
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా వాసులు ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా.. రాత్రి కుండపోత వానతో సేదదీరారు.
బుట్టాయగూడెం, ఏలూరు (మెట్రో): పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా.. రాత్రి కుండపోత వానతో సేదదీరారు. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలు ఊరటచెందినా.. మామిడి తదితర పంటలకు భారీ వర్షం నష్టాన్ని మిగిల్చింది. గత నాలుగు రోజులుగా రెండు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోయారు.
ఉదయం 11 గంటలకే గ్రామాలు, పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సాయంత్రం 7 గంటల వరకూ కూడా వేడి గాలులు వీయడంతో ఉక్కబోతతో జనం ఇబ్బందులు పడ్డారు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈదురు గాలులు, వర్షంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. కారుమబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు వాన హోరెత్తింది. వాతావరణం చల్లబడి ప్రజలు సేదతీరారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో కొద్దిపాటి వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది.