![Rooftop Solar for 175 Gigawatta target - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/8/Untitled-11.jpg.webp?itok=I1-XvARy)
న్యూఢిల్లీ: భారత్ 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకునేందుకు రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను (భవనాల పైకప్పులపైన ఏర్పాటు చేసే ప్లాంట్లు) యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇనిస్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనలైసిస్ (ఐఈఈఎఫ్‌ఏ) పేర్కొంది. 2022 నాటికి సోలార్ రూపంలో 100 గిగావాట్లు, పవన విద్యుత్ విభాగంలో 60 గిగావాట్లు, బయోపవర్ 10 గిగావాట్లు, చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 5 గిగావాట్ల చొప్పున మొత్తం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం విధించుకున్న విషయం గమనార్హం. 100 గిగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 40 గిగావాట్ల మేర సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల రూపంలో ఏర్పాటు కావాల్సి ఉంది. ‘‘రూఫ్‌టాప్ సోలార్ భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన ఉప విభాగం. కానీ, భారత్ 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ ప్రాజెక్టుల ఏర్పాటును చాలా వేగవంతం చేయాలి’’ అని ఐఈఈఎఫ్‌ఏ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో 28 గిగావాట్ల సో లార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఉందని, కేవలం మూడేళ్లలోనే నాలుగు రెట్లు పెరిగినట్టు ఐఈఈఎఫ్‌ఏ ఎనర్జీ అనలిస్ట్ విభూతి గార్గ్ తెలిపారు. ఆయన ఈ నివేదికకు సహ రచయితగా పనిచేశారు. ‘‘అయితే, భారత్ ఇంత బలమైన వృద్ధి సాధించినప్పటికీ 40 గిగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ లక్ష్యంలో ఇప్పటికీ కేవలం 10 శాతాన్నే చేరుకుంది. ప్రభుత్వ అంచనాల కంటే ఇది చాలా తక్కువ. 2022కి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నూతన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయాల్సి ఉంది’’ అని గార్గ్ తెలిపారు.
ప్రభుత్వ సహకారం అవసరం
వచ్చే మూడేళ్ల పాటు సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ఏర్పాటు వార్షికంగా 50 శాతం చొప్పున ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని ఐఈఈఎఫ్‌ఏ నివేదిక అంచనా వేసింది. ‘‘విధానాల్లో స్పష్టత, ఆర్థిక సహకారం, వినియోగదారుల్లో అవగాహన పెంచడం వంటివి సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయగలవు’’ అని ఈ నివేదిక సూచించింది.
పవన విద్యుత్‌కు సుస్థిర విధానాలు కావాలి
టర్బైన్ తయారీదారుల సంఘం సూచన
న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించాలంటే భాగస్వాములు అందరి మధ్య మెరుగైన సహకారం, విధానాల్లో స్థిరత్వం అవసరమని భారత పవన విద్యుత్ తయారీదారుల సంఘం (ఐడబ్ల్యూటీఎంఏ) కేంద్రానికి సూచించింది. ‘‘పవన విద్యుత్ రంగం ఈ రోజు ఎంతో ఒత్తిడిలో ఉంది. ఫీడ్ ఇన్ టారిఫ్ (ఫిట్) నుంచి పోటీ ఆదారిత బిడ్డింగ్ విధానానికి మళ్లడం వల్ల సమస్యలను ఎదుర్కొంటోంది. కేవలం టారిప్ తగ్గించడంపైనే దృష్టి సారించడం వల్ల పరిశ్రమలో వృద్ధి నిదానించింది. 2018–19లో కేవలం 1,523 మెగావాట్ల మేరే కొత్త సామర్థ్యమే జతకూరింది’’ అని ఐడబ్ల్యూటీఎంఏ చైర్మన్ తులసి తంతి పేర్కొన్నారు. సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహించిన మేథోమధన సదస్సుకు హాజరైన సందర్భంగా కేంద్రానికి అసోసియేషన్ పలు సిఫారసులు చేసింది. పవన విద్యుత్‌కు టారిఫ్‌ను జాతీయ టారిఫ్ విధానం మాదిరే నిర్ణయించాలని, 25 మెగావాట్లలోపు ప్రాజెక్టులకు ఫిట్ టారిఫ్‌ను వర్తింపజేయాలని తదితర సిఫారసులను చేసింది.
Comments
Please login to add a commentAdd a comment