తిరుమల: డిసెంబర్ 23–జనవరి1 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను (రోజుకు 2 వేల టికెట్లు) నవంబర్ 10న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో చెప్పారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకుగాను 4.25 లక్షల టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని వివరించారు.
డిసెంబర్ 23–జనవరి 1 వరకు చంటి పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్‌ఆర్‌ఐ కోటా దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్ కొనుగోలు చేయాలని, ఈ టికెట్లను పొందిన వారికి మహా లఘు దర్శనం (జయ విజయుల వద్ద నుంచి) ఉంటుందని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 10–18 వరకు నిర్వహిస్తామని చెప్పారు.
నవంబర్ 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని, 24న చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌లో 21.75 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా..హుండీ ఆదాయం రూ.108.65 కోట్లు లభించిందన్నారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గది పొందిన వారికి అది ఖాళీ చేసిన గంటలోపు, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి 3–7 పని దినాల్లోపు కాషన్ డిపాజిట్‌ను జమ చేస్తామని చెప్పారు.
స్వామి వారి సేవలో ప్రముఖులు
శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అక్టోపస్ అడిషనల్ డీజీ (ఆపరేషన్) ఆర్కే మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment