోదాలు చేసుకునేటప్పుడు కుర్చీ మీద అమర్చుకోవడానికి వీలుగా ఈ సోలార్ సీటును రూపొందించింది. చలికాలంలో ఎండ సోకుతున్నా, చలి తీవ్రత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సోలార్ సీటు మీద కూర్చుంటే, దీని వెనుకవైపు ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ సీటు బ్యాటరీకి చేరుతుంది. దీనిని ఆన్ చేసుకుంటే, ఈ సీటు క్షణాల్లోనే వెచ్చబడుతుంది. బయట ఎంత చల్లని వాతావరణం ఉన్నా, కాస్త ఎండసోకే చోటు ఈ సోలార్ సీటును అమర్చుకుని, కూర్చుంటే చాలు.. చలికాలాన్ని వెచ్చగా ఆస్వాదించవచ్చు. దీని ధర 249 డాలర్లు (రూ.20,763) మాత్రమే! -
రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు తెగ డిమాండ్
న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు డిమాండ్ గణనీయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో 5.2 మిలియన్ కిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మొదటి ఆరు నెలల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం పెరగ్గా, 2019 ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని చూసినట్టు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ మార్కెట్ గతేడాది బలమైన పనితీరు చూపించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా ఫోరమ్ సదస్సులో భాగంగా మాథుర్ మాట్లాడారు. ఈ సదస్సును కేంద్ర పునరుత్పాదక ఇంధనం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖల సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి, ఇంధన లభ్యత పెంపొందించడం తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో భాగంగా చర్చలు జరిగాయి. 200 వరకు దేశీ, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ!
దీపావళి.. భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఇది కూడా ఒకటి. దివాళి వచ్చిందంటే సంస్థలు తమ ఉద్యోగులకు బహామతులు ,బోనస్‌లు ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఓ యజమాని మాత్రం జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్‌ని తన ఉద్యోగులకు ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ సూరత్‌లోని శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్టర్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల కంపెనీల్లో ఒకటి. దీని యజమాని గోవింద్ ధోలాకియా. ఆయన గతంలో కార్లు, ఇళ్లు అంటూ తన ఉద్యోగులకు అనేక బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బహామతులను ఇవ్వదలచుకున్నాడు. అయితే అది జీవితాంతం గుర్తుండడంతో పాటు వాళ్లకు ఉపయోగపడేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారి కంపెనీలో పని చేస్తున్న 1000 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను అందించారు. దీని ద్వారా వారికి జీవితకాలం కరెంట్ ఉచితంగా అందించాలనుకున్నాడు. ఇప్పటికే 550 మంది ఉద్యోగులకు ఈ గిఫ్ట్ అందించినట్లు మిగిలిన వాళ్లకి కూడా అతి త్వరలో అందజేయనన్నారు. పర్యావరణానికి కూడా ఇది బోనస్! ధోలికియా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం వల్ల కేవలం ఉద్యోగులు లాభపడటమే కాక.. పర్యావరణానికి సైతం మేలు జరగుతంది. ఇంతకు ముందు కూడా SRK నాలెడ్జ్ ఫౌండేషన్ ద్వారా SRK ఎక్స్‌పోర్టర్ సాంఘిక సంక్షేమ విభాగం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ! -
దేశంలో తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. మోదీ ప్రకటన
గాంధీనగర్: దేశంలోనే తొలి 24×7 సోలార్ విద్యుత్ గ్రామంగా గుజరాత్, మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొధేరాలో నిర్వహించిన బహిరంగ సభ వేదికా ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసునని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సౌర విద్యుత్తు గ్రామంగా గుర్తిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ‘సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని మరింత పోత్సహించడం ద్వారా ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మారడమే లక్ష్యంగా పనిచేయాలి. మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో అవస్థలు పడ్డారు. మహిళలు నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. కానీ ఇప్పటితరానికి ఆ బాధల్లేవు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, అనుసంధానతను పెంచడం వంటివి అందిస్తోంది.’ అని తెలిపారు మోదీ. గతంలో కరెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల చదువు, ఇంటి పనులకు ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు సౌర విద్యుత్ న్యూ ఇండియాను మరింత సాధికారత కల్పించేలా లక్ష్యాన్ని అధిగమించేలా చేస్తోందన్నారు. ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్ కార్లు, మెట్రోకోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરનું પરિસર 3D પ્રોજેક્શન મેપિંગ તથા હેરિટેજ લાઇટિંગ્સથી ઝળહળી ઉઠશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.9 ઓક્ટોબરના રોજ કરશે આ સૌર ઊર્જા સંચાલિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદઘાટન અને સાથે જ ઉજાગર થશે મોઢેરાનો ગૌરવવંતો ઇતિહાસ.#SuryaGramModhera pic.twitter.com/zsop1XqOiT — CMO Gujarat (@CMOGuj) October 8, 2022 ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా -
ఔటర్ చుట్టూ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌లు
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ విస్తరిస్తున్న పట్టణాలు, జనాభా అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగా సోలార్ రూఫ్‌టాప్‌తో కూడిన సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 4.5 మీటర్ల వెడల్పుతో చేపడుతున్న 23 కి.మీ ట్రాక్ సోలార్ రూఫ్‌తో ఏర్పాటవుతోందని కేటీఆర్ వివరించారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని చెప్పారు. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) వరకు 8.5 కి.మీ., నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కి.మీ మేర నిర్మించతలపెట్టిన సైకిల్ ట్రాక్‌కు మంగళవారం కోకాపేట్ వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మరిన్ని సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ అనంతరం ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిందని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకొనేందుకు సైకిల్ ట్రాక్‌లు దోహదం చేస్తాయన్నారు. సైకిళ్ల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. దక్షిణ కొరియా, దుబాయ్‌లలో ఉన్న సైకిల్ ట్రాక్‌లను అధ్యయనం చేసి దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు కూడా ఈ ట్రాక్‌లు అనుకూలంగా ఉంటాయన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాక్ మార్గంలో భద్రత కోసం బ్యారియర్స్ ఉంటాయని, ఆహ్లాదాన్ని పంచే గ్రీన్ స్పేస్ ఉంటుందని మంత్రి వివరించారు. అలాగే ఫుడ్ కియోస్క్‌లు, పార్కింగ్ స్థలాలు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, రెంటల్ సైకిల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే మార్చి నాటికి తొలిదశ ట్రాక్ అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో దశలో గండిపేట చుట్టూ 46 కి.మీ. మార్గంలో పీపీపీ మోడల్లో సైకిల్ ట్రాక్‌లు, రిసార్ట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. అనంతగిరిలో వెల్నెస్ సెంటర్లు.. వికారాబాద్, అనంతగిరి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా అనంతగిరిలో 275 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెల్నెస్ సెంటర్లను, వెల్బీయింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. నగరవాసులు ఒకట్రెండు రోజులపాటు అనంతగిరిలో విశ్రాంతి తీసుకొనేలా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
సౌరశక్తి ఉత్పాదనలో మెట్రో రైల్ సూపర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సౌరశక్తి ఉత్పాదనలో ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు బాటలు వేస్తోంది. కర్భన ఉద్గారాలను తగ్గించే కృషిలో ముందుంటోంది. ప్రస్తుతం 28 మెట్రో స్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్ డిపోల్లోని ఖాళీ ప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండడం విశేషం. మెట్రో స్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి.. ► సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినపుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుండడం విశేషం. సౌరశక్తి, రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రో స్టేషన్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందాయి. ► లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ప్లాటినం సర్టిఫికెట్‌ను కూడా మెట్రో సాధించింది. మెట్రో స్టేషన్లలో 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం,క్రాస్ వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్ డిపోల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడు గుంతలను నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. పలు అవార్డుల పంట.. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం కారణంగా నగర మెట్రోకు పలు అవార్డులు వరించాయి. గతేడాది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ అవార్డ్(2021) దక్కింది. ఇక తాజాగా ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ మెట్రో సిస్టం బై రైల్ అనాలిసిస్ ఇండియా(2022) అవార్డు వరించింది. (క్లిక్: ఇక వీకెండ్ షీ టీమ్స్.. ఈ ప్రాంతాల్లో ఫోకస్) మూడు లక్షల మార్కును దాటిన ప్రయాణికుల సంఖ్య.. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో నిత్యం మూడు లక్షల మంది జర్నీ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. మే నెలలో అధిక ఎండల కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో జర్నీకి మొగ్గు చూపడం విశేషం. -
Photo Feature: వ్యాక్సిన్ వేసుకోండి.. లాటరీ గెలవండి!
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా వేసుకునేందుకు ప్రజలను పోత్సహించేందుకు అమెరికాలోని లూసియానా రాష్ట్ర రాజధాని బాటన్ రో సిటీలో లాటరీ ద్వారా నగదు, స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలో రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు వేటకు రెడీ అయ్యారు. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
మీరూ కరెంట్ అమ్మొచ్చు!
విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన ఎ.సత్యగంగాధర్ ఇంటికి నెలకు రూ.1,200 కరెంటు బిల్లు వచ్చేది. దీంతో ఇటీవల తన ఇంటికి సోలార్ రూఫ్ టాప్ యూనిట్‌ను అమర్చుకున్నారు. ఇప్పుడు ఆయన తన అవసరాలకు వాడుకోగా మిగులు విద్యుత్‌ను డిస్కంకు ఇస్తున్నారు. ఇలా ఆయన నెలకు 100–150 యూనిట్ల మేర విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా రూ.600 నుంచి రూ.1000 వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఇన్నాళ్లూ వాడుకున్న కరెంటుకు బిల్లులు చెల్లించడమే వినియోగదారుడికి తెలుసు. కానీ, కొద్ది రోజులుగా వినియోగదారుడే కరెంట్‌ను విద్యుత్ సంస్థలకు విక్రయించే పరిస్థితి వచ్చింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘సూర్యశక్తి’ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్), నెడ్‌క్యాప్‌లు ఈ వెసులుబాటు కల్పించాయి. పర్యావరణహిత సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వినియోగదారుల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను రాయితీపై ఏర్పాటు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఈ సంస్థలు మూడు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం 648 మంది గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 631 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 444 గృహాలకు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చారు. మరో 138 కనెక్షన్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తం 444 కనెక్షన్లలో 147 సూర్యశక్తి పథకం కింద మంజూరయ్యాయి. విద్యుత్ విక్రయం ఇలా.. సోలార్ రూఫ్ టాప్ వినియోగదారులు ఉత్పత్తయిన సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు తిరిగి అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇలా ఒక్కో సోలార్ విద్యుత్ యూనిట్‌కు రూ.5.58 చొప్పున వినియోగదారుడికి చెల్లిస్తుంది. యూనిట్ల నమోదుకు వీలుగా నెట్ మీటర్లు అమర్చారు. కాగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల నుంచి 134.5 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో నెలకు 64,500 యూనిట్ల సోలార్ విద్యుత్‌ను విక్రయిస్తున్నారు. యూనిట్‌కు రూ.5.58 చొప్పున పవర్ గ్రిడ్ వీరి నుంచి కొనుగోలు చేస్తోంది. ఇలా ఏడాదికి విద్యుత్ అమ్మకం ద్వారా వీరు రూ.43 లక్షలు ఆర్జిస్తున్నారు. మరోవైపు.. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూలు, కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. ‘సూర్యశక్తి’ ఇలా.. - రూఫ్‌పై 100 (10 గీ 10) చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. - మీటర్ తమ పేరుపై ఉన్న వారెవరైనా నెడ్‌క్యాప్, ఏపీఎస్పీడీసీఎల్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్యానెల్స్ నిర్వహణకు ప్రత్యేక సంస్థలున్నాయి. సర్వీస్ కోసం తక్కువ ఖర్చుతో సేవలందుతాయి. - ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నప్పుడు, వర్షం కురిసేటప్పుడు విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. మిగతా సమయాల్లో నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. - ఈ పథకం కింద ఒక కిలోవాట్ సామర్థ్యం ఉన్న యూనిట్ అమరుస్తారు. - యూనిట్ ఏర్పాటు చేసేందుకు రూ.60 వేలు ఖర్చవుతుంది. అయితే ఇందులో రూ.50 వేలు రాయితీ ఉంటుంది. వినియోగదారుడు భరించాల్సింది కేవలం రూ.10 వేలు మాత్రమే. విజయవాడలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ -
175 గిగావాట్ల లక్ష్యానికి రూఫ్‌టాప్ సోలార్!!
న్యూఢిల్లీ: భారత్ 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకునేందుకు రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను (భవనాల పైకప్పులపైన ఏర్పాటు చేసే ప్లాంట్లు) యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇనిస్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనలైసిస్ (ఐఈఈఎఫ్ఏ) పేర్కొంది. 2022 నాటికి సోలార్ రూపంలో 100 గిగావాట్లు, పవన విద్యుత్ విభాగంలో 60 గిగావాట్లు, బయోపవర్ 10 గిగావాట్లు, చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 5 గిగావాట్ల చొప్పున మొత్తం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం విధించుకున్న విషయం గమనార్హం. 100 గిగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 40 గిగావాట్ల మేర సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల రూపంలో ఏర్పాటు కావాల్సి ఉంది. ‘‘రూఫ్‌టాప్ సోలార్ భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన ఉప విభాగం. కానీ, భారత్ 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ ప్రాజెక్టుల ఏర్పాటును చాలా వేగవంతం చేయాలి’’ అని ఐఈఈఎఫ్ఏ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో 28 గిగావాట్ల సో లార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఉందని, కేవలం మూడేళ్లలోనే నాలుగు రెట్లు పెరిగినట్టు ఐఈఈఎఫ్ఏ ఎనర్జీ అనలిస్ట్ విభూతి గార్గ్ తెలిపారు. ఆయన ఈ నివేదికకు సహ రచయితగా పనిచేశారు. ‘‘అయితే, భారత్ ఇంత బలమైన వృద్ధి సాధించినప్పటికీ 40 గిగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ లక్ష్యంలో ఇప్పటికీ కేవలం 10 శాతాన్నే చేరుకుంది. ప్రభుత్వ అంచనాల కంటే ఇది చాలా తక్కువ. 2022కి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నూతన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయాల్సి ఉంది’’ అని గార్గ్ తెలిపారు. ప్రభుత్వ సహకారం అవసరం వచ్చే మూడేళ్ల పాటు సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ఏర్పాటు వార్షికంగా 50 శాతం చొప్పున ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని ఐఈఈఎఫ్ఏ నివేదిక అంచనా వేసింది. ‘‘విధానాల్లో స్పష్టత, ఆర్థిక సహకారం, వినియోగదారుల్లో అవగాహన పెంచడం వంటివి సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయగలవు’’ అని ఈ నివేదిక సూచించింది. పవన విద్యుత్‌కు సుస్థిర విధానాలు కావాలి టర్బైన్ తయారీదారుల సంఘం సూచన న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించాలంటే భాగస్వాములు అందరి మధ్య మెరుగైన సహకారం, విధానాల్లో స్థిరత్వం అవసరమని భారత పవన విద్యుత్ తయారీదారుల సంఘం (ఐడబ్ల్యూటీఎంఏ) కేంద్రానికి సూచించింది. ‘‘పవన విద్యుత్ రంగం ఈ రోజు ఎంతో ఒత్తిడిలో ఉంది. ఫీడ్ ఇన్ టారిఫ్ (ఫిట్) నుంచి పోటీ ఆదారిత బిడ్డింగ్ విధానానికి మళ్లడం వల్ల సమస్యలను ఎదుర్కొంటోంది. కేవలం టారిప్ తగ్గించడంపైనే దృష్టి సారించడం వల్ల పరిశ్రమలో వృద్ధి నిదానించింది. 2018–19లో కేవలం 1,523 మెగావాట్ల మేరే కొత్త సామర్థ్యమే జతకూరింది’’ అని ఐడబ్ల్యూటీఎంఏ చైర్మన్ తులసి తంతి పేర్కొన్నారు. సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహించిన మేథోమధన సదస్సుకు హాజరైన సందర్భంగా కేంద్రానికి అసోసియేషన్ పలు సిఫారసులు చేసింది. పవన విద్యుత్‌కు టారిఫ్‌ను జాతీయ టారిఫ్ విధానం మాదిరే నిర్ణయించాలని, 25 మెగావాట్లలోపు ప్రాజెక్టులకు ఫిట్ టారిఫ్‌ను వర్తింపజేయాలని తదితర సిఫారసులను చేసింది. -
సూర్యభగవానుడి పెంకుటిల్లు
ఫొటో చూడగానే... ‘వావ్ ఏముందీ ఇందులో’ అనిపిస్తుంది కదా! నిజమేగానీ... దీని అందచందాల గురించి కాసేపు పక్కనపెట్టి పైకప్పు పెంకుల్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. అంతా మామూలుగానైతే లేదు. ఎందుకంటే ఆ పెంకులు... సోలార్‌ప్యానెల్స్ కూడా. ఇంటికి కావాల్సిన విద్యుత్తు మొత్తాన్ని అక్కడే ఉత్పత్తి చేసి అందిస్తాయి ఈ పెంకులు. ఇలాంటివి ఇప్పటికే చాలా వచ్చాయి కదా.. కొత్తేమిటి? అంటే రెండో ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఈయన పేరు ఎలన్ మస్క్! స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈవో. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు రాకెట్లు తయారు చేయడమే కాకుండా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేస్తున్న టెకీ! ఒక్కమాటలో చెప్పాలంటే... హాలీవుడ్ సినిమా హీరో ఐరన్ మ్యాన్ వాస్తవ అవతారమీయన. ప్రపంచాన్ని పర్యావరణ కాలుష్యం బారినుంచి కాపాడేందుకు ఈయన తనదైన సై్టల్లో పనిచేస్తూంటాడు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించినా, గిగావాట్లకు గిగావాట్ల సౌర విద్యుత్తును బ్యాటరీల్లోకి నింపగలిగినా, ఇంకో ఇరవై ఏళ్లలో మనిషిని అంగారకుడిపైకి పంపేస్తానని ధీమా వ్యక్తం చేసినా మస్క్‌కే చెల్లింది. ఇలాంటి టెక్ మేధావి తాజా ఆవిష్కరణ ఈ సోలార్‌ప్యానెల్ టైల్స్! సాధారణ టైల్స్‌కు రెట్టింపు దృఢంగా ఉండే ఈ ప్యానెల్స్ పూర్తిగా గాజులాంటి పదార్థంతో తయారవుతాయి. లోపలిభాగంలో సోలార్ సెల్స్‌తో కూడిన ప్యానెల్, ఒకదానితో ఇంకోదాన్ని అనుసంధానించేందుకు అవసరమైన వైరింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. టెర్రాకోట స్టైల్లోనే కాకుండా పూర్తి నలుపు రంగులో, లేదంటే తాండూరు బండల డిజైన్లోనూ ఈ టైల్స్‌ను అందుబాటులోకి తెచ్చాడు మస్క్. ఈ టైల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును టెస్లా కంపెనీ తయారు చేస్తున్న పవర్వాల్ – 2 బ్యాటరీలో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఒక్కో బ్యాటరీలో 15 కిలోవాట్/గంటల విద్యుత్తును స్టోర్ చేసుకోవచ్చు. ఏకకాలంలో 5 కిలోవాట్లు, అత్యవసర సమయాల్లో ఏడు కిలోవాట్ల విద్యుత్తును వాడుకోవచ్చు. అంతాబాగానే ఉందిగానీ... వీటి ఖరీదెక్కువేమో అన్న అనుమానమూ అక్కరలేదంటున్నాడు మస్క్. సాధారణ టైల్స్ కంటే తక్కువ ధరకు వీటిని త్వరలోనే అందిస్తానని ఇటీవలే ప్రకటించాడు! -
సీసీసీకి జంట టవర్లు
సాక్షి, హైదరాబాద్: పక్కపక్కనే రెండు టవర్లు.. అంతా అద్దాలతో, మెరిసిపోయే డిజైన్‌తో ఒకదానిలో 16, మరోదానిలో 14 అంతస్తులు.. రెండు టవర్ల మధ్య హైలెవల్ వంతెన.. టవర్లపై హెలిప్యాడ్, సోలార్ రూఫ్... ఏమిటిదని అనుకుంటున్నారా, హైదరాబాద్‌లో నిర్మించనున్న అత్యాధునిక ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)’ కార్యాలయ భవనం నమూనా. సీసీసీ భవన నమూనా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్కిటెక్ట్‌ల నుంచి డిజైన్లను ఆహ్వానించగా... 15 కంపెనీలు డిజైన్లు ఇచ్చాయి. వాటిని శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలసి పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ డిజైన్, హంగులు ఉన్న ఒక నమూనాను ఖరారు చేశారు. శనివారం సీఎం కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సిటీ పోలీసు కమిషనరేట్‌కు ఇచ్చిన 8 ఎకరాల స్థలంలో సీసీసీ జంట భవంతులను నిర్మించనున్నారు. వీటిపై సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేసి విద్యుతోత్పత్తి చేస్తారు. సందర్శకుల కోసం కింది భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది. నాలుగో అంతస్తులో సీసీసీ ప్రధాన హాలు ఉంటుంది. దాదాపు వెయ్యి మంది సామర్థ్యంతో ఆడిటోరియం, భవనం చుట్టూ ల్యాండ్ స్కేప్, నీటి ఫౌంటెయిన్లను ఏర్పాటు చేస్తారు. భవనంలో ఇంకా ఏమేం ఉండాలో నిర్ణయించి, తుది మెరుగులు దిద్దాలని సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డిలతో కూడిన బృందానికి సీఎం సూచించారు. డిజైన్‌కు తుది రూపమిచ్చి, టెండర్లు పిలిచి నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉండే లక్ష సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానమై ఉంటాయని, జిల్లాల్లోని పోలీసు ప్రధాన కార్యాలయాలను కూడా సీసీసీకి అనుసంధానం చేయాలని సూచించారు. పుష్కరాలు, జాతరలు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమయంలో పోలీసులే కాక ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సీసీసీ నుంచి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలీసులు వీధుల్లో ఎక్కువగా తిరగకుండానే.. అణువణువునా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపయోగించే పద్ధతులను అధ్యయనం చేసి హైదరాబాద్‌లో సీసీసీ భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అవసరాలకు తగ్గట్లుగా, స్మార్ట్ పోలీసింగ్‌కు సీసీసీ దోహదపడుతుందని చెప్పారు.