ఉగాది వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం | Ugadi Festival Celebrations In CM YS Jagan House Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉగాది వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం

Published Wed, Mar 22 2023 4:43 AM | Last Updated on Wed, Mar 22 2023 4:43 AM

Ugadi Festival Celebrations In CM YS Jagan House Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, కార్యక్రమాల నిర్వాహకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. సీఎం జగన్‌ నివాసంలోని గోశాలలో ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.

ఆయన మంగళవారం తాడేపల్లిలో ఈ వివరాలు తెలిపారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఉన్నాయన్నారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొంటారని తెలిపారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాల ప్రకారమే ఈ ఉగాది సంబరాలు ఉంటాయన్నారు.

ఇక్కడ పూర్తిగా పల్లె వాతావరణం కన్పిస్తుందన్నారు. ప్రారంభంలో గ్రామ ముఖద్వారం ఉంటుందని చెప్పారు. సీఎం జగన్‌ దంపతులు విఘ్నేశ్వర ఆలయంలో పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఆనందనిలయం నమూనా ప్రాంగణంలోకి చేరుకుంటారని చెప్పారు.

అక్కడ స్వామికి  సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు.. శోభకృత్‌ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలుకలగాలని, సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతీసంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారని వివరించారు.

అనంతరం పంచాంగ శ్రవణం ప్రారంభమవుతుందన్నారు. చిరుధాన్యాలతో నవరత్నాల పథకాలు ప్రతిబింబించేలా నేలపై ఒక బొమ్మను ఏర్పాటు చేశామన్నారు. నవరత్నాల మధ్యలో రంగులతో వేసిన సీఎం జగన్‌ ఫొటో ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలు దేనికైనా తిరుమల పంచాంగాన్ని ఫాలో అవుతారని, ఆ ప్రకారమే కార్యక్రమాలు చేస్తారని చెప్పారు.

స్వామి దశావతారాల బొమ్మలు, భూదేవి, శ్రీదేవి బొమ్మలను కూడా మండపంలోని గోడలపై చిత్రీకరించినట్లు తెలిపారు. తిరుమలలో ఉన్నట్లు బంగారు తాపడంతో ఉన్న గంటలు, ధ్వజస్తంభం, కోనేరు కూడా ఇక్కడ చూడవచ్చన్నారు. కొన్ని సంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు, ఉగాది పాటలకు నృత్యాలు ఉంటాయని చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం దంపతులను టీటీడీ వేదపండితులు, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వేదపండితులు ఆశీర్వదిస్తారని తెలిపారు. సీఎం జగన్‌ ప్రధాన లక్ష్యం సామాన్యుడు బాగుండాలనేదేనని చెప్పారు. పేదల బాగుకోసం సీఎం జగన్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.  

సీఎం తన పాలనాకాలంలో ఇప్పటికి బటన్‌ నొక్కి రూ.2 లక్షల కోట్లను నేరుగా పేదల అకౌంట్‌లలోకి వెళ్లేలా చేశారని చెప్పారు. సీఎం ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా, నాడు–నేడు పాఠశాల భవనాల సెట్టింగ్‌లు భారీగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement