
సాక్షి, రాజమహేంద్రవరం: ‘అక్రమంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసిన మార్గదర్శి కేసులో రామోజీరావు రూ.6,000 కోట్లు జరిమానాగా కట్టాలి. రామోజీరావు వసూలు చేసిన డబ్బు కట్టేసి కేసు నుంచి బయటపడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా చూశారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుట్టు చప్పుడు కాకుండా కేసు కొట్టేసింది’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీరావు దిట్ట అనడానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు.
బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసు కొట్టేసిన విషయం తనకు ఏడాది తర్వాత తెలిసిందన్నారు. డబ్బు చెల్లించడంలోనూ రిలయన్స్, కొన్ని సూట్‌కేస్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని ఆరోపించారు. రామోజీరావు కేసులో తాను తాజాగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే అందులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఆర్‌బీఐ, మరో పార్టీ వకాల్తా, కౌంటర్లు వేయలేదని తెలిపారు.
అయినా వాదనలకు తేదీలు అడిగారన్నారు. ఈ కేసుకు తొందరేంటని చీఫ్ జస్టిస్ అనడం దారుణమన్నారు. హఠాత్తుగా 5వ తేదీన వాదనలకు నిర్ణయించారని, మంగళవారం రాత్రి 10వ తేదీకి మారిందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అభిప్రాయాలు చెప్పకుండానే కేసు స్వీకరించేందుకు సిద్ధ పడ్డారంటే రామోజీరావు పలుకుబడిని అర్థం చేసుకోవచ్చన్నారు.
పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ మేరకు పనులు చేపట్టారో సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు బాధ్యుడని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారని, అదే నిజమైతే నష్టానికి బాధ్యులెవరో తేల్చాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment