పరిశోధనలతో సమాజానికి మేలు | UGC Chairman Mamidala Jagadishkumar with the Sakshi | Sakshi
Sakshi News home page

పరిశోధనలతో సమాజానికి మేలు

Published Sat, Aug 3 2024 5:52 AM | Last Updated on Sat, Aug 3 2024 5:53 AM

UGC Chairman Mamidala Jagadishkumar with the Sakshi

‘సాక్షి’తో యూజీసీ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌  

యువత పరిశోధనా రంగంలోకి రావాలి 

ఎంత ఎక్కువ మంది వస్తే దేశానికి అంత లబ్ధి 

ఉద్యోగం కోసం కాకుండా రీసెర్చిపై ఆసక్తితో రావాలి 

పరిశోధనల్లో నాణ్యత పెరగాలంటే విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి సరిగ్గా ఉండాలి 

బోధనా సిబ్బంది విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి 

కాంట్రాక్టు సిబ్బంది నుంచి ఉత్తమ పరిశోధనలు ఆశించలేం! 

మేము ప్రభుత్వాలు, గవర్నర్లకు లేఖలు రాస్తూనే ఉన్నాం 

పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. యువత పరిశోధన రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువ దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయ పడ్డారు.

 విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయత్నిస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు.
 
ఉద్యోగం కోసం పీహెచ్‌డీ చేయకూడదు 
పరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్‌డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

పీహెచ్‌డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్‌డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్‌) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్‌డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’ అని చెప్పారు. 

న్యాక్‌ గుర్తింపు తీసుకోవాలి 
తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్‌ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్‌ తెలిపారు. న్యాక్‌ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement