సాక్షి, అమరావతి: పిల్లలకు ఆధార్ కార్డులో వేలి ముద్రల అప్‌డేట్‌కు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మూడు వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం ఆధార్ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ఆధార్ నమోదుతో పాటు ఆధార్ వేలి ముద్రల అప్‌డేట్ వంటి సేవలను పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ఆధార్‌లో చిరునామా మార్పు, తప్పులు సరిదిద్దడం వంటి సేవలను నిర్ణీత ఫీజుతో సచివాలయాల్లోనే అందిస్తోంది.
ఇలా సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 5.63 లక్షల మంది ఆధార్ సేవలు పొందారు. పిల్లలకు ఆధార్‌లో వేలి ముద్రలు అప్‌డేట్ చేయడానికి ప్రభుత్వం ప్రతి నెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ నెలలోనూ బుధ, గురువారాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ సాగిలి షాన్‌మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ వివరాల నమోదు సంస్థ యూఐడీఏఐ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 1.09 కోట్ల మందికి ఆధార్‌లో వారి చిన్న వయస్సు నాటి వేలి ముద్రలే నమోదై ఉన్నాయి.
అత్యధిక సంక్షేమ పథకాలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ద్వారానే లబ్ధిదారులకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వయస్సులోనే ఆధార్ కార్డు పొందిన వారు ఆధార్‌లో వేలి ముద్రలను అప్‌డేట్ చేయించుకోవాలి. లేదంటే వేలి ముద్రలు సరిపోలక పథకాలు అందుకొనే అవకాశం కోల్పోతారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం చిన్న వయస్సులో ఆధార్ కార్డు పొంది ఉంటే.. 15 ఏళ్ల తర్వాత వేలిముద్రలను అప్‌డేట్ చేసుకోవాలి. ఐదేళ్ల వయస్సు లోపే ఆధార్ కార్డు పొంది ఉంటే, ఐదేళ్లు దాటిన తర్వాత ఒక విడత, 15 ఏళ్ల తర్వాత మరో విడత వేలి ముద్రలను అప్‌డేట్ చేసుకోవాలి.
15 ఏళ్లు ముగిసిన వెంటనే బడి పిల్లలు ఆధార్ వివరాల్లో వేలి ముద్రలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. స్కూళ్లవారీగా అర్హులను గుర్తించి, వారికి వలంటీర్ల ద్వారా సమాచారం ఇస్తోంది. గంటకు 15 మంది వేలిముద్రలు అప్‌డేట్ చేసుకునేలా ముందుగానే సమయం కేటాయిస్తోంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదుతో పాటు వివిధ రకాల ఆధార్ సేవలు అందిస్తోంది. గత నెల 29వ తేదీన 827 సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, దాదాపు 30 వేల ఆధార్ సేవలు అందజేసింది.
పిల్లల ఆధార్‌లో వేలి ముద్రల అప్‌డేట్
Published Tue, Jul 26 2022 3:49 AM | Last Updated on Tue, Jul 26 2022 7:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment