Varadapuram Suri Occupied Hundreds Of Acres Govt Lands In Dharmavaram - Sakshi
Sakshi News home page

భూ బకాసురుడు 'వరదాపురం'

Published Sat, Jan 22 2022 1:21 PM | Last Updated on Sat, Jan 22 2022 3:14 PM

Varadapuram Suri Occupied Hundreds of Acres Govt Lands in Dharmavaram - Sakshi

సాక్షి, అనంతపురం: ఆయనో మాజీ ప్రజాప్రతినిధి. వందల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టాడు. అమాయక రైతు లను బెదిరించి కనిపించిన పొలాన్నల్లా లాక్కున్నాడు. అంతేకాదు.. అసైన్డ్‌ భూముల చట్టానికి తూట్లు పొడిచి అధికారం లో ఉండగా అక్రమంగా రిజిస్టర్‌ చేసుకున్నాడు. వాగులు, వంకలను కలిపేసుకున్నాడు. చుట్టు పక్కల పొలాలకు దారి వదలకుండా రైతులను వేధిస్తున్నాడు. ఎవరైనా సరే తనకు మాత్రమే విక్రయించాలని లేదంటే గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాడు. ఈ అరాచకాలను భరించలేక ఏకం గా ఒక గ్రామమే ఖాళీ కావటాన్ని బట్టి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో వేరే చెప్పాలా? అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అలియాస్‌ గోనుగుంట్ల సూర్యనారాయణ భూ దందాలు, దౌర్జన్యాలివీ..

 టీడీపీ అధికారంలో ఉండగా.. 
ముదిగుబ్బ మండలం ముక్తాపురం రెవెన్యూ పరిధిలో చిన్న, సన్నకారు రైతులే అధికం. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉన్న సూరి గ్రామంలో పొలాల ఆక్రమణల పర్వాన్ని ప్రారంభించాడు. నితిన్‌సాయి ఆగ్రోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 332.45 ఎకరాలను రైతుల నుంచి కారుచౌకగా కాజేశాడు. ఇందులో 155.88 ఎకరాలు ప్రభుత్వ, అనాదీన, చుక్కల భూములే కావడం గమనార్హం. నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను వరదాపురం బలవంతంగా సొంతం చేసుకున్నాడు. సూరి కుమారుడు నితిన్‌సాయి, సతీమణి నిర్మలాదేవి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. 

చండ్రాయునిపల్లి ఖాళీ 
ముక్తాపురం రెవెన్యూ పరిధిలో వందల ఎకరాలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర రైతులు పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా సూరి వేధించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే రైతుల పొలాల్లో నీళ్ల మోటార్లు, స్టార్టర్‌ పెట్టెలు రాత్రికి రాత్రే మాయమయ్యేవి. దీంతో దిక్కుతోచక అయినకాడికి అమ్ముకుని వలస వెళ్లిపోయారు. ఇలా చండ్రాయునిపల్లి అనే గ్రామం మొత్తం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అక్కడ మొండిగోడలు, కూలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. 

అసైన్‌మెంట్‌ చట్టానికి తూట్లు 
1977 అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. దీన్ని బేఖాతర్‌ చేస్తూ నితిన్‌సాయి ఆగ్రోటెక్‌ కంపెనీ పేరిట ఏకంగా 155.88 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఇందుకు అప్పట్లో రెవెన్యూ అధికారులు సహకరించారు. పాసుపుస్తకాలు సైతం మంజూరు చేసేశారు. 

ఆధారాలు ఇవిగో.. 
నితిన్‌సాయి ఆగ్రోటెక్‌ కంపెనీ పేరిట వరదాపురం సూరి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములను ఆక్రమించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ముదిగుబ్బ మండలం ముక్తాపురం పరిధిలో 48–2, 50, 52–3, 53–2, 54–1, 57–1, 57–2, 63–1, 63–2, 63–3, 84, 85–1, 85–2, 86, 87–1ఎ, 87–1బి, 87–2, 88, 96–1, 96–2, 97, 106–2,106–3, 113, 119, 134, 199, 203, 378 సర్వే నంబర్లలో ప్రభుత్వ, అనాదీన, అసైన్డ్, గయాలు లాంటి నిషేధిత జాబితాలోని భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

పొలానికి వెళ్లనివ్వడం లేదు..
ముక్తాపురం, చండ్రాయునిపల్లి మధ్యలో 330 ఎకరాలకు పైగా కొనుగోలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మేం పొలానికి వెళ్లేందుకు దారి ఇవ్వడం లేదు. అక్కడ మాకు మధ్యలో పది ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ పనులకు ఆటంకం కల్పిస్తుండంతో దిక్కు తోచడం లేదు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. 
– వెంకటేశ్‌ నాయక్, ముక్తాపురం తండా 

మా గ్రామాన్ని కాపాడండి.. 
వరదాపురం సూరి ఇక్కడ భూములు కొన్నప్పటి నుంచి మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మా పొలాల వద్దకు వెళ్లాలంటే సూరి భూములను దాటుకుని వెళ్లాలి. ఆయన మా పొలాల్లోకి వెళ్లనివ్వడం లేదు. ఈ దౌర్జన్యాలను తట్టుకోలేక ఇప్పటికే చండ్రాయునిపల్లి ఖాళీ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మేం కూడా ముక్తాపురం వదిలి వెళ్లక  తప్పదు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి. – కేశవ, ముక్తాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement